30 ఏళ్లలోపు పెళ్లికాని యువతులు 8వేల మంది | Unmarried womens 30years Below 8 thousand people Nalgonda district | Sakshi
Sakshi News home page

30 ఏళ్లలోపు పెళ్లికాని యువతులు 8వేల మంది

Published Fri, Jan 9 2015 4:12 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

30 ఏళ్లలోపు పెళ్లికాని యువతులు 8వేల మంది - Sakshi

 పోరాటాల పురిటిగడ్డగా కీర్తికెక్కిన నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత కలిగి ఉందని చెబుతున్నాయి సమగ్రకుటుంబ సర్వే గణాంకాలు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల కోవకు వచ్చే కరీంనగర్, వరంగల్‌తో పాటు పేదజిల్లాగా, వలసలకు అడ్డాగా గుర్తింపు పొందిన మహబూబ్‌నగర్‌తోనూ పోటీపడగలదని తేటతెల్లం చేస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు19న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లావాసులు ఏం చెప్పారో... ఆ లెక్కలు ఏం చెబుతున్నాయో తెలుసుకోవాలంటే మధ్యపేజీల్లోకి వెళ్లాల్సిందే..
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సమగ్ర కుటుంబ సర్వేతో జిల్లా ముఖచిత్రం ఆవిష్కృతమైంది. అన్నింటా మన జిల్లా ప్రత్యేకత చాటుకుంది. ఇంటి స్థలం లేని వారి నుంచి ఆరెకరాల భూమి ఉన్న వారి వరకు.. సొంత ఇంటి నుంచి ఆద్దె ఇళ్లలో ఉంటున్న వారి వరకు... అనాథలు, ఒంటరి మహిళలు, వికలాంగులు, రోగాలతో బాధపడుతున్న వారు.... ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, బ్యాంకు ఖాతాలు, స్వయం సహాయక సంఘాల్లో ప్రాతినిధ్యం.... ఇలా అన్ని రంగాల్లోనూ జిల్లా వాసులు పోటీపడుతూనే ఉన్నారు. అన్నింటిలోనూ మొదటి మూడు, నాలుగు స్థానాల్లోనే ఉన్నారు.  గత ఏడాది ఆగస్టు 19న జరిగిన సమగ్ర కుటుంబ సర్వేనిర్వహించిన విషయం తెలిసిందే. సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన ఈ లెక్కలను శాస్త్రీయంగా పరిగణించలేం. కేవలం అంచనా మాత్రమే. ఎందుకంటే సర్వేలో ప్రజలు పూర్తి వివరాలను కచ్చితంగా చెప్పారన్నదానికి ఆధారం లేదు. సర్వేలో ప్రజలు తమ ఇష్టపూర్వకంగా ఇచ్చిన సమాచారం ప్రకారం రూపొందించిన గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి.
 
  ‘భూమి’పుత్రులకు నెలవు
 సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడయిన అంశాలను పరిశీలిస్తే జిల్లాలో ‘భూమి’ ఉన్నవారు సగానికిపైగానే ఉన్నారు. మొత్తం 11,01,439 మంది ఇచ్చిన వివరాల ప్రకారం జిల్లాలో సొంతస్థలం ఉన్నవారి సంఖ్య 4,58,911 మంది. తెలంగాణలో మహబూబ్‌నగర్ తర్వాత మన జిల్లాలోనే ఈ సంఖ్య ఎక్కువ. ఇక, అసలు స్థలం కూడా లేని వారు కూడా ఎక్కువేనండోయ్. వారి సంఖ్య 6,42,528. ఇక పొలం విషయానికి వస్తే ఎకరం కంటే తక్కువ ఉన్న వారు జిల్లాలో 10శాతం మంది ఉన్నారు. మొత్తం 1,25,260 మందికి ఎకరం కంటే తక్కువ భూమి ఉందని సర్వే లెక్కలు చెబుతుండగా, తెలంగాణలో ఇది మూడోస్థానం. మనకన్నా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎకరం కన్నా తక్కువ ఉన్న వారు ఎక్కువ ఉన్నారు. ఇక, ఎకరం నుంచి రెండకరాలున్నవారు 96,007 మంది, రెండు నుంచి మూడెకరాలున్నవారు 81,266 మంది, మూడు నుంచి నాలుగెకరాలు ఉన్నవారు 53,349 మంది, నాలుగు నుంచి ఐదెకరాలున్నవారు 45,516 మంది, ఐదు కన్నా ఎక్కువ ఎకరాలున్న వారు 98,989 మంది ఉన్నారు. అంటే ఎకరం కంటే ఎక్కువ ఉన్న వారికన్నా, ఐదు కన్నా ఎక్కువ ఎకరాలున్న వారున్న కుటుంబాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అయితే, పేద జిల్లాగా పేరుపడ్డ మహబూబ్‌నగర్‌లో ఐదుకన్నా ఎక్కువ ఎకరాలున్న వారు మన జిల్లా కన్నా ఎక్కువ ఉండడం గమనార్హం.
 
30 ఏళ్లలోపు పెళ్లికాని మహిళలు 8వే ల మంది
 ఇక వర్గాల వారీగా పరిశీలిస్తే... జిల్లా అనాథలు, వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో అనాథలు 507 మంది ఉండగా, వికలాంగులు 68,218 మంది ఉన్నారు. అనాథల్లో రంగారెడ్డి తర్వాత, వికలాంగుల్లో కరీంనగర్ తర్వాత జిల్లానే మూడోస్థానంలో ఉంది. కనీసం ఇల్లు లేని సంచారజాతులు 1,25,001 మంది ఉంటే, ఇల్లున్న సంచార జాతుల వారు 1,024 మంది మాత్రమే. జిల్లాలో 30 ఏళ్లలోపు పెళ్లికాని మహిళల సంఖ్య 8,021 కాగా, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు, భర్తలు వదిలిపెట్టిన మహిళలు దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. జిల్లాలో సఫాయి కార్మికులు కూడా 1,332 మంది ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు చెబుతున్నాయి.
 
  రోగాలూ ఎక్కువే
 సర్వే లెక్కల ప్రకారం.. జిల్లాలో అనారోగ్యం బారిన పడుతున్న వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇందులో తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు 1,19,999 మంది ఉన్నారు. వరంగల్, కరీంనగర్ తర్వాత జిల్లాలోనే ఈ సంఖ్య ఎక్కువ. ఇక, క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కరీంనగర్ జిల్లా తర్వాత జిల్లాలోనే ఎక్కువగా 4,762 మంది ఉన్నారు. హృద్రోగాలున్నవారు 17,211 మంది కాగా, క్షయ వ్యాధి 4,590 మందికి, కుష్టు వ్యాధి 921 మందికి ఉంది. పక్షవాతంతో బాధపడుతున్నవారు 8,212 మంది, ఆస్తమా వ్యాధిగ్రస్తులు 11,862 మంది ఉన్నారు. ఇక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలోనే అత్యధికంగా 1,711 మంది ఉన్నార ని సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
 
  ఆదాయపు పన్ను కడుతున్న వారు తక్కువే..
 తెలంగాణవ్యాప్తంగా పరిశీలిస్తే జిల్లాలో ఆదాయపు పన్ను కడుతున్న వారి సంఖ్య తక్కువేనని సమగ్ర సర్వే లెక్కలంటున్నాయి. జిల్లాలో మొత్తం 30,268 మంది ఆదాయపు పన్ను కడుతున్నారని సర్వేలో చెప్పగా, నిజామాబాద్ జిల్లాలోనే మన కన్నా తక్కువ మంది ఆదాయపు పన్ను ఖాతాలు కలిగి ఉన్నారు. ఇక, బ్యాంకు ఖాతాల విషయంలో మనం ముందంజలో ఉన్నామని, జిల్లాలో 8,68,237 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయని సర్వేలో తేలింది. పోస్టాఫీసు ఖాతాల విషయంలో అయితే మనం తెలంగాణలోనే టాప్‌లో ఉన్నాం. మొత్తం 3,94,648 మందికి పోస్టాఫీసు ఖాతాలుండగా, స్వయం సహాయక సంఘాల సభ్యత్వం ఉన్నవారు కూడా జిల్లాలో ఎక్కువగానే ఉన్నారు. కరీంనగర్ తర్వాత మన జిల్లాలోనే ఎక్కువగా 5,26,915 మందికి ఎస్‌హెచ్‌జీల్లో సభ్యత్వం ఉంది. ఇక చరాస్తుల విషయానికి వస్తే జిల్లాలో 2,22,358 ద్విచక్రవాహనాలు, 17,133 నాలుగు చక్రాల వాహనాలున్నాయి. ట్రాక్టర్లు, వ్యవసాయ సామాగ్రి వాహనాల సంఖ్య తెలంగాణలోనే జిల్లాలో అధికంగా ఉంది. మొత్తం 18,156 ట్రాక్టర్లు, వ్యవసాయ సామగ్రి వాహనాలున్నాయని సర్వే లెక్కలు చెబుతున్నాయి.
 
 చిన్నకుటుంబాలే ఎక్కువ..
 సభ్యుల వారీగా కుటుంబాలను పరిశీలిస్తే జిల్లాలో చిన్నకుటుంబాల వారే ఎక్కువగా ఉన్నారు. అంటే చిన్నకుటుంబం - చింతలేని కుటుంబం అనే సూత్రాన్ని పాటిస్తున్నారు జిల్లావాసులు. మొత్తం 11,01,439 కుటుంబాలిచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో ఒక్క మహిళ ఉన్న కుటుంబాలు 1,18,224. ఇది తెలంగాణలోనే ఎక్కువ. అచ్చం మహిళలే ఉన్న కుటుంబాలు 1,94,454. ఇది కూడా రంగారెడ్డి జిల్లా తర్వాత మన జిల్లాలోనే ఎక్కువ. అంటే జిల్లాలో మహిళలు పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబాలు బాగానే ఉన్నాయన్నమాట. ఇక, ఒకే పురుషుడున్న కుటుంబాలు కూడా జిల్లాలో 1,21,085 ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇక, ఇద్దరు మాత్రమే ఉన్న కుటుంబాలు 2,37,167 కాగా, ముగ్గురున్న కుటుంబాలు 2,18,835, నలుగురున్న కుటుంబాలు 3,48,428 ఉన్నాయి. అంటే ఇద్దరు నుంచి నలుగురున్న కుటుంబాలు మొత్తం కుటుంబాల్లో 70శాతానికి పైగా ఉన్నాయన్నమాట. ఇక, పెద్ద కుటుంబాల విషయానికి వస్తే ఐదుగురుండే కుటుంబాలు 1,29,512 కాగా, ఆరుగురుండేవి 32,683, ఆరుగురు కన్నా ఎక్కువ ఉన్నవి 13,729 మాత్రమే. పెద్ద కుటుంబాలు కరీంనగర్, ఖమ్మం తర్వాత మన జిల్లాలోనే తక్కువ. అంటే లెక్కల ప్రకారం.. చివరి నుంచి మూడోస్థానంలో ఉన్నాం.
 
 విద్యుత్ లేని ఇళ్లలో మూడో స్థానం
 జిల్లాలోని ఇళ్లను పరిశీలిస్తే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సొంత ఇల్లున్న కుటుంబాలు 2,95,171 మంది. అంటే మొత్తం కుటుంబాల్లో ఇది 15శాతంపైమాటే. ఇక, అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారు జిల్లాలో 1,90,529 కుటుంబాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల తర్వాత అద్దె ఇళ్లల్లో ఉంటున్న వారి సంఖ్య జిల్లాలోనే ఎక్కువ కావడం గమనార్హం. ఇక, ప్లాస్టిక్ కప్పులున్న ఇళ్లు 49,362, పూరిగుడిసెలు 49,310 (వరంగల్ తర్వాత మన దగ్గరే ఎక్కువ.), రాతికప్పులున్నవి 81,053 ఉన్నాయి. మొత్తం ఇళ్లలో 40శాతం ఇళ్లు కాంక్రీట్ శ్లాబ్ ఇళ్లేనని లెక్కలు చెబుతున్నాయి. కాంక్రీట్ కప్పులున్న ఇళ్లు జిల్లాలో 4,36,097 కాగా, మొత్తం ఇళ్లలో మరుగుదొడ్లు లేనివి 5.62లక్షలు. ఇక, విద్యుత్ సౌకర్యం కూడా లేని ఇళ్లు జిల్లాలో 1,84,439 ఉన్నాయని, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ల తర్వాత మన జిల్లాలోనే ఎక్కువని గణాంకాలు చెపుతున్నాయి. ఇక, ఒకే గదిలో నివసిస్తున్నవారు జిల్లాలో 5,10,044 మంది కాగా, రెండు గదుల్లో ఉండేవారు 4,01,302 మంది. అంటే మొత్తం కుటుంబాల్లో దాదాపు 90శాతం మంది రెండుగదుల్లోపే ఉంటున్నారు. ఇక, మూడు గదుల ఇళ్లు 1,05,260 కాగా, నాలుగు గదులున్న ఇళ్లు 61వేలేనని సర్వే లెక్కలు చెబుతున్నాయి.
 
   ఉద్యోగ వర్గం..
 ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్యను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 31,192 మందికాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు 9,510 అని తేలింది. ఇక, వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు 25,103 మంది, ప్రభుత్వ రంగ సంస్థల్లో చేస్తున్న వారు 6,963 మంది ఉన్నారు. ఇక, నెలసరి వేతనం పొందే ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య 47,200 మంది.
 
 మతాలు, కులాల లెక్కలివి...
 సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో హిందూ మతస్తులు 10,33,702, ముస్లింలు 56,821, క్రిస్టియన్లు 9,178, సిక్కులు 737, జైనులు 40, బౌద్ధులు 21, ఇతరులు 940 మంది ఉన్నారని సర్వేలో పాల్గొన్న ప్రజలు చెప్పారు. ఇక, సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే జిల్లాలో బీసీల సంఖ్యే ఎక్కువ. మొత్తం జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement