Unmarried womens
-
24 వారాలకు అబార్షన్
న్యూఢిల్లీ: కొన్ని ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రమే అవకాశం ఉన్న 20 వారాల అబార్షన్‌ను 24 వారాలకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. 20 వారాల గర్భవిచ్చిత్తి అంటే శిశువును చంపేయడమేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అవివాహిత అనే కారణం చూపుతూ పిటిషనర్ వినతిని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లైంగిక హింస వంటి కేసుల్లో గర్భం దాల్చిన ఒంటరి మహిళలు 20 వారాల వరకు అబార్షన్ చేయించుకునేందుకు ప్రస్తుతం చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. గర్భం దాల్చిన అనంతరం అందుకు కారకుడైన వ్యక్తితో సంబంధాల్లో మార్పు వచ్చినందున అబార్షన్‌కు అనుమతివ్వాలంటూ ఓ మహిళ ఢిల్లీ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. పెళ్లవకుండానే గర్భం దాల్చిన వారిని సమాజం చిన్నచూపు చూస్తుందని ఆమె పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కొట్టివేశారు. అవివాహిత అయి, సమ్మతితోనే గర్భం దాల్చిందని, 20 వారాల పిండాన్ని తీసేయడమంటే శిశువును చంపేయడమేనని ఆయన అన్నారు. ‘‘ఒక మంచి ఆస్పత్రిలో చేరి, బిడ్డను కని వదిలేసి వెళ్లిపోవచ్చు. దత్తత తీసుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతా ప్రభుత్వం/ ఆస్పత్రి చూసుకుంటాయి. ఇందుకయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించకుంటే నేనే భరిస్తా’అని పేర్కొన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన త్రిసభ్య ధర్మాసనం..హైకోర్టు తీర్పు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్–1971కు విరుద్ధమని పేర్కొంది. -
పెళ్లికాని మహిళలు మాత్రమే అర్హులన్న UPSC
-
నేషనల్ డిఫెన్స్ పరీక్షలో అవివాహిత మహిళలకు చాన్స్
న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ), నావల్ అకాడమీ పరీక్షకు అవివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తెలిపింది. గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు శుక్రవారం యూపీఎస్సీ ఒక ప్రకటనలో వివరించింది. జాతీయత, వయస్సు, విద్య తదితర అంశాల్లో అర్హులైన అవివాహిత మహిళలు ఈనెల 24 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మాత్రమే upsconline.nic.inలో పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. మహిళా అభ్యర్థులకు పరీక్ష దరఖాస్తు రుసుము ఉండదని తెలిపింది. శారీరక దారుఢ్య ప్రమాణాలు, ఖాళీల సంఖ్యపై రక్షణ శాఖ నుంచి వివరాలు అందాక నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంది. పరీక్ష నవంబర్ 14వ తేదీన ఉంటుందని వివరించింది. -
నూటొక్క జిల్లాల.. కేటుగాడు!
అతను ఉన్నత చదువులు చదివాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశాడు. అయితే తన ప్రతిభను, అర్హతలను సక్రమంగా కాకుండా వక్రమార్గంలో వాడాడు. కొన్నేళ్ల క్రితం మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకుని, చాటింగ్‌తోనే చీటింగ్ చేసి రూ.లక్షలు కొట్టేశాడు. చాలా సులువుగా డబ్బులు రావడంతో అప్పటినుంచి అదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచి.. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో యువతులకు వల వేసి మోసాలకు పాల్పడ్డాడు. అంతేకాదు.. గంజాయి స్మగ్లింగ్, నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఉద్యోగాల పేరిట మోసాలు.. ఇలా అతని నేరాల చిట్టా చేంతాడంత ఉంది. చివరకు పోలీసుల చేతికి చిక్కడంతో అతగాడి లీలలకు తెరపడింది. చిత్తూరు అర్బన్: పెళ్లికాని యువతులను మ్యాట్రిమోనీ (వివాహ సంబంధాల) వెబ్సైట్ల ద్వారా పరిచయం చేసుకుని, వారి నుంచి రూ.లక్షలు కాజేసే కేటుగాడిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలు సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్ (33) డిగ్రీ వరకు అద్దంకిలో చదివి, హైదరాబాద్‌లో ఎంసీఏ చేశాడు. ఆపై ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్ చేస్తూ మధ్యలో మానేశాడు. కొన్నాళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేశాడు. 2017లో ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో తన ఫొటో ఉంచగా.. ఓ యువతి పరిచయమైంది. ఆ యువతితో ఆన్లైన్ చాటింగ్ చేసి రూ.లక్షలు కాజేశాడు. కష్టపడకుండానే డబ్బులు రావడంతో ఇదే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. పలు మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచిపెట్టి.. విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టేవాడు. నకిలీ పేర్లతో పెళ్లికాని యువతులతో ఆన్లైన్లో చాటింగ్ చేయడం, పరిచయం పెరిగాక మాయమాటలు చెప్పి వారితో డబ్బులు తన బ్యాంకు ఖాతాలోకి వేయించుకునేవాడు. అలా.. 2017లో ఒంగోలుకు చెందిన ఓ టెకీ యువతి వద్ద రూ.27 లక్షలు, 2018లో నరసరావుపేటకు చెందిన మరో టెకీ యువతి వద్ద రూ.40 లక్షలు కాజేసి రెండు సార్లు అరెస్టు కూడా అయ్యాడు. జైలు జీవితం అనుభవించినా శ్రీనివాస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. రెండు నెలల క్రితం చిత్తూరుకు చెందిన ఓ యువతిని మ్యాట్రిమోనీ ద్వారా మోసం చేసి రూ.1.4 లక్షలు, మదనపల్లెలో మరో యువతిని మోసం చేసి రూ.7 లక్షలు కాజేశాడు. బాధిత యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడికోసం గాలిస్తుండగా.. చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డు వద్ద నాలుగు కిలోల గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. విచారణలో శ్రీనివాస్ లీలలు వెలుగుచూశాయి. నకిలీ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేయడం లాంటి నేరాల చిట్టా బయటపడింది. నిందితుడి నుంచి రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు. -
కులాంతర వివాహమా? మొబైల్ వాడుతున్నారా?
ఆధునిక టెక్నాలజీ పరుగులు తీస్తోంది. మోడరన్ యుగం మానవజీవితాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈ రోజుల్లో ఇంకా కులాల పట్టింపులేంటి? రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. మనుషులంతా ఒక్కటే..అన్ని రంగాల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఈ వాక్యాలు చదవడానికి, వినడానికి బావుంటాయి. కానీ వాస్తవ జీవితంలో మహిళలు, బాలికల పరిస్థితి పెనంమీదినుంచి పొయ్యిలో పడ్డ చందంగానే తయారవుతోంది. గుజరాత్ ఠాకూర్లు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుంటే ఈ అభిప్రాయం కలగక మానదు. బనస్కాంత జిల్లా దంతేవాడ తాలూకాలోని 12 గ్రామాల్లోని ఠాకూర్ సంఘం మహిళలకు సంబంధించి ఆంక్షలను అమలు చేయనుంది. ఈ మేరకు నాయకులు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. 12 గ్రామాల ప్రతినిధులు, యువకులతో సహా దాదాపు 800 మంది ఠాకూర్ నాయకులు జూలై 14 న సమావేశమయ్యారు. ఇక్కడ తొమ్మిది పాయింట్ల తీర్మానం ఆమోదించారు. దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆదేశించారు. తొమ్మిది పాయింట్లలో ఏ ఒక్క పాయింటును ఉల్లంఘించినా, అపరాధిగా పరిగణించి, శిక్షను విధించాలని తీర్మానించు కున్నారు. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వాడకూడదు. దీనికి అమ్మాయిల తల్లిదండ్రులే బాధ్యత వహించి, శిక్ష అనుభవించాలని తీర్మానించింది. అలాగే కులాంతర వివాహాల్ని ఎట్టిపరిస్థితుల్లోని అంగీకరించమని తేల్చి పారేశారు. కులాంతర వివాహాలు చేసుకున్నఆయా కుటుంబాలకు జరిమానాలు విధించాలని నిర్ణయించి, ఎంత విధించాలనేది కూడా ఖాయం చేశారు. జిల్లాలో ఇటీవల అనేక కులాల వివాహాలు జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఠాకూర్ అమ్మాయి ప్రేమలో పడి వేరే వర్గానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటే, ఆ కుటుంబం రూ.1.5 లక్షల జరిమానా చెల్లించాలి. ఠాకూర్ కుర్రాడు వేరే కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటే రూ.2 లక్షలు జరిమానా చెల్లించాల్సి వుంటుంది. కొసమెరుపు ఏమంటే..కట్నాలను తీసుకోకూడదని, పెళ్లితంతులో బాణాసంచా కాల్చకూడదని, అన్నదమ్ములు ఘర్షణ పడిన కుటుంబాన్నిబాయ్కాట్ చేయాలని, వివాహ తంతులో పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగే తతంగాన్ని కూడా నిషేధించడం. -
పెళ్లికాని యువతులు.. పెరిగిన కండోమ్‌ల వాడకం
న్యూఢిల్లీ : గర్భనిరోధక పద్ధతులపై పెళ్లికాని యువతులు ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నారని, వారిలో కండోమ్ వాడకం పెరిగిందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) లో వెల్లడైంది. గడిచిన దశాబ్ధకాలంలో పెళ్లికాని (15 నుంచి 45 ఏళ్ల వయసున్న)మహిళల్లో కండోమ్‌ల వాడకం 2 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. ప్రధానంగా 20-24 ఏళ్ల వయసున్న యువతులే అత్యధికంగా రక్షణాత్మక పద్ధతులను పాటిస్తున్నట్లు తేలింది. మొత్తంగా భారత్‌లో గర్భనిరోధక రేటు 54 శాతంగా ఉందని జాతీయ సర్వే తెలిపింది. పెళ్లైన మహిళల్లో అత్యధికులు ఇప్పటికీ పాత పద్ధతులనే పాటిస్తున్నారని, కేవలం ఒక్క శాతం మహిళలు మాత్రమే కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి అధునిక గర్భనిరోధక పద్ధతులను పాటిస్తున్నారని సర్వేలో పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్), భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్)ను నిర్వహించారు. 1992 నుంచి 2016 వరకు నాలుగు సార్లు సర్వేను చేపట్టారు. కుటుంబ ఆరోగ్య సర్వే ముఖ్యాంశాలు కొన్ని.. ⇒99శాతం మంది పెళ్లైన మహిళలు ఏదో ఒక పద్ధతిలో ఫ్యామిలీ ప్లానింగ్‌ను పాటిస్తున్నారు. ⇒కేవలం 1 శాతం మంది మాత్రమే పిల్స్‌ను వినియోగిస్తున్నారు. ⇒పెళ్లికాని మహిళల్లో 34 శాతం మంది గర్భనిరోధక పద్ధతులు పాటిస్తున్నారు. ⇒ప్రతి ఎనిమిది మంది పురుషుల్లో ముగ్గురు.. గర్భనిరోధం అనేది మహిళలకు సంబంధించిన వ్యవహారంగా భావిస్తున్నారు. ⇒గర్భనిరోధక పద్ధతులు పాటించడంలో పంజాబ్ మహిళలదే పైచేయి. ఆ రాష్ట్రంలో 76 శాతం మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు. ⇒మణిపూర్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో అత్యల్పస్థాయిలో 24 శాతం మంది మహిళలు మాత్రమే గర్భనిరోధక పద్ధతులను అనుసరిస్తున్నారు. ⇒కండోమ్‌ను సరిగ్గా వాడితే గర్భ నిరోధం సాధ్యమవుతుందని 61 శాతం మంది పురుషులు నమ్ముతున్నారు. ⇒సిక్కు, బౌద్ధ మహిళల్లో గర్భనిరోధక సాధనాలు వాడేవారి శాతం 65గా ఉంటే, ముస్లిం మహిళల్లో అది 38 శాతం మాత్రమే ఉందని సర్వేలో తేలింది. ⇒అల్పాదాయ వర్గాల్లో 36 శాతం, అధికాదాయ వర్గాల్లో 53 శాతం మంది ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు. ⇒59 శాతం మంది మహిళలు టీవీల్లో వచ్చే ప్రకటనల ద్వారా గర్భనిరోధానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. -
30 ఏళ్లలోపు పెళ్లికాని యువతులు 8వేల మంది
పోరాటాల పురిటిగడ్డగా కీర్తికెక్కిన నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత కలిగి ఉందని చెబుతున్నాయి సమగ్రకుటుంబ సర్వే గణాంకాలు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల కోవకు వచ్చే కరీంనగర్, వరంగల్‌తో పాటు పేదజిల్లాగా, వలసలకు అడ్డాగా గుర్తింపు పొందిన మహబూబ్నగర్తోనూ పోటీపడగలదని తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు19న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లావాసులు ఏం చెప్పారో... ఆ లెక్కలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవాలంటే మధ్యపేజీల్లోకి వెళ్లాల్సిందే.. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సమగ్ర కుటుంబ సర్వేతో జిల్లా ముఖచిత్రం ఆవిష్కృతమైంది. అన్నింటా మన జిల్లా ప్రత్యేకత చాటుకుంది. ఇంటి స్థలం లేని వారి నుంచి ఆరెకరాల భూమి ఉన్న వారి వరకు.. సొంత ఇంటి నుంచి ఆద్దె ఇళ్లలో ఉంటున్న వారి వరకు... అనాథలు, ఒంటరి మహిళలు, వికలాంగులు, రోగాలతో బాధపడుతున్న వారు.... ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, బ్యాంకు ఖాతాలు, స్వయం సహాయక సంఘాల్లో ప్రాతినిధ్యం.... ఇలా అన్ని రంగాల్లోనూ జిల్లా వాసులు పోటీపడుతూనే ఉన్నారు. అన్నింటిలోనూ మొదటి మూడు, నాలుగు స్థానాల్లోనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు 19న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేనిర్వహించిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన ఈ లెక్కలను శాస్త్రీయంగా పరిగణించలేం. కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే సర్వేలో ప్రజలు పూర్తి వివరాలను కచ్చితంగా చెప్పారన్నదానికి ఆధారం లేదు. సర్వేలో ప్రజలు తమ ఇష్టపూర్వకంగా ఇచ్చిన సమాచారం ప్రకారం రూపొందించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి. ‘భూమి’పుత్రులకు నెలవు సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడయిన అంశాలను పరిశీలిస్తే జిల్లాలో ‘భూమి’ ఉన్నవారు సగానికిపైగానే ఉన్నారు. మొత్తం 11,01,439 మంది ఇచ్చిన వివరాల ప్రకారం జిల్లాలో సొంతస్థలం ఉన్నవారి సంఖ్య 4,58,911 మంది. తెలంగాణలో మహబూబ్‌నగర్ తర్వాత మన జిల్లాలోనే ఈ సంఖ్య ఎక్కువ. ఇక, అసలు స్థలం కూడా లేని వారు కూడా ఎక్కువేనండోయ్. వారి సంఖ్య 6,42,528. ఇక పొలం విషయానికి వస్తే ఎకరం కంటే తక్కువ ఉన్న వారు జిల్లాలో 10శాతం మంది ఉన్నారు. మొత్తం 1,25,260 మందికి ఎకరం కంటే తక్కువ భూమి ఉందని సర్వే లెక్కలు చెబుతుండగా, తెలంగాణలో ఇది మూడోస్థానం. మనకన్నా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎకరం కన్నా తక్కువ ఉన్న వారు ఎక్కువ ఉన్నారు. ఇక, ఎకరం నుంచి రెండకరాలున్నవారు 96,007 మంది, రెండు నుంచి మూడెకరాలున్నవారు 81,266 మంది, మూడు నుంచి నాలుగెకరాలు ఉన్నవారు 53,349 మంది, నాలుగు నుంచి ఐదెకరాలున్నవారు 45,516 మంది, ఐదు కన్నా ఎక్కువ ఎకరాలున్న వారు 98,989 మంది ఉన్నారు. అంటే ఎకరం కంటే ఎక్కువ ఉన్న వారికన్నా, ఐదు కన్నా ఎక్కువ ఎకరాలున్న వారున్న కుటుంబాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే, పేద జిల్లాగా పేరుపడ్డ మహబూబ్‌నగర్‌లో ఐదుకన్నా ఎక్కువ ఎకరాలున్న వారు మన జిల్లా కన్నా ఎక్కువ ఉండడం గమనార్హం. 30 ఏళ్లలోపు పెళ్లికాని మహిళలు 8వే ల మంది ఇక వర్గాల వారీగా పరిశీలిస్తే... జిల్లా అనాథలు, వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో అనాథలు 507 మంది ఉండగా, వికలాంగులు 68,218 మంది ఉన్నారు. అనాథల్లో రంగారెడ్డి తర్వాత, వికలాంగుల్లో కరీంనగర్ తర్వాత జిల్లానే మూడోస్థానంలో ఉంది. కనీసం ఇల్లు లేని సంచారజాతులు 1,25,001 మంది ఉంటే, ఇల్లున్న సంచార జాతుల వారు 1,024 మంది మాత్రమే. జిల్లాలో 30 ఏళ్లలోపు పెళ్లికాని మహిళల సంఖ్య 8,021 కాగా, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, భర్తలు వదిలిపెట్టిన మహిళలు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. జిల్లాలో సఫాయి కార్మికులు కూడా 1,332 మంది ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చెబుతున్నాయి. రోగాలూ ఎక్కువే సర్వే లెక్కల ప్రకారం.. జిల్లాలో అనారోగ్యం బారిన పడుతున్న వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇందులో తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు 1,19,999 మంది ఉన్నారు. వరంగల్, కరీంనగర్ తర్వాత జిల్లాలోనే ఈ సంఖ్య ఎక్కువ. ఇక, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కరీంనగర్ జిల్లా తర్వాత జిల్లాలోనే ఎక్కువగా 4,762 మంది ఉన్నారు. హృద్రోగాలున్నవారు 17,211 మంది కాగా, క్షయ వ్యాధి 4,590 మందికి, కుష్టు వ్యాధి 921 మందికి ఉంది. పక్షవాతంతో బాధపడుతున్నవారు 8,212 మంది, ఆస్తమా వ్యాధిగ్రస్తులు 11,862 మంది ఉన్నారు. ఇక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలోనే అత్యధికంగా 1,711 మంది ఉన్నార ని సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆదాయపు పన్ను కడుతున్న వారు తక్కువే.. తెలంగాణవ్యాప్తంగా పరిశీలిస్తే జిల్లాలో ఆదాయపు పన్ను కడుతున్న వారి సంఖ్య తక్కువేనని సమగ్ర సర్వే లెక్కలంటున్నాయి. జిల్లాలో మొత్తం 30,268 మంది ఆదాయపు పన్ను కడుతున్నారని సర్వేలో చెప్పగా, నిజామాబాద్ జిల్లాలోనే మన కన్నా తక్కువ మంది ఆదాయపు పన్ను ఖాతాలు కలిగి ఉన్నారు. ఇక, బ్యాంకు ఖాతాల విషయంలో మనం ముందంజలో ఉన్నామని, జిల్లాలో 8,68,237 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయని సర్వేలో తేలింది. పోస్టాఫీసు ఖాతాల విషయంలో అయితే మనం తెలంగాణలోనే టాప్‌లో ఉన్నాం. మొత్తం 3,94,648 మందికి పోస్టాఫీసు ఖాతాలుండగా, స్వయం సహాయక సంఘాల సభ్యత్వం ఉన్నవారు కూడా జిల్లాలో ఎక్కువగానే ఉన్నారు. కరీంనగర్ తర్వాత మన జిల్లాలోనే ఎక్కువగా 5,26,915 మందికి ఎస్‌హెచ్‌జీల్లో సభ్యత్వం ఉంది. ఇక చరాస్తుల విషయానికి వస్తే జిల్లాలో 2,22,358 ద్విచక్రవాహనాలు, 17,133 నాలుగు చక్రాల వాహనాలున్నాయి. ట్రాక్టర్లు, వ్యవసాయ సామాగ్రి వాహనాల సంఖ్య తెలంగాణలోనే జిల్లాలో అధికంగా ఉంది. మొత్తం 18,156 ట్రాక్టర్లు, వ్యవసాయ సామగ్రి వాహనాలున్నాయని సర్వే లెక్కలు చెబుతున్నాయి. చిన్నకుటుంబాలే ఎక్కువ.. సభ్యుల వారీగా కుటుంబాలను పరిశీలిస్తే జిల్లాలో చిన్నకుటుంబాల వారే ఎక్కువగా ఉన్నారు. అంటే చిన్నకుటుంబం - చింతలేని కుటుంబం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు జిల్లావాసులు. మొత్తం 11,01,439 కుటుంబాలిచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో ఒక్క మహిళ ఉన్న కుటుంబాలు 1,18,224. ఇది తెలంగాణలోనే ఎక్కువ. అచ్చం మహిళలే ఉన్న కుటుంబాలు 1,94,454. ఇది కూడా రంగారెడ్డి జిల్లా తర్వాత మన జిల్లాలోనే ఎక్కువ. అంటే జిల్లాలో మహిళలు పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబాలు బాగానే ఉన్నాయన్నమాట. ఇక, ఒకే పురుషుడున్న కుటుంబాలు కూడా జిల్లాలో 1,21,085 ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక, ఇద్దరు మాత్రమే ఉన్న కుటుంబాలు 2,37,167 కాగా, ముగ్గురున్న కుటుంబాలు 2,18,835, నలుగురున్న కుటుంబాలు 3,48,428 ఉన్నాయి. అంటే ఇద్దరు నుంచి నలుగురున్న కుటుంబాలు మొత్తం కుటుంబాల్లో 70శాతానికి పైగా ఉన్నాయన్నమాట. ఇక, పెద్ద కుటుంబాల విషయానికి వస్తే ఐదుగురుండే కుటుంబాలు 1,29,512 కాగా, ఆరుగురుండేవి 32,683, ఆరుగురు కన్నా ఎక్కువ ఉన్నవి 13,729 మాత్రమే. పెద్ద కుటుంబాలు కరీంనగర్, ఖమ్మం తర్వాత మన జిల్లాలోనే తక్కువ. అంటే లెక్కల ప్రకారం.. చివరి నుంచి మూడోస్థానంలో ఉన్నాం. విద్యుత్ లేని ఇళ్లలో మూడో స్థానం జిల్లాలోని ఇళ్లను పరిశీలిస్తే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సొంత ఇల్లున్న కుటుంబాలు 2,95,171 మంది. అంటే మొత్తం కుటుంబాల్లో ఇది 15శాతంపైమాటే. ఇక, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు జిల్లాలో 1,90,529 కుటుంబాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల తర్వాత అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారి సంఖ్య జిల్లాలోనే ఎక్కువ కావడం గమనార్హం. ఇక, ప్లాస్టిక్ కప్పులున్న ఇళ్లు 49,362, పూరిగుడిసెలు 49,310 (వరంగల్ తర్వాత మన దగ్గరే ఎక్కువ.), రాతికప్పులున్నవి 81,053 ఉన్నాయి. మొత్తం ఇళ్లలో 40శాతం ఇళ్లు కాంక్రీట్ శ్లాబ్ ఇళ్లేనని లెక్కలు చెబుతున్నాయి. కాంక్రీట్ కప్పులున్న ఇళ్లు జిల్లాలో 4,36,097 కాగా, మొత్తం ఇళ్లలో మరుగుదొడ్లు లేనివి 5.62లక్షలు. ఇక, విద్యుత్ సౌకర్యం కూడా లేని ఇళ్లు జిల్లాలో 1,84,439 ఉన్నాయని, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ల తర్వాత మన జిల్లాలోనే ఎక్కువని గణాంకాలు చెపుతున్నాయి. ఇక, ఒకే గదిలో నివసిస్తున్నవారు జిల్లాలో 5,10,044 మంది కాగా, రెండు గదుల్లో ఉండేవారు 4,01,302 మంది. అంటే మొత్తం కుటుంబాల్లో దాదాపు 90శాతం మంది రెండుగదుల్లోపే ఉంటున్నారు. ఇక, మూడు గదుల ఇళ్లు 1,05,260 కాగా, నాలుగు గదులున్న ఇళ్లు 61వేలేనని సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఉద్యోగ వర్గం.. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 31,192 మందికాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు 9,510 అని తేలింది. ఇక, వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు 25,103 మంది, ప్రభుత్వ రంగ సంస్థల్లో చేస్తున్న వారు 6,963 మంది ఉన్నారు. ఇక, నెలసరి వేతనం పొందే ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య 47,200 మంది. మతాలు, కులాల లెక్కలివి... సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో హిందూ మతస్తులు 10,33,702, ముస్లింలు 56,821, క్రిస్టియన్లు 9,178, సిక్కులు 737, జైనులు 40, బౌద్ధులు 21, ఇతరులు 940 మంది ఉన్నారని సర్వేలో పాల్గొన్న ప్రజలు చెప్పారు. ఇక, సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే జిల్లాలో బీసీల సంఖ్యే ఎక్కువ. మొత్తం జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలున్నారు.