
పార్లమెంటులో వ్యూహంపై యూపీఏ చర్చ
* ఎన్నికల తర్వాత సోనియా నేతృత్వంలో తొలి భేటీ
* ఆర్జేడీ చీఫ్ లాలూ హాజరు
న్యూఢిల్లీ: కొత్త లోక్‌సభ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో యూపీఏ మిత్రపక్షాలు పార్లమెంటులో సమన్వయంతో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారమిక్కడ సమావేశమై చర్చించాయి. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ సమన్వయ కమిటీ భేటీ కావడం ఇదే తొలిసారి. దీనికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఐయూఎంఎల్ చీఫ్ ఈ. అహ్మద్, ఆరెల్డీ అధినేత అజిత్ సింగ్ తదితరులు హాజరయ్యారు. యూపీఏ-2 ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిచ్చిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యూదవ్ కూడా పాల్గొన్నారు.
ఎన్నికల ఫలితాలతోపాటు పార్లమెంటు సమావేశాల్లో సమన్వయంతో ఎలా వ్యవహరించాలో చర్చించారు. సమావేశాలను అడ్డుకుంటున్నట్లు కనిపించకుండా దూకుడు విపక్షంగా ఎలా పని చేయాలో మంతనాలు జరిపారు. పార్లమెంటులో మరింత సన్నిహితంగా పనిచేయాలని యూపీఏ మిత్రపక్షాలు కోరుకుంటున్నాయని సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ విలేకర్లకు చెప్పారు. దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై జాగరూకతతో ఉండాలని నిర్ణయించినట్లు పవార్ తెలిపారు. కాగా, యూపీఏ ఎంపీలకు సోనియా ఈ నెల 5న పార్లమెంటు భవనంలో విందు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
రాజ్యసభ నేత రేసులో ఆజాద్, ఆంటోనీ
రాజ్యసభలో కాంగ్రెస్ నేత హోదాకు ఆంటోనీ, గులాం న బీ ఆజాద్, ఆనంద్ శర్మ, దిగ్విజయ్ సింగ్, జనార్దన్ ద్వివేది తదితరుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. లోక్‌సభలో పార్టీ నేతగా దక్షిణాదికి చెందిన దళిత నేత మల్లికార్జున ఖర్గేను నియమించారు కనుక రాజ్యసభలో పార్టీ నేతగా ఉత్తరాదికి చెందిన దళితేతర నేతను నియమించే అవకాశముందని పార్టీ నేత ఒకరు చెప్పారు.