న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించేందుకు, తదుపరి ఆయనపై విచారణ చేపట్టేందుకు వీలుగా రాష్ర్టపతి ప్రస్థావన తేవాలన్న కేంద్ర హోం శాఖ ప్రతిపాదనకు ప్రధాని మన్మోహన్ సింగ్ నేతత్వంలో శుక్రవారం ఇక్కడ భేటీ అయిన కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. అటార్నీ జనరల్ వాహనవతి సూచనల మేరకు హోం శాఖ రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపి ఆయన ప్రస్థావన ద్వారా గంగూలీపై సుప్రీం కోర్టు విచారణను కోరాలని కేబినెట్ నిర్ణయించింది.
భేటీ అనంతరం ఆర్థిక మంత్రి పి.చిదంబరం, సమాచార, ప్రసారశాఖ మంత్రి మనీష్ తివారీలు పాత్రికేయులతో మాట్లాడుతూ, జస్టిస్ గంగూలీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రపతి ప్రస్థావన కోరాలన్న హోం శాఖ ప్రతిపాదనకు కేబినెట్ అంగీకారం తెలిపిందన్నారు. దీనిపై మరిన్ని వివరాలను హోం శాఖే సరైన సమయంలో వెల్లడిస్తుందని చెప్పారు.
మూడు ప్రధాన ఆరోపణలు ఇవే..
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ గంగూలీ జాబితాలోకి మరో రెండు ప్రధాన ఆరోపణలు వచ్చి చేరాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా పాకిస్థాన్‌కు వెళ్లడం, హక్కుల కమిషన్ చైర్మన్‌గా ఉండి కూడా అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు మధ్యవర్తిగా వ్యవహరించడంపై కూడా హోం శాఖ దష్టి సారించింది.