సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం కట్టుబడి, ప్రజలను ప్రభావితం చేసిన నేతల పదికాలాల పాటు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి నేత మహా నేతల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, సోమనాథ్ చటర్జీ, కరుణానిధి ఉంటారు. ఈ మహోన్నత నేతలను పది రోజుల వ్యవధిలోనే దేశం కోల్పోయింది. భిన్న సంస్కృతులు, విభిన్న సిద్ధాంతాలు, రాజకీయ వ్యవహారాలను కలిగిన వారైనప్పటికీ దేశవ్యాప్త గుర్తింపు, మన్ననలను అందుకోవడమే వారి విశిష్టత. ఒకరు ప్రధానమంత్రిగా దేశానికి దిశానిర్దేశం చేస్తే, మరొకరు లోక్‌సభ స్పీకర్‌గా అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పారు.
ఇంకొకరు ముఖ్యమంత్రిగా ప్రజల్లో ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా పాలన అందించారు. అత్యున్నత స్థానాలను అలంకరించిన వారు ఆ పదవులకే వన్నెలద్దారు. స్వాతంత్య్రానికి ముందే జన్మించిన ఈ ముగ్గురిలో ఇద్దరు ఉన్నత విద్యను అభ్యసించగా.. ప్రాథమిక విద్యతోనే సరిపెట్టినా ప్రజాస్వామ్య విలువలను ఔపోసన పట్టారు. విభిన్న సిద్ధాంతాలతో ప్రజలను ప్రభావితం చేశారు. వాక్ఫటిమతో సభికులను సమ్మోహితుల్ని చేయడం, ఉత్తేజితుల్ని కావించడం, ఉత్తమ నాయకత్వంతో అనేకమంది యువతకు మార్గదర్శకులుగా నిలవడం వారికే చెల్లుబాటైంది. రాజకీయేతర కుటుంబాల నుంచి వచ్చినా స్వయంశక్తితో ఎదిగి రాజకీయాలకే సొబగులు అద్దారు. ఈనెల 7న కరుణానిధి, 13న సోమనాథ్, 16న వాజ్‌పేయి తుదిశ్వాస విడిచారు.
నిజమైన భారతరత్నం వాజ్‌పేయి
కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి రాజకీయ సంబంధాలు లేకుండా భారత ప్రధానిగా పదవిని అలంకరించిన తొలి నేత వాజ్‌పేయి. అదే పదవిని మూడు పర్యాయాలు అధిష్టించారు. కవిగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ప్రజాప్రతినిధులను సంతల్లో పశువుల్లా కొనుగోలు చేసే నేతలున్న ప్రస్తుత తరుణంలో కేవలం ఒక్క ఓటును తక్కువైనా విలువలకు కట్టుబడి ప్రధాని పదవినే తృణప్రాయంగా వదులుకున్నారు. పదిసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అటల్.. స్వపక్షం నుంచి మాత్రమే కాదు విపక్షం నుంచి మన్ననలు అందుకుని ఉత్తమ పార్లమెంటేరియన్ అయ్యారు. జనతాపార్టీ పతనానంతరం 1980లో భారతీయ జనతాపార్టీని ఏర్పాటుచేసి తొలి అధ్యక్షుడయ్యారు. ఆయన నేతృత్వంలో 1984లో కేవలం రెండు సీట్లకు పరిమితమైన పార్టీ అనతి కాలంలోనే అధికారం చేపట్టే దిశగా ఎదగడంలో వాజ్‌పేయి కీలకపాత్ర పోషించారు. అటల్‌జీ ప్రతిపక్ష నేతగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానిగా దేశ రాజకీయాల్లో అందరికీ ఇష్టులైన భారతరత్నగా మిగిలిపోయారు.
ప్రజల్లో నిలిచిన కలైజ్ఞర్
దక్షిణ భారతదేశ రాజకీయాల్లో ముత్తువేల్ కరుణానిధిది అత్యంత ప్రత్యేక స్థానం. పోటీచేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించిన ఆయన తొలిసారి 1957లో 33వ ఏట ఎమ్మెల్యే అయ్యారు. అయిదు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా, 13 పర్యాయాలు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. కవిగా, కథా రచయితగా, సంభాషణల రచయితగా, సినీ ప్రముఖునిగా, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడిగా, పాలనాదక్షుడిగా తనదైన పాలన సాగించి ప్రజల మనసుల్లో కలైజ్ఞర్‌గా నిలిచిపోయారు. ద్రవిడ ఉద్యమ నేతగా దేశ రాజకీయాలలో దక్షిణాది వారి ప్రత్యేకత చూపించారు.
స్వాతంత్య్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే హక్కు లభించింది కరుణానిధి కృషివల్లే. సంక్షోభ సమయాల్లో ఎంత నిబ్బరంగా ఉండాలో, ఎలా ఆచితూచి ప్రవర్తించాలో కరుణానిధిని చూసి నేర్చుకోవాలని ఆయన సమకాలికులు చెపుతుంటారు. ద్రవిడ ఉద్యమ నేతైనా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో సన్నిహితంగా మెలుగుతూ తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించేవారు. ఎంజీఆర్ కేంద్రంతో చేతులు కలిపి కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించినా, జయలలిత అరెస్టు చేయించినా పార్టీని చెక్కుచెదరకుండా నిలబెట్టిన ఘనుడిగా వినుతికెక్కారు.
సోమనాథ్ ది జెంటిల్మన్
పది సార్లు పార్లమెంటేరియన్‌గా, లోక్‌సభ స్పీకర్ హోదాలో అన్ని పార్టీల నేతల వద్ద జెంటిల్మన్‌గా సోమనాథ్ ఛటర్జీ ప్రత్యేక గుర్తింపు పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయలో చదివిన ఆయన.. ప్రముఖ ట్రేడ్ యూనియన్ నేతగా ఎదిగారు. సుప్రీం కోర్టు లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. సీపీఎంలో చేరి 1971లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. స్పీకర్ పదవిని అలంకరించిన తొట్టతొలి కమ్యూనిస్టు నేతగా ఛటర్జీ చరిత్రలో నిలిచిపోయారు. 2008లో అమెరికా–భారత అణు ఒప్పందం నేపథ్యంలో స్పీకర్ పదవికి రాజీనామా చేయాలన్న సీసీఎం అధినాయకత్వం ఆదేశాలను భేఖాతరు చేశారు. స్పీకర్ పదవిలో ఉన్న వారికి పార్టీ ఆదేశాలు వర్తించవనే అభిప్రాయంతోనే ఆ పనిచేశారు. 2009లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
1996లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును నెలకొల్పినప్పుడు తొలిసారి ఆయననే ఆ అవార్డు వరించింది. స్పీకరుగా పార్టీలకు అతీతంగా వ్యవహరించిన ఆయన సభలో సభ్యుల తీరును ఎత్తిచూపుతూ ‘పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేయడమే ఉత్తమం అనుకుంటున్నాను. మీకందరికీ వృధాగా జీతభత్యాలివ్వడం శుద్ధదండుగ’ అని ఘాటుగా వ్యాఖ్యానించిన ధీశాలి. లోక్‌సభ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు ఆయన పట్టుపట్టడం వల్లనే సాధ్యమయ్యాయి. స్పీకర్ పదవిని వదులుకోనందుకు పార్టీ బహిష్కరించిన రోజును తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజుగా ఆయన అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment