నా పరువు తీసే కుట్ర
నా తీర్పులు గిట్టని వారి పనే
సీజేఐకి జస్టిస్ గంగూలీ లేఖ
కోల్‌కతా: జడ్జిగా తాను ఇచ్చిన కొన్ని తీర్పులు గిట్టని శక్తిమంతులు తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ ఆరోపించారు. తన పైవచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ విషయంలో సుప్రీం కోర్టు తన వాదనను సరిగ్గా లేదని, తన పట్ల తగిన విధంగా వ్యవహరించలేదని ఆక్షేపించారు. ఈమేరకు ఆయన భారత ప్రధాన న్యాయూర్తి(సీజేఐ) జస్టిస్ పి.సదాశివంకు ఫిర్యాదు చేస్తూ సోమవారం 8పేజీల లేఖ రాశారు. లేఖ ప్రతిని రాష్ట్రపతికి కూడా పంపుతున్నట్లు తెలిపారు. 2జీ స్కాంలో 122 స్పెక్ట్రమ్ లెసైన్సులను రద్దు చేసిన సుప్రీం కోర్టు బెంచిలో గంగూలీ ఒకరు. గంగూలీ తన వద్ద పనిచేసే న్యాయ విద్యార్థిని(ఇంటర్న్)పై గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీ హోటల్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు జడ్జీల కమిటీ.. హోటల్ గదిలో ఆయన ప్రవర్తన కామాపేక్షంగా ఉందని అభిశంసించడం, పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని ఆయనపై ఒత్తిడి వస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సీజేఐకి లేఖ రాశారు.
‘దురదృష్టవశాత్తూ నేను బలవంతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కొన్ని తీర్పులిచ్చిన విధి నిర్వహించాను గనుక నా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం సాగుతోంది. ఇదంతా కొందరి తరఫున నాపై బురదజల్లే కుట్ర’ అని పేర్కొన్నారు. తాను ఇంటర్న్‌పై లైంగిక వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తనపై విచారణ కు సుప్రీం కోర్టు వేసిన కమిటీ చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ కేసులో తాను కోర్టుకు హాజరైనప్పుడు కోర్టు అధికారులు తనను చుట్టుముట్టి, తాను ఖైదీనన్నట్లు ప్రవర్తించారన్నారు.
జస్టిస్ గంగూలీ ఇచ్చిన కీలక తీర్పులు
గంగూలీ సుప్రీం కోర్టు జడ్జీగా, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు పలు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. 2జీ స్కాంలో ఆయన తీర్పు కేంద్రాన్ని ఓ కుదుపు కుదిపింది. ఆయన 2008లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు మనుషులతో పారిశుద్ధ్య పనులు చేయించడాన్ని నిషేధించారు. అంబేద్కర్ లా కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు న్యాయవిద్యలో భారీ సంస్కరణలకు తెరతీశారు. ఆ కాలేజీలో రాజకీయ, కుల ఆధారిత కార్యక్రమాలను నిషేధించారు. చెన్నైలో బహిరంగ సభల నిర్వహణపై గంగూలీ జారీచేసిన మార్గదర్శకాల వల్ల అర్ధరాత్రి లౌడ్ స్పీకర్ల గోల, ట్రాఫిక్ చిక్కులు తప్పాయి. ఆయన ఊటీలో క్వారీయింగ్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీచేశారు.