న్యూఢిల్లీ : గర్భనిరోధక పద్ధతులపై పెళ్లికాని యువతులు ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నారని, వారిలో కండోమ్ వాడకం పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) లో వెల్లడైంది. గడిచిన దశాబ్ధకాలంలో పెళ్లికాని (15 నుంచి 45 ఏళ్ల వయసున్న)మహిళల్లో కండోమ్‌ల వాడకం 2 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. ప్రధానంగా 20-24 ఏళ్ల వయసున్న యువతులే అత్యధికంగా రక్షణాత్మక పద్ధతులను పాటిస్తున్నట్లు తేలింది.
మొత్తంగా భారత్‌లో గర్భనిరోధక రేటు 54 శాతంగా ఉందని జాతీయ సర్వే తెలిపింది. పెళ్లైన మహిళల్లో అత్యధికులు ఇప్పటికీ పాత పద్ధతులనే పాటిస్తున్నారని, కేవలం ఒక్క శాతం మహిళలు మాత్రమే కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి అధునిక గర్భనిరోధక పద్ధతులను పాటిస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్), భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్)ను నిర్వహించారు. 1992 నుంచి 2016 వరకు నాలుగు సార్లు సర్వేను చేపట్టారు.
కుటుంబ ఆరోగ్య సర్వే ముఖ్యాంశాలు కొన్ని..
⇒99శాతం మంది పెళ్లైన మహిళలు ఏదో ఒక పద్ధతిలో ఫ్యామిలీ ప్లానింగ్‌ను పాటిస్తున్నారు.
⇒కేవలం 1 శాతం మంది మాత్రమే పిల్స్‌ను వినియోగిస్తున్నారు.
⇒పెళ్లికాని మహిళల్లో 34 శాతం మంది గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నారు.
⇒ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ముగ్గురు.. గర్భనిరోధం అనేది మహిళలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తున్నారు.
⇒గర్భనిరోధక పద్ధతులు పాటించడంలో పంజాబ్ మహిళలదే పైచేయి. ఆ రాష్ట్రంలో 76 శాతం మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు.
⇒మణిపూర్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో అత్యల్పస్థాయిలో 24 శాతం మంది మహిళలు మాత్రమే గర్భనిరోధక పద్ధతులను అనుసరిస్తున్నారు.
⇒కండోమ్‌ను సరిగ్గా వాడితే గర్భ నిరోధం సాధ్యమవుతుందని 61 శాతం మంది పురుషులు నమ్ముతున్నారు.
⇒సిక్కు, బౌద్ధ మహిళల్లో గర్భనిరోధక సాధనాలు వాడేవారి శాతం 65గా ఉంటే, ముస్లిం మహిళల్లో అది 38 శాతం మాత్రమే ఉందని సర్వేలో తేలింది.
⇒అల్పాదాయ వర్గాల్లో 36 శాతం, అధికాదాయ వర్గాల్లో 53 శాతం మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు.
⇒59 శాతం మంది మహిళలు టీవీల్లో వచ్చే ప్రకటనల ద్వారా గర్భనిరోధానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment