మూడో జాబితాలో ఫిరాయింపులకే పెద్దపీట
అమృత్‌సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే 23 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను గురువారం కాంగ్రెస్ వెల్లడించింది. ఫిబ్రవరి 4న జరగనున్న ఎన్నికలకు గాను ఇప్పటికే విడుదల చేసిన రెండు జాబితాలలో 77 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మధుసుధన్ మిస్త్రీ ప్రకటించిన మూడో జాబితాలో ఎక్కువగా అకాలీదళ్ నుంచి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత లభించింది. అకాలీదళ్ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన రాజ్విందర్ కౌర్, కమల్‌జిత్ సింగ్, దేవిందర్ గుబయ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 117 సీట్లకు గాను తాజా జాబితాతో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా 100కు చేరింది. మిగిలిన 17 సీట్ల కోసం భారీగా లాబీయింగ్ జరుగుతుందని సమాచారం.