జీవించే హక్కుపై కాలుష్యం కాటు
ప్రజాభాగస్వామ్యంతో దీన్ని అరికట్టాలి
♦ గవర్నర్ల సదస్సులో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు
న్యూఢిల్లీ: నగరాల్లో మితిమీరుతున్న కాలుష్యం.. ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే హక్కును కాలరాస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నియంత్రించేందుకు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రపతి భవన్‌లో గవర్నర్ల రెండురోజుల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రణబ్ మాట్లాడుతూ విధాన నిర్ణయంలో వాతావరణ మార్పు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీవలి కాలంలో దీని విపరిణామాలు ప్రకృతి విలయతాండవం రూపంలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రజలు ఉత్సాహంగా భాగస్వాములైతే కాలుష్యాన్ని, వాతావరణ విపరిణామాల్ని నివారించ వచ్చన్నారు. ఈ దిశగా గవర్నర్లు ప్రజల్ని ప్రోత్సహించాలని ప్రణబ్ కోరారు. 2015 అత్యధిక ఉష్ణోగ్రతగల సంవత్సరంగా రికార్డుల్లోకి ఎక్కిందని.. ఇలాంటి వాతావరణ మార్పులు విధాన నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
మరింత శాస్త్రీయంగా విపత్తు నిర్వహణ
విపత్తు నిర్వహణ విధానాలను మరింత శాస్త్రీయంగా రూపొందించుకోవాలని.. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చని రాష్ట్రపతి అన్నారు. రైతులు తీవ్ర కరువుతో ఇబ్బంది పడుతున్నారని, వాళ్ల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అన్నారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు గవర్నర్లు కీలక పాత్ర పోషించాలని అన్నారు.
రాజ్యాంగ పవిత్రతను రక్షించాలి
గవర్నర్ల మీద రాజ్యాంగ బాధ్యతలు ఉంటాయని, ఆ బాధ్యతలు ఉన్నవాళ్లందరూ రాజ్యాంగ పవిత్రతను కాపాడాలని రాష్ట్రపతి కోరారు. రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉండాలని అన్నారు.
ఫసల్ బీమాను వినియోగించుకోవాలి
రైతుల సంక్షేమం కోసం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్‌లను రాష్ట్రాల్లో సక్రమంగా అమలుచేయాలని కోరారు. సదస్సుకు 23 రాష్ట్రాల గవర్నర్లు, ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు.