Somnath Chatterjee
-
లోక్‌సభకు ఎక్కువసార్లు నెగ్గింది ఎవరంటే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సీనియర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు ఐదోసారి, మరికొందరు ఏడోసారి ఎంపీల రేసులో ఉన్నారు. 1952లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే లోక్‌సభకు ఎక్కువసార్లు ఎవరు గెలిచారనే విషయానికొస్తే..ఇంద్రజీత్ గుప్తా(11 సార్లు): లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా కమ్యూనిస్టు నేత ఇందర్జిత్ గుప్తా రికార్డు సృష్టించారు. 1960లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో చివరిసారిగా ఎంపీ అయ్యారు. ఇంద్రజిత్ గుప్తా తన జీవితకాలంలో 11 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.సోమనాథ్ ఛటర్జీ(10 సార్లు):1929 జూలై 25న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించిన సోమనాథ్ ఛటర్జీ లోక్‌సభ ఎన్నికల్లో 10 సార్లు గెలిచారు. ఛటర్జీకి 1996లో 'అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు' లభించింది.పీఎం సయీద్ (10 సార్లు):పీఎం సయీద్ 1967 నుండి 1999 వరకు వరుసగా 10 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.అటల్ బిహారీ వాజ్‌పేయి(9 సార్లు)మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అటల్ జీకి నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంటరీ అనుభవం ఉంది. మరికొందరు నేతలు కూడా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారుకమల్ నాథ్: లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఒకరు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా లోక్‌సభ స్థానం ఆయనకు బలమైన కోటగా పరిగణిస్తారు. కమల్‌నాథ్ 1980లో తొలిసారిగా ఇక్కడి నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు.మాధవ్ రావ్ సింధియా: దివంగత నేత మాధవరావు సింధియా 1971లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఉన్నారు. గ్వాలియర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కూడా ఆయన ఓడించారు.ఖగపతి ప్రదాని: ఒడిశాలోని నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ దివంగత నేత ఖగపతి ప్రదాని రికార్డు సృష్టించారు. 1999లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.గిరిధర్ గోమాంగ్: కాంగ్రెస్ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు విజయం సాధించారు. కోరాపుట్ నియోజకవర్గం నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.రామ్‌విలాస్ పాశ్వాన్: తొమ్మిదిసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నేతల్లో రామ్‌విలాస్ పాశ్వాన్ పేరుంది. రామ్ విలాస్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు, రోస్రా లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు.జార్జ్ ఫెర్నాండెజ్: లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కూడా ఒకరు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. అతను బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు, నలంద నుంచి మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.బాసుదేబ్ ఆచార్య: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ(ఎం) నేత వాసుదేబ్ ఆచార్య తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందారు. వాసుదేబ్ ఆచార్య 1980లో తొలిసారిగా బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.మాణిక్‌రావ్ హోడల్యా గవిత్: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ హోడల్యా గవిత్ లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 1981లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.వీరంతా ఎనిమిది సార్లు: బీజేపీ నేత సంతోష్ గంగ్వార్ లోక్‌సభ ఎన్నికల్లో బరేలీ స్థానం నుంచి ఎనిమిది సార్లు గెలిచారు. సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు విజయం సాధించారు. సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. -
ముగ్గురు ధీరుల మహాభినిష్క్రమణం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి, ప్రజలను ప్రభావితం చేసిన నేతల పదికాలాల పాటు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి నేత మహా నేతల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, సోమనాథ్ చటర్జీ, కరుణానిధి ఉంటారు. ఈ మహోన్నత నేతలను పది రోజుల వ్యవధిలోనే దేశం కోల్పోయింది. భిన్న సంస్కృతులు, విభిన్న సిద్ధాంతాలు, రాజకీయ వ్యవహారాలను కలిగిన వారైనప్పటికీ దేశవ్యాప్త గుర్తింపు, మన్ననలను అందుకోవడమే వారి విశిష్టత. ఒకరు ప్రధానమంత్రిగా దేశానికి దిశానిర్దేశం చేస్తే, మరొకరు లోక్‌సభ స్పీకర్‌గా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారు. ఇంకొకరు ముఖ్యమంత్రిగా ప్రజల్లో ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా పాలన అందించారు. అత్యున్నత స్థానాలను అలంకరించిన వారు ఆ పదవులకే వన్నెలద్దారు. స్వాతంత్య్రానికి ముందే జన్మించిన ఈ ముగ్గురిలో ఇద్దరు ఉన్నత విద్యను అభ్యసించగా.. ప్రాథమిక విద్యతోనే సరిపెట్టినా ప్రజాస్వామ్య విలువలను ఔపోసన పట్టారు. విభిన్న సిద్ధాంతాలతో ప్రజలను ప్రభావితం చేశారు. వాక్ఫటిమతో సభికులను సమ్మోహితుల్ని చేయడం, ఉత్తేజితుల్ని కావించడం, ఉత్తమ నాయకత్వంతో అనేకమంది యువతకు మార్గదర్శకులుగా నిలవడం వారికే చెల్లుబాటైంది. రాజకీయేతర కుటుంబాల నుంచి వచ్చినా స్వయంశక్తితో ఎదిగి రాజకీయాలకే సొబగులు అద్దారు. ఈనెల 7న కరుణానిధి, 13న సోమనాథ్, 16న వాజ్‌పేయి తుదిశ్వాస విడిచారు. నిజమైన భారతరత్నం వాజ్‌పేయి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేకుండా భారత ప్రధానిగా పదవిని అలంకరించిన తొలి నేత వాజ్‌పేయి. అదే పదవిని మూడు పర్యాయాలు అధిష్టించారు. కవిగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రజాప్రతినిధులను సంతల్లో పశువుల్లా కొనుగోలు చేసే నేతలున్న ప్రస్తుత తరుణంలో కేవలం ఒక్క ఓటును తక్కువైనా విలువలకు కట్టుబడి ప్రధాని పదవినే తృణప్రాయంగా వదులుకున్నారు. పదిసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అటల్.. స్వపక్షం నుంచి మాత్రమే కాదు విపక్షం నుంచి మన్ననలు అందుకుని ఉత్తమ పార్లమెంటేరియన్ అయ్యారు. జనతాపార్టీ పతనానంతరం 1980లో భారతీయ జనతాపార్టీని ఏర్పాటుచేసి తొలి అధ్యక్షుడయ్యారు. ఆయన నేతృత్వంలో 1984లో కేవలం రెండు సీట్లకు పరిమితమైన పార్టీ అనతి కాలంలోనే అధికారం చేపట్టే దిశగా ఎదగడంలో వాజ్‌పేయి కీలకపాత్ర పోషించారు. అటల్జీ ప్రతిపక్ష నేతగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా దేశ రాజకీయాల్లో అందరికీ ఇష్టులైన భారతరత్నగా మిగిలిపోయారు. ప్రజల్లో నిలిచిన కలైజ్ఞర్ దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ముత్తువేల్ కరుణానిధిది అత్యంత ప్రత్యేక స్థానం. పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించిన ఆయన తొలిసారి 1957లో 33వ ఏట ఎమ్మెల్యే అయ్యారు. అయిదు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా, 13 పర్యాయాలు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. కవిగా, కథా రచయితగా, సంభాషణల రచయితగా, సినీ ప్రముఖునిగా, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడిగా, పాలనాదక్షుడిగా తనదైన పాలన సాగించి ప్రజల మనసుల్లో కలైజ్ఞర్‌గా నిలిచిపోయారు. ద్రవిడ ఉద్యమ నేతగా దేశ రాజకీయాలలో దక్షిణాది వారి ప్రత్యేకత చూపించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే హక్కు లభించింది కరుణానిధి కృషివల్లే. సంక్షోభ సమయాల్లో ఎంత నిబ్బరంగా ఉండాలో, ఎలా ఆచితూచి ప్రవర్తించాలో కరుణానిధిని చూసి నేర్చుకోవాలని ఆయన సమకాలికులు చెపుతుంటారు. ద్రవిడ ఉద్యమ నేతైనా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో సన్నిహితంగా మెలుగుతూ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించేవారు. ఎంజీఆర్ కేంద్రంతో చేతులు కలిపి కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించినా, జయలలిత అరెస్టు చేయించినా పార్టీని చెక్కుచెదరకుండా నిలబెట్టిన ఘనుడిగా వినుతికెక్కారు. సోమనాథ్ ది జెంటిల్మన్ పది సార్లు పార్లమెంటేరియన్‌గా, లోక్‌సభ స్పీకర్ హోదాలో అన్ని పార్టీల నేతల వద్ద జెంటిల్మన్గా సోమనాథ్ ఛటర్జీ ప్రత్యేక గుర్తింపు పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయలో చదివిన ఆయన.. ప్రముఖ ట్రేడ్ యూనియన్ నేతగా ఎదిగారు. సుప్రీం కోర్టు లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. సీపీఎంలో చేరి 1971లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. స్పీకర్ పదవిని అలంకరించిన తొట్టతొలి కమ్యూనిస్టు నేతగా ఛటర్జీ చరిత్రలో నిలిచిపోయారు. 2008లో అమెరికా–భారత అణు ఒప్పందం నేపథ్యంలో స్పీకర్ పదవికి రాజీనామా చేయాలన్న సీసీఎం అధినాయకత్వం ఆదేశాలను భేఖాతరు చేశారు. స్పీకర్ పదవిలో ఉన్న వారికి పార్టీ ఆదేశాలు వర్తించవనే అభిప్రాయంతోనే ఆ పనిచేశారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 1996లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును నెలకొల్పినప్పుడు తొలిసారి ఆయననే ఆ అవార్డు వరించింది. స్పీకరుగా పార్టీలకు అతీతంగా వ్యవహరించిన ఆయన సభలో సభ్యుల తీరును ఎత్తిచూపుతూ ‘పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయడమే ఉత్తమం అనుకుంటున్నాను. మీకందరికీ వృధాగా జీతభత్యాలివ్వడం శుద్ధదండుగ’ అని ఘాటుగా వ్యాఖ్యానించిన ధీశాలి. లోక్‌సభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు ఆయన పట్టుపట్టడం వల్లనే సాధ్యమయ్యాయి. స్పీకర్ పదవిని వదులుకోనందుకు పార్టీ బహిష్కరించిన రోజును తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజుగా ఆయన అభివర్ణించారు. -
లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ కన్నుమూత
-
పార్టీనీ ఖాతరు చేయలేదు!
దేశ పార్లమెంట్ చరిత్రలో కొందరు ప్రముఖులు పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అత్యున్నతస్థాయిలో గౌరవమర్యాదలు అందుకున్నారు. పార్లమెంట్లో వాజ్‌పేయి, పీవీ నరసింహారావు వంటి రాజకీయయోధుల గౌరవాన్ని పొందిన విలక్షణ నేత సోమ్‌నాథ్ ఛటర్జీ. సోమ్‌నాథ్ తండ్రి నిర్మల్ చంద్ర హిందూమహాసభ అధ్యక్షుడిగా పనిచేశారు. సుప్రీంకోర్టు లాయర్‌గా, కలకత్తా హైకోర్టు జడ్జీగా, ఎంపీగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. సోమ్‌నాథ్ మాత్రం కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు. 2004లో లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక, ఆ విధులు నిర్వహించిన మొట్టమొదటి కమ్యూనిస్టు నేతగా ప్రత్యేకత సాధించారు. పార్టీని ఖాతరు చేయలేదు 2008లో అమెరికా – భారత అణు ఒప్పందం నేపథ్యంలో స్పీకర్ పదవికి రాజీనామా చేయాలన్న సీపీఎం అధినాయకత్వం ఆదేశాలను బేఖాతరు చేసి తన సుదీర్ఘరాజకీయ చరిత్రలో పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. స్పీకర్ పదవిలో ఉన్నవారికి పార్టీ ఆదేశాలు వర్తించవనే నిశ్చితాభిప్రాయానికి కట్టుబడ్డారు. అమెరికాతో అణు ఒప్పందంపై కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడమంటే ప్రతిపక్ష బీజేపీ వైఖరిని అవలంబించినట్లేనని భావించారు. ఈ కారణంతో సీపీఎం నుంచి బహిష్కరణకు గురయ్యే వరకు తాను నిర్వహించిన పదవులు, బాధ్యతల పట్ల పూర్తి నిబద్ధతతో వ్యవహరించారు. తనను పార్టీ నుంచి తొలగించిన రోజు తన జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటని అన్నారు. సీపీఎం అగ్రనేత జ్యోతిబసును ఆయన రాజకీయగురువుగా పరిగణిస్తారు. హీరేన్ ముఖర్జీ, ఇంద్రజిత్ గుప్తా, సోమ్‌నాథ్ లాహిరీ వంటి ఉద్ధండులు నెలకొల్పిన కమ్యూనిస్టు రాజకీయాల సంప్రదాయాన్ని ఆయన కొనసాగించారు. 2007లో రాష్ట్రపతి స్థానానికి పోటీచేసే అవకాశం వచ్చినా.. పార్టీ నేత ప్రకాష్ కారత్ కారణంగా ఆ పదవిని పొందలేకపోయినట్టు బహిరంగంగా చెప్పారు. పదిసార్లు ఎంపీగా ఎన్నికైన ఈయన ఒకేఒక్కసారి (1984) ఓడిపోయారు. అది కూడా మమతా బెనర్జీ చేతిలో. 2009లో తన పదవీకాలం ముగిశాక, ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ‘ఓటుకు నోటు’ కుంభకోణంలో తన పాత్ర ద్వారా పరోక్షంగా ప్రభుత్వానికి సహకరించారనేది మాయనిమచ్చ. రాజ్యాంగం పట్ల నిబద్ధత 1929 జూలై 29న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించిన ఆయన రాజ్యాంగ విలువలకు, లౌకిక, సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి వ్యవహరించారు. అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటు పవిత్రత ఎక్కువని నమ్మారు. 2004–2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా అధికార, విపక్షాలన్న తేడాల్లేకుండా నిబంధనలను నిక్కచ్చిగా పాటించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య వివాదాలు ఏర్పడినపుడు పార్లమెంటే అత్యున్నతమని స్పష్టం చేశారాయన. స్టాండింగ్ కమిటీల నివేదికలకు పార్లమెంటును జవాబుదారీ చేశారు. కమ్యూనిజంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు యత్నించారు. పార్లమెంటే అత్యుత్తమం శాసన, న్యాయ వ్యవస్థలకు ఎవరి పరిధులు వారికి స్పష్టంగా ఉన్నాయని.. ఒకరి వ్యవహారాల్లో మరొకరి జోక్యం సరికాదని నమ్మి ఆచరణలో పెట్టారు. జార్ఖండ్ శాసనసభలో బలపరీక్ష వివాదాస్పదమైనపుడు సుప్రీంకోర్టు కల్పించుకుంది. ఓటింగ్ సందర్భంగా సభా వ్యవహారాలను వీడియో తీయాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. శాసనసభ స్పీకర్‌కు ఆయన సూచించినట్టు ప్రచారం జరిగింది. చివరకు వీడియో షూటింగ్ లేకుండానే సభా వ్యవహారం సాగింది. -
‘జెంటిల్మన్’ ఇకలేరు
కోల్‌కతా/న్యూఢిల్లీ: కమ్యూనిస్టు కురువృద్ధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ (89) కన్నుమూశారు. మెదడులో రక్తస్రావంతో రెండ్రోజుల క్రితం కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన సోమ్‌నాథ్ సోమవారం మృతిచెందారు.అంతకుముందు 40 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొంది కాస్త కోలుకోవడంతో డిశ్చార్జి అయిన మూడ్రోజుల్లోనే కన్నుమూశారు. ‘జెంటిల్మన్ కమ్యూనిస్టు’గా ప్రత్యర్థుల ప్రశంసలు అందుకున్న సోమ్‌నాథ్ పదిసార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. కీలక అవయవాల వైఫల్యం కారణంగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈయనకు భార్య రేణు, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఓ సమర్థుడైన నాయకుడిగా, స్పీకర్‌గా అంతకుముందు లాయర్‌గా ఛటర్జీ తనదైన ముద్రవేసుకున్నారు. కోలుకుంటున్నారని అనుకున్నంతలోనే.. ఛటర్జీ పార్థివదేహాన్ని మొదట పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి తీసుకెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సందర్శన అనంతరం గన్ సెల్యూట్‌తో నివాళులర్పించారు. అక్కడినుంచి కలకత్తా హైకోర్టుకు తీసుకెళ్లారు. ఇక్కడ ఈయన భౌతికకాయానికి జడ్జీలు, లాయర్లు నివాళులర్పించారు. అయితే దీర్ఘకాలం కమ్యూనిస్టు పార్టీకి సేవలందించిన ఛటర్జీ.. తన శరీరాన్ని అంత్యక్రియలు చేయకుండా మెడికల్ కాలేజీకి ప్రయోగాలకు ఇవ్వాలని గతంలో చెప్పారు. దీంతో పార్థివదేహాన్ని కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎన్ ఆసుపత్రికి ఇచ్చారు. రాజకీయ కీర్తి శిఖరం ‘భారత రాజకీయాల్లో సోమ్‌నాథ్ ఓ కీర్తి శిఖరమ’ని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అందరు పార్లమెంటేరియన్ల గౌరవాన్ని పొందిన మహనీయుడని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ అన్నారు. భిన్నమైన సిద్ధాంతాలకు చెందినవారమైనా.. ఎంతో ప్రేమగా వ్యవహరించేవారని ఆయనతో కలిసి పనిచేసిన రోజులను స్పీకర్ సుమిత్ర మహాజన్ గుర్తుచేసుకున్నారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ‘సోమ్‌నాథ్ దా ఇకలేరు. ఆయన మృతి మాకు తీరని లోటు’ అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, నేతలు విచారం వ్యక్తం చేశారు. గొప్ప పార్లమెంటేరియన్: కేసీఆర్: చట్టసభలు ఉన్నత ప్రమాణాలతో నడిచేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని, గొప్ప పార్లమెంటేరియన్‌గా చరిత్రలో నిలిచిపోతారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కోసం ఎంపీలుగా రాజీనామా చేసినప్పుడు స్పీకర్‌గా ఆయనే ఉన్నారని గుర్తు చేశారు. విలువలకు కట్టుబడిన వ్యక్తి: జగన్ సోమనాథ్ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. గొప్ప మార్క్సిస్టు రాజకీయ వేత్త అయిన ఛటర్జీ విలువలకు కట్టుబడి వ్యవహరించారని జగన్ నివాళులర్పించారు. సోమనాథ్∙మరణంతో విలువలకు, నీతి నియమాలకు కట్టుబడి వ్యవహరించిన ఒక గొప్ప నేతను దేశం కోల్పోయిందని ఆయన అన్నారు. -
చరితార్థుడు సోమనాథ్ ఛటర్జీ
ఉన్నత పదవుల నిర్వహణలో అందరిచేతా ప్రశంసలు అందుకునే నేతలు రెండు రకాలు. ఆ పద వికుండే బాధ్యతలు, పాటించాల్సిన ప్రమాణాలు, ఉండే పరిమితులు తెలుసుకుని వాటికి లోబడి చిత్తశుద్ధితో పనిచేసేవారు కొందరు. మరికొందరు అలా కాదు. ఆ పదవి ప్రాముఖ్యతనూ, అంత రార్ధాన్నీ అవగాహన చేసుకుని, దాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తారు. కొత్త ప్రమాణాలు నెలకొల్పుతారు. భవిష్యత్తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తారు. పది దఫాలు పార్ల మెంటేరియన్‌గా, ఒకసారి అత్యున్నత చట్టసభ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన సోమనాథ్ ఛటర్జీ ఈ రెండో కోవకు చెందినవారు. 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ కూటమికి వెలుపలి నుంచి మద్దతునిస్తున్న సీపీఎంకు స్పీకర్ పదవి ఇవ్వడానికి నిర్ణయించాక ఆ పార్టీ సహజంగానే సోమనాథ్ ఛటర్జీని ఎంపిక చేసింది. 33 ఏళ్లపాటు పార్టీ అధికార ప్రతినిధిగా, పార్ల మెంటులో పార్టీకి ప్రభావవంతమైన స్వరంగా నిలిచిన ఛటర్జీని సభా నిర్వహణలో తలమునకలై ఉండే పదవికి పరిమితం చేయాల్సిరావడం సీపీఎంకు అప్పట్లో ఇబ్బందికరమే. ఏదైనా అంశంపై పది నిమిషాలు మాట్లాడవలసి వస్తే ఆ అంశంపై అవగాహన కోసం ఎంత సమయాన్నయినా వెచ్చించటం ఆయనకుండే అలవాటు. తాను ప్రసంగించాల్సిన సమస్యపై సమస్త వివరాలనూ సేకరించటం, గణాంకాల సహితంగా చెప్పటం ఆయన అనుసరించే విధానం. సభలో ఆయన నడవడి, సమస్యలపై ప్రసంగించే తీరు అందరినీ ఆకట్టుకోవడం వల్లే 1996లోఉత్తమ పార్ల మెంటేరియన్ అవార్డు నెలకొల్పినప్పుడు తొలిసారి ఆ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకునేటపుడు తరచు అక్కడి దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్‌కు హాజరవుతూ ఆ సభా నిర్వహణను గమనించడం, ప్రత్యేకించి విన్స్టన్ చర్చిల్, క్లెమెంట్ అట్లీల ప్రసంగాలనూ వినడం అనంతరకాలంలో ఆయన పార్లమెంటేరియన్‌గా రాణించడానికి దోహదపడ్డాయి. ఆయనకు ముందూ, ఆ తర్వాత స్పీకర్ పదవిలోకొచ్చినవారు పార్టీలకతీతంగా పని చేస్తామని చెప్పినవారే. కానీ ఎక్కడో ఒకచోట దానికి భిన్నమైన అభిప్రాయం అందరిలోనూ ఏర్పడటానికి చోటివ్వనివారు తక్కువ. అయితే సోమనాథ్ ఛటర్జీ త్రికరణశుద్ధిగా తట స్థతను పాటించారు. అన్ని పక్షాల చేతా ప్రశంసలు అందుకున్నారు. అలాగని ఆయన ‘మర్యాద రామన్న’గా ఉండిపోలేదు. సభకు అంత రాయం కలిగించేవారిపై కటువైన వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. ‘పార్లమెంటును నిరవధిక వాయిదా వేయడమే ఉత్తమం అనుకుంటున్నాను. మీకందరికీ వృధాగా జీతభత్యాలివ్వడం శుద్ధ దండగ’ అని ఒక సందర్భంలో ఆయన ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. వాస్తవానికి లోక్‌సభ సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాలు ఆయన పట్టుబట్టడం వల్లనే సాధ్యమైంది. ఎంపీలెవరికీ ఇది నచ్చదని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. అయినా సోమనాథ్ ఛటర్జీ వినలేదు. తాము ఓట్లేసి గెలిపించిన చట్టసభల సభ్యులు అక్కడికెళ్లి ఏం చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రజలకుందని, అందువల్ల ఈ ప్రసారాలు ప్రారంభించాల్సిందేనని ఆయన ప్రగాఢంగా విశ్వసించారు. ఒకసారి ఓటేశాక తాము ఎన్నుకున్నవారేం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదని అను కునేవారికి నిజమైన ప్రజాస్వామ్యమంటే ఏమిటో ఛటర్జీ తెలియజెప్పారు. సోమనాథ్ ఛటర్జీ రాజకీయ జీవితంలో 2008 అత్యంత కీలకమైన సంవత్సరం. యూపీఏ సర్కారు అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రభుత్వానికి వామ పక్షాలు మద్దతు ఉపసంహరించుకున్నాయి. పార్టీ నిర్ణయాన్ని గౌరవించి స్పీకర్ పదవినుంచి తప్పు కోవాలని, యూపీఏ సర్కారు ప్రతిపాదించిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని సీపీఎం ఇచ్చిన ఆదేశాలను ఆయన తోసిపుచ్చారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించవద్దని ఆయనకు కొందరు నేతలు నచ్చజెప్పడానికి ప్రయత్నించగా... మరికొందరు ఆయనపై తీవ్ర నిర్ణయం తీసు కోవద్దని పార్టీ నాయకత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఆ రెండు ప్రయత్నాలూ విఫలమై చివ రకు సీపీఎం పొలిట్‌బ్యూరో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. తనకు మార్గదర్శిగా, తాత్వి కుడి, హితుడిగా ఉన్న అగ్రనేత జ్యోతిబసు కూడా జోక్యం చేసుకుని చెప్పినా ఛటర్జీ తన వైఖరి మార్చుకోలేదు. స్పీకర్‌గా ఎన్నికైన మరుక్షణం నుంచి పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నానని, అందువల్ల సీపీఎం నిర్ణయాన్ని శిరసావహించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బహిష్కరణ తన జీవితంలో ‘అత్యంత విషాదకరమైన రోజ’ని ఆయన వ్యాఖ్యానించినా ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఎన్డీఏకు వ్యతిరేకంగా భావసారూ ప్యత గల పక్షాలన్నీ ఏకమై ఒక కూటమిగా ఏర్పడాలని బలంగా కోరుకున్నది ఆయనే. అప్పటికింకా పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లేకపోయినా స్వీయ చొరవతో 2003 చివరిలో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని కలిసి కూటమి అవసరాన్ని ఆమెకు ఛటర్జీ వివరించారని అంటారు. తర్వాత కాలంలో ఆ కూటమి ఊహించని రీతిలో విజయం సాధించటమే కాక వరసగా రెండు దఫాలు అధికారంలో కొనసాగింది. చివరకు ఆ కూటమి విషయంలో పార్టీతో వచ్చిన విభేదాలే సోమనాథ్ ఛటర్జీని రాజ కీయంగా కనుమరుగయ్యేలా చేశాయి. రాజకీయాల్లో గెలుపోటములు, ఎదురుదెబ్బలు సహజం. కానీ ఎలాంటి పరిస్థితులేర్పడినా అనుకున్న సిద్ధాంతాలకూ, విలువలకూ కట్టుబడి ఉండటం... వాటికోసం దృఢంగా పోరాడటం చాలా అరుదు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఎలా వ్యవహరించాలో, ఎంత నిష్పక్షపాతంగా ఉండాలో సోమనాథ్ ఆచరించి చూపారు. తమ కురచ బుద్ధులతో ఆ స్థానానికే కళంకం తెస్తున్న వారు ఇలాంటి ఉన్నతస్థాయి ఆచరణ నుంచి కాస్తయినా నేర్చుకోగలిగితే మన చట్టసభల విశ్వసనీ యత పెరుగుతుంది. ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం కలుగుతుంది. ఛటర్జీకి అదే నిజమైన నివాళి అవుతుంది. -
సోమ్‌నాథ్ అంత్యక్రియలు అందుకే చేయడం లేదు
కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ(89) మృతితో అయన సన్నిహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం గల చటర్జీకీ అధికార లాంఛానాలతో వీడ్కోలు పలకాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కమ్యూనిజం భావజలం గల ఈ సీనియర్ నేత.. తన మరణాంతరం భౌతికకాయాన్ని పరిశోధనలకు ఉపయోగపడేవిధంగా ఏదైనా మెడికల్ కాలేజీకి విరాళంగా ఇవ్వాలని 2002లోనే కోరారు. దీంతో ఆయన కోరుకున్న విధంగా పార్థీవదేహాన్ని స్థానిక ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మెడికల్ కాలేజీకి తరలించే ముందు లీగల్ లాయర్ అయిన ఈ కమ్యూనిస్టు నేతకు కోల్‌కతా హైకోర్టుతో ఎంతో అనుబంధం ఉంది.. దీంతో అయన పార్థీవదేహాన్ని గౌరవార్థం హైకోర్టుకు తరలిస్తారు. అక్కడి నుంచి కోల్‌కతా అసెంబ్లీలో కాసేపు ఉంచి.. పోలీసుల వందన అనంతరం మెడికల్ కాలేజీకి తరలిస్తారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమ్‌నాథ్ చటర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. -
సోమ్‌నాథ్ చటర్జీ కన్నుమూత
కోల్‌కతా: లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ(89) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్స్టిట్యూట్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. భారత రాజకీయాల్లో మేరునగధీరుడైన సోమనాథ్ చటర్జీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బలమైన గళం వినిపించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సోమనాథ్ చటర్జీ ఓ వ్యవస్థ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా పార్లమెంటేరియన్లు అందరూ ఆయనను గౌరవించేవారని గుర్తు చేశారు. సోమనాథ్ చటర్జీ మృతికి రాహుల్ ప్రగాఢ సంతాపం తెలిపారు. వైఎస్ జగన్ సంతాపం సోమనాథ్ చటర్జీ మరణం పట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. పార్లమెంట్లో విలువలకు కట్టుబట్టారని, ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణంతో నీతి, విలువల కలిగిన గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని సంతాప సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. ట్విటర్లోనూ సోమనాథ్ చటర్జీకి వైఎస్ జగన్ నివాళులర్పించారు. Mourning the demise of former Lok Sabha Speaker Shri Somnath Chatterjee. India has lost one of the most revered and articulate leaders, who stood by his values and created history with his powerful words. My prayers are with his loved ones in this time of grief. — YS Jagan Mohan Reddy (@ysjagan) 13 August 2018 -
వెంటిలేటర్‌పై సోమ్‌నాథ్ చటర్జీ
కోల్‌కతా: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ(89)ని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత నెల ఛటర్జీకి మెదడులో రక్తస్రావం కావడంతో వైద్యశాలలో చేర్పించారు. చాలా రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నట్లుగా కనిపించడంతో గత వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి పంపారు. మళ్లీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఆయనను మూడు రోజులకే తిరిగి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ‘ఆయనకు డయాలసిస్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు గుండె సహకరించదు. దీంతో ఆయనకు ఆదివారం ఉదయం చిన్నగా గుండెపోటు వచ్చింది. ఇప్పుడు ఫరవాలేదు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని వైద్యులు చెప్పారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. -
క్షీణించిన లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్యం
-
లోక్‌సభ మాజీ స్పీకర్ ఆరోగ్య పరిస్థితి విషమం
కోల్కత్తా : లోక్‌సభ మాజీ స్పీకర్, సీపీఎం సీనియర్ నేత సోమనాథ్ చటర్జీ (89) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కిడ్ని సంబంధిత వ్యాధితో భాదపడుతున్న ఆయనను కోల్‌కత్తాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమ్‌నాథ్‌కు డయాలసిస్ నిర్వహించడంతో పాటు వెంటిలేటర్‌పై శ్వాస అందిస్తున్నామని ఆదివారం వైద్యులు పేర్కొన్నారు. బెంగాల్ నుంచి సీపీఎం తరుఫున పదిసార్లు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు. యూపీఏ-1 ప్రభుత్వంలో 2004-2009 మధ్య కాలంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించిన విషయం తెలిసిందే. ఆయన 1971 నుంచి 2009 వరకు ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కేవలం ఒక్కసారి మాత్రమే 1984 ఎన్నికల్లో మమతా బెనర్జీ చేతిలో ఓడిపోయారు. 1968లో సీపీఎంలో చేరిన సోమనాథ్ 2008 వరకు ఆ పార్టీలో కొనసాగారు. అయితే 2008లో యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించుకున్నప్పటీకి స్పీకర్‌గా కొనసాగడంతో పార్టీలో నుంచి బహిష్కరించారు. -
జస్టిస్ గంగూలీ రాజీనామా బాధించింది:సోమ్‌నాథ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మానవ హక్కువ కమీషన్(డబ్యూబీహెచ్ఆర్సీ) చైర్మన్ పదవికి జస్టిస్ ఏకే గంగూలీ రాజీనామా చేయడంపై లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్ నాథ్ చటర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గంగూలీ రాజీనామా అంశం తనను బాధించిందని పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు, విచారణ లేకుండా గంగూలీ మానవ హక్కువ కమీషన్ నుంచి వైదొలగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 'మన న్యాయ వ్యవస్థలో ఎవరి మీదనైనా ఆరోపణలు వచ్చినపుడు తప్పు చేసినట్లు నిర్ధారించబడాలన్నారు. కాని పక్షంలో అతను నిర్దోషేనని' చటర్జీ తెలిపారు. జస్టిస్ గంగూలీ విషయంలో నిబంధనలను సరిగా పాటించలేదన్నారు. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ దర్యాప్తు కూడా రాజ్యాంగ విరుద్ధంగా సాగిందన్నారు. గంగూలీ సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసే సమయంలో ఎవరూ కూడా అతనిపై అనుమానం వ్యక్తం చేయలేదనే విషయాన్ని చటర్జీ ప్రస్తావించారు. ఇదిలా ఉండగా తృణముల్ కాంగ్రెస్ మాత్రం గంగూలీ రాజీనామాను ఆహ్వానించింది. అతను రాజీనామా చేసి తన ప్రతిష్టను మరింత దిగజారకుండా కాపాడుకున్నారని ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తెలిపారు.ఆయన రాజీనామాను ఇంకా ముందుచేయాల్సిందని, ఇప్పటికైనా పదవి నుంచి తప్పుకోవడం పట్ల తృణముల్ సంతోషంగా ఉందన్నారు. న్యాయ శాస్త్ర విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.