జస్టిస్ దీపక్ మిశ్రా (ఫైల్)
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. అందుకోసం వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీల నుంచి కాంగ్రెస్ పార్టీ సంతకాలు సేకరిస్తోందని ఎన్సీపీ నేతలు వెల్లడించారు. ఈ అంశంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించగా.. ఎన్సీపీ ఎంపీ మజీద్ మెమన్ మాట్లాడుతూ ‘భారతదేశ ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కోసం ప్రక్రియను కాంగ్రెస్ మొదలుపెట్టింది.
నోటీసుపై నేను సంతకం చేశాను. ఎంత మంది సంతకం చేశారన్న విషయాన్ని కాంగ్రెస్‌నే అడగండి’ అని సమాధానమిచ్చారు. మరో ఎన్సీపీ ఎంపీ డీపీ త్రిపాఠీ మాట్లాడుతూ.. ‘నోటీసుపై నాతో పాటు ఇతరులు కూడా సంతకాలు చేశారు. ప్రక్రియ కొనసాగుతోంది’ అని చెప్పారు. సంతకాలు చేసిన వారిలో ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఇతర పార్టీల ఎంపీలు ఉన్నారని, కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సంతకం చేశారని తెలిపారు.
సీజేఐకి వ్యతిరేకంగా పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే నోటీసుపై లోక్‌సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలు అవసరం. రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యి అభిశంసన అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment