Justice A K Ganguly
-
జస్టిస్ గంగూలీ రాజీనామా బాధించింది:సోమ్‌నాథ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మానవ హక్కువ కమీషన్(డబ్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామా చేయడంపై లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గంగూలీ రాజీనామా అంశం తనను బాధించిందని పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు, విచారణ లేకుండా గంగూలీ మానవ హక్కువ కమీషన్ నుంచి వైదొలగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'మన న్యాయ వ్యవస్థలో ఎవరి మీదనైనా ఆరోపణలు వచ్చినపుడు తప్పు చేసినట్లు నిర్ధారించబడాలన్నారు. కాని పక్షంలో అతను నిర్దోషేనని' చటర్జీ తెలిపారు. జస్టిస్ గంగూలీ విషయంలో నిబంధనలను సరిగా పాటించలేదన్నారు. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ దర్యాప్తు కూడా రాజ్యాంగ విరుద్ధంగా సాగిందన్నారు. గంగూలీ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసే సమయంలో ఎవరూ కూడా అతనిపై అనుమానం వ్యక్తం చేయలేదనే విషయాన్ని చటర్జీ ప్రస్తావించారు. ఇదిలా ఉండగా తృణముల్ కాంగ్రెస్ మాత్రం గంగూలీ రాజీనామాను ఆహ్వానించింది. అతను రాజీనామా చేసి తన ప్రతిష్టను మరింత దిగజారకుండా కాపాడుకున్నారని ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తెలిపారు.ఆయన రాజీనామాను ఇంకా ముందుచేయాల్సిందని, ఇప్పటికైనా పదవి నుంచి తప్పుకోవడం పట్ల తృణముల్ సంతోషంగా ఉందన్నారు. న్యాయ శాస్త్ర విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
డబ్యూబీహెచ్ఆర్సీ పదవికి గంగూలీ రాజీనామా
-
డబ్యూబీహెచ్ఆర్సీ పదవికి గంగూలీ రాజీనామా
కోల్‌కతా: న్యాయ శాస్త్ర విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గంగూలీ పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిటీ చైర్మన్(డబ్యూబీహెచ్ఆర్సీ) పదవికి రాజీనామా చేశారు.ఈ రోజు రాష్ట్ర గవర్నర్ ను కలిసిన ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్ లో గౌరవ ప్రొఫెసర్ పదవికి శుక్రవారం రాజీనామా చేసిన ఆయన మానవ హక్కుల చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. ఏకే గంగూలీ ప్రవర్తన అనుచితమైనదేనని, లైంగిక స్వభావం కలిగి ఉన్నదని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అభిశంసించడానికి కారణమైన ఫిర్యాదును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో గంగూలీ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. -
గౌరవ ప్రొఫెసర్ పదవికి గంగూలీ రాజీనామా
కోల్‌కతా/న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటు న్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్‌కుమార్ గంగూలీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్ (ఎన్‌యూజేఎస్)లో గౌరవ ప్రొఫెసర్ పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆయనపై ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థిని(ఇంటర్న్) ఎన్‌యూజేఎస్ విద్యార్థి కావడం గమనార్హం. ఆరోపణల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించేందుకు, తదుపరి ఆయనపై విచారణ చేపట్టేందుకు వీలుగా రాష్ర్టపతి నివేదన కోరాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో గౌరవ ప్రొఫెసర్ పదవికి గంగూలీ రాజీ నామా చేయడం గమనార్హం. తనను కొనసాగించడంపై ఫ్యాకల్టీకి చెందిన కొందరు సభ్యులు అభ్యం తరం వ్యక్తం చేసినందున.. రాజీనామాను పంపినట్టు గంగూలీ ఓ వార్తాసంస్థతో చెప్పారు. -
జస్టిస్ గంగూలీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించేందుకు, తదుపరి ఆయనపై విచారణ చేపట్టేందుకు వీలుగా రాష్ర్టపతి ప్రస్థావన తేవాలన్న కేంద్ర హోం శాఖ ప్రతిపాదనకు ప్రధాని మన్మోహన్ సింగ్ నేతత్వంలో శుక్రవారం ఇక్కడ భేటీ అయిన కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. అటార్నీ జనరల్ వాహనవతి సూచనల మేరకు హోం శాఖ రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపి ఆయన ప్రస్థావన ద్వారా గంగూలీపై సుప్రీం కోర్టు విచారణను కోరాలని కేబినెట్ నిర్ణయించింది. భేటీ అనంతరం ఆర్థిక మంత్రి పి.చిదంబరం, సమాచార, ప్రసారశాఖ మంత్రి మనీష్ తివారీలు పాత్రికేయులతో మాట్లాడుతూ, జస్టిస్ గంగూలీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రపతి ప్రస్థావన కోరాలన్న హోం శాఖ ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు. దీనిపై మరిన్ని వివరాలను హోం శాఖే సరైన సమయంలో వెల్లడిస్తుందని చెప్పారు. మూడు ప్రధాన ఆరోపణలు ఇవే.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ గంగూలీ జాబితాలోకి మరో రెండు ప్రధాన ఆరోపణలు వచ్చి చేరాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా పాకిస్థాన్‌కు వెళ్లడం, హక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉండి కూడా అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించడంపై కూడా హోం శాఖ దష్టి సారించింది. -
నా పరువు తీసే కుట్ర
నా తీర్పులు గిట్టని వారి పనే సీజేఐకి జస్టిస్ గంగూలీ లేఖ కోల్‌కతా: జడ్జిగా తాను ఇచ్చిన కొన్ని తీర్పులు గిట్టని శక్తిమంతులు తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీం కోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ ఆరోపించారు. తన పైవచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ విషయంలో సుప్రీం కోర్టు తన వాదనను సరిగ్గా లేదని, తన పట్ల తగిన విధంగా వ్యవహరించలేదని ఆక్షేపించారు. ఈమేరకు ఆయన భారత ప్రధాన న్యాయూర్తి(సీజేఐ) జస్టిస్ పి.సదాశివంకు ఫిర్యాదు చేస్తూ సోమవారం 8పేజీల లేఖ రాశారు. లేఖ ప్రతిని రాష్ట్రపతికి కూడా పంపుతున్నట్లు తెలిపారు. 2జీ స్కాంలో 122 స్పెక్ట్రమ్ లెసైన్సులను రద్దు చేసిన సుప్రీం కోర్టు బెంచిలో గంగూలీ ఒకరు. గంగూలీ తన వద్ద పనిచేసే న్యాయ విద్యార్థిని(ఇంటర్న్)పై గత ఏడాది డిసెంబర్లో ఢిల్లీ హోటల్లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు జడ్జీల కమిటీ.. హోటల్ గదిలో ఆయన ప్రవర్తన కామాపేక్షంగా ఉందని అభిశంసించడం, పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని ఆయనపై ఒత్తిడి వస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సీజేఐకి లేఖ రాశారు. ‘దురదృష్టవశాత్తూ నేను బలవంతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కొన్ని తీర్పులిచ్చిన విధి నిర్వహించాను గనుక నా ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం సాగుతోంది. ఇదంతా కొందరి తరఫున నాపై బురదజల్లే కుట్ర’ అని పేర్కొన్నారు. తాను ఇంటర్న్‌పై లైంగిక వేధింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తనపై విచారణ కు సుప్రీం కోర్టు వేసిన కమిటీ చట్టబద్ధతను ప్రశ్నించారు. ఈ కేసులో తాను కోర్టుకు హాజరైనప్పుడు కోర్టు అధికారులు తనను చుట్టుముట్టి, తాను ఖైదీనన్నట్లు ప్రవర్తించారన్నారు. జస్టిస్ గంగూలీ ఇచ్చిన కీలక తీర్పులు గంగూలీ సుప్రీం కోర్టు జడ్జీగా, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు పలు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చారు. 2జీ స్కాంలో ఆయన తీర్పు కేంద్రాన్ని ఓ కుదుపు కుదిపింది. ఆయన 2008లో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు మనుషులతో పారిశుద్ధ్య పనులు చేయించడాన్ని నిషేధించారు. అంబేద్కర్ లా కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు న్యాయవిద్యలో భారీ సంస్కరణలకు తెరతీశారు. ఆ కాలేజీలో రాజకీయ, కుల ఆధారిత కార్యక్రమాలను నిషేధించారు. చెన్నైలో బహిరంగ సభల నిర్వహణపై గంగూలీ జారీచేసిన మార్గదర్శకాల వల్ల అర్ధరాత్రి లౌడ్ స్పీకర్ల గోల, ట్రాఫిక్ చిక్కులు తప్పాయి. ఆయన ఊటీలో క్వారీయింగ్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీచేశారు. -
పెద్దల పాడు పనులు!
సమాజంలో బాధ్యయుత స్థానాల్లో ఉన్నవారు హుందాగా మెలగాలి. మరీ ముఖ్యంగా గౌరవ ప్రదమైన ఉన్నత స్థానాల్లో ఉన్నవారు మరింత హుందాగా నడుకోవాల్సివుంటుంది. తమ కింద పనిచేసే వారి పట్ల మర్యాదగా వ్యహరించాల్సిన పెద్దలు దారి తప్పుతుండడం ఆందోళన కలిగించే పరిణామం. ఉన్నత స్థానాల్లో వ్యక్తులు స్త్రీల పట్ల చులకగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు అధికమడం సాధారణంగా మారింది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన తరుణ్ తేజ్‌పాల్, జస్టిస్ ఏకే గంగూలీ వివాదాలే ఇందుకు ఉదాహరణ. సంచలనాత్మక ‘స్టింగ్’ ఆపరేషన్లతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తెహల్కా పత్రిక ఇప్పుడు కష్టాల్లో పడింది. దానికి కారణం ఆ ప్రతిక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్. అవినీతిపరులైన బడా నేతలతో తలపడే ధీరుడిగా పేరు గాంచిన తేజ్‌పాల్ తన కూతురి స్నేహితురాలిపై వికృతచేష్టలతో జైలుపాలయ్యారు. ‘స్టింగ్’ జర్నలిజానికి చిరునామాగా మారిన తేజ్‌పాల్ దారి తప్పి ఊచలు లెక్కిస్తున్నారు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరోను కలుద్దామని ఆశ పెట్టి గోవా స్టార్ హోటల్లో బాధితురాలిని లిఫ్టులోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారన్న ఆరోపణలతో తేజ్‌పాల్ ఆట కట్టించారు. పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీపై లైంగిక వేధింపులు ఆరోపణలు వచ్చాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం జడ్జిగా పనిచేసి రిటైరైన గంగూలీపై న్యాయవిద్యార్థిని ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. నిర్భయ ఉదంతంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో తన పట్ల జడ్జిగారు అనుచితంగా ప్రవర్తించారని బాధితురాలు వెల్లడించడంలో కలకలం రేగింది. న్యూఢిల్లీలోని లె మెరిడియన్ హోటల్లోని గదిలో జస్టిస్ గంగూలీ గత ఏడాది డిసెంబర్ 24న రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల మధ్య తనను వేధించారని తెలిపింది. మద్యం తాగాలని కోరారని, కామపేక్షతో కనబరచారని బాధితురాలు వాపోయింది. అయితే తాను వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గారని చెప్పింది. తాను బయటకు వెళ్లిన తర్వాత తన వెనకకే వచ్చి లోపల జరిగిన దానికి సారీ కూడా చెప్పారని ఆమె వెల్లడించింది. ఈ ఉదంతంపై ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ కూడా దీన్ని నిర్ధారించింది. అయితే ఘటన జరిగిన నాటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గంగూలీ రిటైరైనందున ఆయనపై తదుపరి చర్యలు తీసుకోబోమని తెలిపింది. మహిళా భద్రత ప్రశ్నార్థకమైన తరుణంలో ఉన్నత స్థానాల్లో వ్యక్తులు దిగజారి ప్రవర్తిస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తమను ఏమీ చేయరన్న దీమాతో లేదా బాధితులు ఎవరికీ చెప్పుకోలేరన్న ధైర్యంతో 'పెద్దోళ్లు' పాడు పనులకు దిగుతున్నారు. వయసుపైబడిన వారు తమ కూతురి వయసున్న యువతులపై అకృత్యాలకు తెగబడుతుండడం ప్రమాదకర పరిణామం. తరుణ్ తేజ్‌పాల్(50), ఏకే గంగూలీ(66) ఇద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నవారే కాదు వయసులోనే పెద్దవారే కావడం గమనార్హం. వికృత చేష్టలతో తమ పెద్దరికానికే కాదు, తమ పదవులకు కళంకం తెచ్చారు. చేసిన పనులకు సిగ్గుపడడం పోయి సమర్థించుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. మహిళ భద్రతకు ఢోకా లేని సమాజంగా అవతరించాలంటే తక్షణ సామాజిక విలువల సంస్కరణ జరగాలి. -
మహిళలపై ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ: మహిళలను వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోరాదంటూ కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరులశాఖ మంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. లైంగిక వేధింపుల ఫిర్యాదు దాఖలైతే పురుషులు జైలు పాలయ్యే అవకాశం ఉందని ఫరూక్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావటంతో అనంతరం ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెప్పాల్సిందేనని తన తనయుడు, కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సూచించటంతో ఫరూక్ కాళ్ల బేరానికి వచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గంగూలీ, ఇతర ప్రముఖులు లైంగిక వేధింపుల వివాదంలో చిక్కుకోవటంపై శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ ఫరూక్ ఈ వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది. ‘ఓ మహిళను కార్యదర్శిగా నియమించుకోరాదని నేను భావిస్తున్నా. కర్మకాలి ఏదైనా ఫిర్యాదు దాఖలైందంటే మేం జైలు పాలు కావాల్సిందే’ అని పార్లమెంట్ భవనం వద్ద ఆయన మీడియాతో పేర్కొన్నారు. -
జస్టిస్ గంగూలీది అనుచిత ప్రవర్తనే
* దర్యాప్తులో తేల్చిన సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ * న్యాయమూర్తిగా రిటైరైనందున చర్యలు తీసుకోరాదని నిర్ణయం * ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వెల్లువెత్తిన డిమాండ్లు * గంగూలీ రాజీనామాకు బీజేపీ, తృణమూల్ డిమాండ్ న్యూఢిల్లీ: న్యాయ విద్యార్థిని పట్ల జస్టిస్ ఏకే గంగూలీ ప్రవర్తన అనుచితమైనదేనని, లైంగిక స్వభావం కలిగి ఉన్నదని, అది పూర్తిగా అవాంఛనీయమైనదని ముగ్గురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ తన దర్యాప్తులో తేల్చింది. జస్టిస్ గంగూలీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఇటీవల జస్టిస్ ఆర్.ఎం.లోధా, జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ రంజనా దేశాయ్‌లతో కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. అయితే, సంఘటన జరిగిన రోజునే... గత ఏడాది డిసెంబర్ 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గంగూలీ రిటైరైనందున ఆయనపై తదుపరి చర్యలు తీసుకోరాదని నిర్ణయించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న జస్టిస్ గంగూలీ తన పదవికి రాజీనామా చేయాలని, సుప్రీంకోర్టు కమిటీ ఆయనను అభిశంసించినందున ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని విమర్శలు వెల్లువెత్తాయి. కమిటీ నివేదిక ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం రెండు పేజీల ప్రకటనను విడుదల చేశారు. బాధితురాలైన న్యాయ విద్యార్థిని మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలాలను కమిటీ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. జస్టిస్ సదాశివం ప్రకటనలోని వివరాల ప్రకారం... లె మెరిడియన్ హోటల్లోని గదిలో జస్టిస్ గంగూలీ గత ఏడాది డిసెంబర్ 24న రాత్రి 8 గంటల నుంచి 10.30 గంటల మధ్య బాధితురాలి పట్ల మాటల్లోను, చేతల్లోను అనుచితంగా ప్రవర్తించినట్లు కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి ప్రకటన విడుదలైన వెంటనే, జస్టిస్ గంగూలీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. జస్టిస్ గంగూలీని సుప్రీంకోర్టు కమిటీ అభిశంసించినందున పోలీసులు సుమోటోగానే ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని సీనియర్ న్యాయవాది పినాకీ మిశ్రా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు కమిటీ నివేదికపై అదనపు సొలిసిటర్ జనరల్ ఇంద్రా జైసింగ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, జస్టిస్ గంగూలీపై వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్న జస్టిస్ గంగూలీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత రాయ్ డిమాండ్ చేశారు. న్యాయ విద్యార్థిని పట్ల అనుచిత ప్రవర్తనకు పాల్పడినందుకు అభిశంసనకు గురైన జస్టిస్ గంగూలీ పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవిలో కొనసాగడం పూర్తిగా అసమంజసమని సుష్మా ‘ట్విట్టర్’లో వ్యాఖ్యానించారు. అయితే, ఘటన ఢిల్లీలో జరిగినందున దీనిపై ఢిల్లీ పోలీసులు మాత్రమే చర్యలు తీసుకోగలర ని, ఒకవేళ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, గంగూలీపై కోల్‌కతా పోలీసులు చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుందని సౌగత రాయ్ అన్నారు. నేనేమీ చెప్పదలచుకోలేదు: గంగూలీ న్యాయ విద్యార్థిని పట్ల అనుచిత ప్రవర్తన వ్యవహారంలో సుప్రీంకోర్టు కమిటీ అభిశంసనపై స్పందించేందుకు జస్టిస్ గంగూలీ నిరాకరించారు. ఈ అంశంపై తానేమీ చెప్పదలచుకోలేదన్నారు. సుప్రీం నివేదికలో ఏముందో తనకు తెలియదని చెప్పారు. పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లపై ప్రశ్నించగా, ఈ విషయమై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ అంశంపై ఆలోచించే సమయం ఇంకా రాలేదని చెప్పారు. కాగా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు గత ఏడాది డిసెంబర్ 24న ఢిల్లీలోని ఒక హోటల్లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు న్యాయ విద్యార్థిని ఆరోపించడంతో.. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం దర్యాప్తు కమిటీని నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతికి మమత లేఖ జస్టిస్ గంగూలీపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. కాగా, ఈ వ్యవహారాన్ని ముగిసిన అధ్యాయంగా పరిగణించాలని న్యాయశాఖ మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ అభిప్రాయపడ్డారు.