కోల్కతా: పశ్చిమ బెంగాల్ మానవ హక్కువ కమీషన్(డబ్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామా చేయడంపై లోక్సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గంగూలీ రాజీనామా అంశం తనను బాధించిందని పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు, విచారణ లేకుండా గంగూలీ మానవ హక్కువ కమీషన్ నుంచి వైదొలగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'మన న్యాయ వ్యవస్థలో ఎవరి మీదనైనా ఆరోపణలు వచ్చినపుడు తప్పు చేసినట్లు నిర్ధారించబడాలన్నారు. కాని పక్షంలో అతను నిర్దోషేనని' చటర్జీ తెలిపారు.
జస్టిస్ గంగూలీ విషయంలో నిబంధనలను సరిగా పాటించలేదన్నారు. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ దర్యాప్తు కూడా రాజ్యాంగ విరుద్ధంగా సాగిందన్నారు. గంగూలీ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసే సమయంలో ఎవరూ కూడా అతనిపై అనుమానం వ్యక్తం చేయలేదనే విషయాన్ని చటర్జీ ప్రస్తావించారు. ఇదిలా ఉండగా తృణముల్ కాంగ్రెస్ మాత్రం గంగూలీ రాజీనామాను ఆహ్వానించింది. అతను రాజీనామా చేసి తన ప్రతిష్టను మరింత దిగజారకుండా కాపాడుకున్నారని ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తెలిపారు.ఆయన రాజీనామాను ఇంకా ముందుచేయాల్సిందని, ఇప్పటికైనా పదవి నుంచి తప్పుకోవడం పట్ల తృణముల్ సంతోషంగా ఉందన్నారు. న్యాయ శాస్త్ర విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.