రాజ్యసభ రగడపై అధిష్టానం కలవరపాటు
ముఖ్య నేతలతో సోనియా మంతనాలు
రంగంలోకి దిగిన దిగ్విజయ్, పటేల్
నేరుగా ధిక్కార ఎమ్మెల్యేలతో చర్చలు
హస్తినకు రావాలని బొత్సకు సూచన
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలపై రాష్ట్రంలో సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయకముందే పార్టీ ఎమ్మెల్యేలు సొంతంగా అభ్యర్థిని బలపరచడం, వారికి అనుకూలంగా సంతకాలు చేయడం తదితర పరిణామాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. సీమాంధ్ర ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉన్న అధినేత్రి సోనియాగాంధీ... ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతను అహ్మద్ పటేల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌లకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. సోనియా ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఈ ఇద్దరు నేతలు ధిక్కార నేతలతో నేరుగా మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మూడు సీట్లు గెల్చుకోవాల్సిందే..
ఎన్నికల నామినేషన్ గడువుకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తును అధిష్టానం ముమ్మరం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఉన్న సంఖ్యాబలం మేరకు పార్టీకి మూడు సీట్లు లభించడం ఖాయంగా కనిపిస్తున్నా.. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేల తీరు పెద్దలను సంకట స్థితిలోకి నెట్టేస్తోంది. హైకమాండ్ నుంచి క్రమశిక్షణా రాహిత్య నోటీసులు అందుకున్న సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డికి మద్దతుగా ధిక్కార ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. ఇక మరో వర్గం... ఎమ్మెల్సీ చైతన్యరాజును పోటీలో దింపేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ కీలక అంశాలపై చర్చించేందుకు అధిష్టానం పెద్దలు గురువారం సోనియా నివాసంలో భేటీ అయ్యారు. ఇందులో అహ్మద్‌పటేల్, దిగ్విజయ్, కేంద్ర మంత్రులు ఆంటోనీ, షిండే, గులాంనబీ ఆజాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా... ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు సీట్లు గెలుచుకోవాలని, ధిక్కార ఎమ్మెల్యేలందరితో మాట్లాడాలంటూ దిగ్విజయ్, అహ్మద్ పటేల్‌లను ఆదేశించినట్లుగా సమాచారం. దీంతో వారిరువురు రాష్ట్రంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది.
పీసీసీ అధ్యక్షుడు బొత్సతో మాట్లాడిన దిగ్విజయ్.. ధిక్కార ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని ఆదేశించినట్లుగా తెలిసింది. వారిని సముదాయించే ప్రయత్నాలు చేయాలని సైతం సూచించారని చెబుతున్నారు. దీంతో ఆయన... పోటీచేయూలని భావిస్తున్న పార్టీ నేత జేసీ దివాకర్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చైతన్యరాజులతో వూట్లాడారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. అన్ని విషయూలు ఆలోచించుకొనే తాను నామినేషన్ వేస్తున్నానని బొత్సకు స్పష్టం చేసినట్లు సమాచారం. అధిష్టానం ఆదేశాల నేపథ్యంలో అన్ని వివరాలతో బొత్స శుక్రవారం ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. బొత్సతోపాటు సీఎం కూడా ఢిల్లీ వెళ్తారని భావిస్తున్నా.. విభజన బిల్లుపై రాష్ట్రపతి గడువు పొడిగించిన నేపథ్యంలో సీఎం ఢిల్లీ వెళ్లకపోవచ్చని, ఫోన్‌లోనే మాట్లాడతారని సన్నిహితులు చెబుతున్నారు.
వారితో మాట్లాడతా: దిగ్విజయ్
సోనియాతో భేటీ అనంతరం దిగ్విజయ్‌సింగ్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాజ్యసభ ఎన్నికల విషయంలో పార్టీని ధిక్కరిస్తున్న ఎమ్మెల్యేలతో మాట్లాడతానని తెలిపారు. రాజ్యసభకు పోటీచేస్తానని జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించడం ఆయన వ్యక్తిగతమని, ఎవరైనా పోటీకి దిగవచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో విభజన బిల్లుకు సంబంధించి రాష్ట్రపతి పొడిగించిన గడువును సీఎం, ఎమ్మెల్యేలు సద్వినియోగ పరుచుకోవాలని, నిర్ణీత గడువులోగా బిల్లును వెనక్కి పంపాలని సూచించారు.
వామపక్షాల మద్దతు కోరిన జేసీ
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటున్న జేసీ దివాకర్‌రెడ్డి గురువారం వామపక్షాల మద్దతు అభ్యర్థించారు. ఉదయం అసెంబ్లీ వాయిదా పడగానే.. లాబీలోని వామపక్ష పార్టీల శాసనసభాపక్ష కార్యాలయానికి వచ్చిన ఆయన సీపీఐ, సీపీఎం సభ్యులతో ఈ మేరకు మాట్లాడారు. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ అన్నీ ఆలోచించే దిగుతున్నారా అని అడగ్గా.. తాను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉంటానని, అందరూ సహకరిస్తే గెలుస్తానని జేసీ బదులిచ్చారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో తనకు ఓటేస్తే వోల్వో బస్సు ఇస్తానన్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు.
రాజ్యసభకు నేనే పోటీ చేస్తా: గంటా
రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ ఎన్నికల్లో తానే పోటీ చేయాలన్న ఆలోచనకు మంత్రి గంటా శ్రీనివాసరావు వచ్చినట్టు తెలిసింది. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ చైతన్యరాజుకు మద్దతుగా ఆయన తరఫున నామినేషన్ పత్రాలపై ప్రతిపాదిస్తూ ఎమ్మెల్యేల నుంచి గురువారం గంటా సంతకాలను సేకరించారు. ఇలా సంతకాలు సేకరించినప్పుడు మీరే పోటీ చేయొచ్చని పలువురు ఎమ్మెల్యేల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు రావడంతో గురువారం రాత్రి కొత్త ఆలోచనకు వచ్చారు. సన్నిహితులతో సమాలోచనలు జరిపి చివరకు రాజ్యసభ బరిలో నిలవాలన్న ఆలోచనకు వచ్చారు.
‘పెద్ద’ టెన్షన్!
Published Fri, Jan 24 2014 12:41 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement