అ 'సామాన్య' ముద్ర | common man victory | Sakshi
Sakshi News home page

అ 'సామాన్య' ముద్ర

Published Mon, Dec 30 2013 12:33 AM | Last Updated on Mon, Aug 20 2018 4:05 PM

అ 'సామాన్య' ముద్ర - Sakshi

అ 'సామాన్య' ముద్ర

 రాజకీయ ప్రక్షాళనపై ప్రజల్లో ఆశలు రేకెత్తించిన ‘ఆమ్ ఆద్మీ’
 పాలకుల అవినీతి ఉదంతాలు వెలుగు చూసినప్పుడల్లా.. ప్రజా సమస్యలపై వారి ఉదాసీనత చూసినప్పుడల్లా.. సామాన్యులకు కోపం వస్తూనే ఉంటుంది. వారి నుంచి నిరసన గళం వినిపిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడూ ధర్నాలూ, రాస్తారోకోలూ చేస్తూనే ఉంటారు. ఈ నిరసనలు ఒక్కోసారి రోజులు, వారాలు నడుస్తాయి. మామూలుగా అంతటితో ఆగిపోతుంటాయి. పరిస్థితి మళ్లీ ఎప్పటిలానే ఉంటుంది. కానీ.. 2013లో ఒక అసాధారణ ‘సామాన్యుడు’ ఆవిర్భవించాడు. అవినీతికి వ్యతిరేకంగా పొలికేక పెట్టాడు. చీపురు పట్టుకుని అవినీతిని తుడిచేస్తానంటూ ఢిల్లీ వీధుల్లోకి వచ్చాడు. ముందసలు రాజకీయాలనే ప్రక్షాళన చేయాలని.. రాజకీయ వ్యవస్థను సమూలంగా మార్చేస్తామని ఎన్నికల బరిలోకి దిగాడు. మహామహులంతా ‘ఆ.. సామాన్యుడు.. ఏం చేయగలడు?’ అని తేలికగా తీసిపారేశారు. కానీ.. ఒకటిన్నర శతాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ పదిహేనేళ్ల పాలనకు చరమగీతం పాడేశాడా సామాన్యుడు. పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కురువృద్ధురాలినీ బ్యాలెట్ పోరులో మట్టికరిపించాడు. దాదాపు యాభై ఏళ్ల చరిత్ర గల ప్రతిపక్ష బీజేపీని అధికారానికి ఆమడదూరంలో నిలిపివేశాడు. కాస్త మెజారిటీ తగ్గినా.. తానే ఢిల్లీ రాష్ట్ర గద్దెనెక్కాడు. ఆ సామాన్యుడే.. ఆమ్ ఆద్మీ పార్టీ. నిండా ఏడాది వయసున్న ఒక పసికూన పార్టీ.. అంగబలం, అర్థబలం, ప్రజాకర్షణ గల హేమాహేమీలు వంటి హంగూ ఆర్భాటాలు ఏవీ లేని ఒక సామాన్య పార్టీ.. జాతి, కులం, మతం, ప్రాంతం వంటి కార్డులేవీ లేకుండా కొత్త చరిత్రను లిఖించింది. దేశంలో సరికొత్త సామాన్య రాజకీయాలకు నాంది పలికింది.
 
 ఉద్యమం నుంచి పార్టీ ఆవిర్భావం...
 సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారేతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న 45 ఏళ్ల మాజీ ఐఆర్‌ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్.. అనంతర పరిణామాల్లో ఏడాది కిందట ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. రాజకీయ పార్టీ స్థాపించటాన్ని హజారే వ్యతిరేకించినా కేజ్రీవాల్ వెనుకంజ వేయలేదు. తొలుత మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీచేశారు. అక్కడ పరాజయమే పలకరించింది. మళ్లీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. సామాన్యులకే టికెట్లు అన్నారు. ఇంటింటికీ పార్టీ కార్యకర్తలు వెళ్లారు. వారి సమస్యలు ఏమిటో అడిగారు. ఆ సమస్యలన్నిటినీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వస్తే.. సామాన్య ప్రజల సమస్యలన్నిటినీ తీరుస్తామన్నారు. ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ హవా ఉంటుందని సర్వేలు చెప్పటం మొదలైంది. అంత సీన్ లేదని ప్రధాన పార్టీలు కొట్టిపారేశాయి. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్, బీజేపీలు దిగ్భ్రాంతి చెందాయి. రాజకీయ నిపుణులు ఆశ్చర్యపోయారు. సామాన్య ప్రజల్లో హర్షాతిరేకాలు పెల్లుబికాయి. ఆ ఫలితాలతో దేశంలో సైతం ప్రజాస్వామ్య రాజకీయాల ప్రక్షాళనపై కొత్త ఆశలు చిగురించాయి. వరుసగా పదిహేనేళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ మట్టి కరిచింది. కేవలం 8 సీట్లు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై కేజ్రీవాల్ స్వయంగా పోటీచేశారు. అది దుస్సాహసం అని చాలా మంది అనుకున్నారు. కేజ్రీవాల్ తిరుగులేని ఆధిక్యంతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి షీలాదీక్షిత్‌కు, బీజేపీ అభ్యర్థికి పోలైన ఓట్లను కలిపి కూడినా.. కేజ్రీవాల్‌కు పోలైన ఓట్లకు అందనంత దూరంలో ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 సీట్లు లభించాయి. రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీజేపీ 30 సీట్లతో పెద్ద పార్టీగా నిలిచింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీ ఏ పార్టీకీ రాలేదు.
 
 హంగ్‌లో హార్స్ ట్రేడింగ్ మాయం..!
 హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు.. మెజారిటీకి దగ్గరగా వచ్చిన పార్టీలు.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి ఏ రకంగానైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సాధారణంగా చేసే ప్రయత్నాలేవీ ఈసారి ఢిల్లీ విషయంలో మచ్చుకైనా కనిపించలేదు.  పెద్ద పార్టీలు రెండూ కూడా ‘ప్రజా తీర్పును అనుసరించి’ ప్రతిపక్షంలోనే కూర్చుంటామన్నాయి. చిత్రమేమిటంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. తాము మద్దతిస్తామని అతి చిన్న పార్టీ కాంగ్రెస్‌తో పాటు.. అతిపెద్ద పార్టీ బీజేపీ కూడా ప్రకటించింది. ఏ పార్టీ తమపై అవినీతి ముద్రవేసి దారుణంగా ఓడించిందో అదే పార్టీకి మద్దతిస్తామని కాంగ్రెస్ ముందుకు రావటం.. ప్రధాన స్రవంతి రాజకీయ ఆలోచనల్లో ‘సామాన్యుడు’ తెచ్చిన కీలక మార్పు. ఇక ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకుండా.. మద్దతు సమీకరణకు ప్రయత్నించకుండా.. రెండో పెద్ద పార్టీకి మద్దతిస్తామని చెప్పటం కూడా.. ప్రధాన పార్టీల ఆలోచన, ఆచరణల్లో ‘సామాన్యుడు’ ప్రాథమికంగా తీసుకువచ్చిన మార్పు. రెండు పార్టీల మద్దతునూ తొలుత నిరాకరించిన ఆప్.. ఆ తర్వాత ఆ రెండు పార్టీలకూ కొన్ని షరతులు పెడుతూ.. వాటిని అంగీకరిస్తారా? అని లేఖలు రాసింది. ప్రభుత్వ ఏర్పాటుపై సొంతంగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. వాటి ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. డిసెంబర్ 28వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
 
 ఈ ‘సామాన్యుడు’ ఆశలు నెరవేర్చేనా?
 భారత రాజకీయ యవనికపై.. ఢిల్లీ అసెంబ్లీ బరిలో సుడిగాలిలా దూసుకొచ్చి.. సంచలనం సృష్టించి.. పెను మార్పును ముందుకు తెచ్చిన ‘ఆమ్ ఆద్మీ’ విజయప్రస్థానం కొనసాగుతుందా? స్వచ్ఛమైన రాజకీయాలు అందించగలుగుతుందా? ఇచ్చిన హామీలను నెరవేర్చగలుగుతుందా? అన్న సందేహాలు వేదిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే.. ‘తరాల తరబడి తిష్టవేసిన అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేయటం.. చెప్పినంత సులువు కాదు. ఏది ఏమైనా మూస రాజకీయాలపై విసిగివేసారిన సామాన్యులకు ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త ప్రత్యామ్నాయంగా..  ఆశాదీపంలా అందివచ్చిందనేది.. ప్రధాన స్రవంతి పార్టీలన్నీ మళ్లీ సామాన్యుడి కేంద్రంగా ఆలోచించేలా చేశాయనేది.. అందరూ అంగీకరిస్తున్న విషయం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement