జితేంద్ర దేశ్ ప్రభు(ఫైల్ ఫోటో)
పనాజీ : వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ సీనియర్ నేత, రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన జితేంద్ర దేశ్ ప్రభు మృతిచెందారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. న్యుమోనియా తీవ్రతతో గత నెలలో జితేంద్ర ప్రభు మరణించారు. దేశ్ ప్రభుకి వైద్యసహాయం అవసరమైన సమయంలో ఆసుపత్రిలోని ఇద్దరు కీలక డాక్టర్లు గైర్హాజరయ్యారని కాంగ్రెస్ పార్టీ గోవా అధ్యక్షులు గిరీష్ చొడాంకర్ ఆరోపించారు. అనుమానాస్పదస్థితిలో మృతిచెందిన తమ నేత మృతిపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
ఈ ఘటనపై సీనియర్ రెసిడెంట్ వైద్యుడిని, గోవా మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి డీన్ సస్పెండ్ చేశారు. రేడియాలజీ విభాగం అధిపతి డాక్టర్ జీవన్ వెర్నేకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దేశ్ ప్రభు జీఎంసీలో చేరాక, సిటీ స్కాన్ నిర్వహించడంలో ఆలస్యం జరిగనట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ దేశ్ ప్రభుతో కలిసి అక్కడికి వెళ్లినప్పుడు సిటీ స్కాన్ చేయడానికి జూనియర్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు అక్కడ లేరని, దీంతో 35 నిమిషాలు అక్కడే వేచి ఉండాల్సి వచ్చిందని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే వైద్యుడిని సస్పెండ్ చేయడాన్ని గోవా అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్లు నిరసిస్తున్నారు. కరోనా మహమ్మారితో ముందుండి పోరాడుతున్న డాక్టర్లపై ఇప్పటికే అధిక భారం ఉందని, వైద్యుడిని సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment