సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి వైరస్ విశృంఖలంగా వ్యాపిస్తూ ఆందోళన రేకెత్తిస్తున్న క్రమంలో తాజాగా కరోనా వైరస్ బారిన పడి కోలుకునే వారి సంఖ్య పెరగడం ఊరట ఇస్తోంది. కేసుల సంఖ్య రెట్టింపయ్యే వేగం మందగించడంతో పాటు తాజాగా రికవరీ రేటు ప్రోత్సాహకరంగా పెరగడం విపత్తును అధిగమించే ఆశలు నింపుతోంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1336 పాజిటివ్ కేసులు నమోదవగా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 18,601కి పెరిగింది. కోవిడ్-19తో మరణించిన వారి సంఖ్య 590కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మంగళవారం వెల్లడించారు.
గడిచిన 24 గంటల్లో 705 మంది డిశ్చార్జి కాగా, కోలుకున్న వారి సంఖ్య 17.47 శాతం వృద్ధితో 3252 మందికి చేరిందని చెప్పారు. మహమ్మారి బారినుంచి కోలుకునే వారి సంఖ్యను సూచించే రికవరీ రేటు గణనీయంగా పెరగుతుండటం ఊరట ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4,49,810 కరోనా టెస్టులు నిర్వహించామని, సోమవారం ఒక్కరోజే 35,802 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. కాగా, రానున్న రెండు రోజుల పాటు కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడవద్దని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ సూచించింది. లోపాలున్న కిట్స్‌పై విచారణ చేపట్టిన అనంతరం రెండు రోజుల్లో నూతన మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. లోపాలు తలెత్తిన కిట్స్‌పై తయారీదారులను సంప్రదిస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment