ప్రతీకాత్మక చిత్రం
ఆధునిక టెక్నాలజీ పరుగులు తీస్తోంది. మోడరన్ యుగం మానవజీవితాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఈ రోజుల్లో ఇంకా కులాల పట్టింపులేంటి? రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. మనుషులంతా ఒక్కటే..అన్ని రంగాల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఈ వాక్యాలు చదవడానికి, వినడానికి బావుంటాయి. కానీ వాస్తవ జీవితంలో మహిళలు, బాలికల పరిస్థితి పెనంమీదినుంచి పొయ్యిలో పడ్డ చందంగానే తయారవుతోంది. గుజరాత్ ఠాకూర్లు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకుంటే ఈ అభిప్రాయం కలగక మానదు. బనస్కాంత జిల్లా దంతేవాడ తాలూకాలోని 12 గ్రామాల్లోని ఠాకూర్ సంఘం మహిళలకు సంబంధించి ఆంక్షలను అమలు చేయనుంది. ఈ మేరకు నాయకులు ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు.
12 గ్రామాల ప్రతినిధులు, యువకులతో సహా దాదాపు 800 మంది ఠాకూర్ నాయకులు జూలై 14 న సమావేశమయ్యారు. ఇక్కడ తొమ్మిది పాయింట్ల తీర్మానం ఆమోదించారు. దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆదేశించారు. తొమ్మిది పాయింట్లలో ఏ ఒక్క పాయింటును ఉల్లంఘించినా, అపరాధిగా పరిగణించి, శిక్షను విధించాలని తీర్మానించు కున్నారు. ముఖ్యంగా పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్‌లు వాడకూడదు. దీనికి అమ్మాయిల తల్లిదండ్రులే బాధ్యత వహించి, శిక్ష అనుభవించాలని తీర్మానించింది. అలాగే కులాంతర వివాహాల్ని ఎట్టిపరిస్థితుల్లోని అంగీకరించమని తేల్చి పారేశారు. కులాంతర వివాహాలు చేసుకున్నఆయా కుటుంబాలకు జరిమానాలు విధించాలని నిర్ణయించి, ఎంత విధించాలనేది కూడా ఖాయం చేశారు. జిల్లాలో ఇటీవల అనేక కులాల వివాహాలు జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఠాకూర్ అమ్మాయి ప్రేమలో పడి వేరే వర్గానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటే, ఆ కుటుంబం రూ.1.5 లక్షల జరిమానా చెల్లించాలి. ఠాకూర్ కుర్రాడు వేరే కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటే రూ.2 లక్షలు జరిమానా చెల్లించాల్సి వుంటుంది.
కొసమెరుపు ఏమంటే..కట్నాలను తీసుకోకూడదని, పెళ్లితంతులో బాణాసంచా కాల్చకూడదని, అన్నదమ్ములు ఘర్షణ పడిన కుటుంబాన్నిబాయ్‌కాట్ చేయాలని, వివాహ తంతులో పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగే తతంగాన్ని కూడా నిషేధించడం.
Comments
Please login to add a commentAdd a comment