ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై గందరగోళం కొనసాగుతోంది.
ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై గందరగోళం కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్ గోయెల్ తాను ఏ పదవికీ అభ్యర్థిని కాదని సోమవారం చెప్పారు. ముందుగా అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల పార్టీలో విభేదాలు వస్తాయని, దీనివల్ల ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన అన్నారు.
ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హర్షవర్ధన్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో హర్షవర్ధన్తో పోటీపడుతున్నారా అన్న ప్రశ్నకు.. తాను ఏ పదవికీ పోటీదారుడు కాదని గోయెల్ బదులిచ్చారు. ఈ విషయంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది కార్యకర్తల అభీష్టం మేరకు ఎంపిక చేస్తుందని తెలిపారు. హర్షవర్ధన్ను ఎంపిక చేస్తే పార్టీ పదవికి తాను రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలను గోయెల్ ఖండించారు. పార్టీ అగ్రనేతలు రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీలతో ఆయన ఇటీవల సమావేశమయ్యారు.