ప్రధాన కార్యదర్శులతో సోనియా చ ర్చలు
రాజు, కేవీపీల పేర్లు దాదాపు ఖరారు
మూడో స్థానానికి బొత్స, సుబ్బిరామిరెడ్డి పట్టు!
టీఆర్‌ఎస్ కోరితే నాలుగో స్థానాన్ని వదిలేయాలని నిర్ణయం!
4వ స్థానంలో పోటీ చేయాల్సివస్తే
తెలంగాణ నుంచి మైనార్టీలకు చాన్స్
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. రాష్ట్రం నుంచి బరిలో నలుగురిని పోటీ చేయించాలని, సీమాంధ్ర నుంచి గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే, నలుగురిని నిలిపితే గట్టెక్కగలమా? ముగ్గురితోటే సరిపెట్టుకోవాలా? టీఆర్‌ఎస్ వైఖరి ఎలా ఉండబోతోంది.. తదితర అంశాలపై పార్టీ అధిష్టానం కూలంకషంగా చర్చిస్తోంది. రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు శనివారం ఉదయం నుంచి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిలుగా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, విజయావకాశాలపై సమగ్ర నివేదికతో హస్తిన చేరిన పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం ఉదయమే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. అనంతరం సోనియాగాంధీతో దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యారు. సాయంత్రం బొత్స సత్యనారాయణతో చర్చించారు. అనంతరం బొత్స శనివారం రాత్రి హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. రాహుల్‌కు సన్నిహితుడుగా పేరున్న ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, సిట్టింగ్ సభ్యుడిగా ఉన్న కె.వి.పి.రామచంద్రరావుల పేర్లు దాదాపు ఖరారైనట్టు సమాచారం.
సీమాంధ్రలో అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతలను అప్పగిస్తూ కేవీపీని బరిలోకి దింపనున్నట్టు సమాచారం. మూడో అభ్యర్థిని కూడా సీమాంధ్ర నుంచే నిలపాలా? లేక తెలంగాణ నుంచి ఇద్దరిని నిలబెట్టాలా? అన్న మీమాంస అధిష్టానాన్ని వీడటంలేదు. అయితే, మూడో స్థానానికి మాత్రం సీమాంధ్ర నుంచి గట్టి పోటీ నెలకొంది. పార్టీ బాధ్యతలు చూస్తున్న తనకు అవకాశం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స గట్టిగా కోరుతున్నట్లు తెలిసింది. ఆయనకు దిగ్విజయ్‌సింగ్ కూడా గట్టి మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. ఇప్పటివరకు లోక్‌సభకు పోటీ చేస్తానని చెబుతున్న టి.సుబ్బిరామిరెడ్డి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా రాజ్యసభ సీటు కోరుతూ శనివారం సాయంత్రం దిగ్విజయ్‌సింగ్‌తో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. పార్టీకి పూర్తి విధే యురాలిగా ఉన్న తనకు అవకాశమివ్వాలని కోరినట్లు తెలిసింది.
రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన నంది ఎల్లయ్యకు బదులు ఇప్పుడు సీమాంధ్రలో ఒక దళితుడికి అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఆ స్థానం కొప్పుల రాజుతో భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో పనబాక లక్ష్మికి అవకాశం దక్కకపోవచ్చు. అయితే, మహిళలకు అవకాశం ఇవ్వాలన్న రాహుల్ ఆలోచనలు ఆచరణలోకి వస్తే పనబాకకు రాజ్యసభ సీటు దక్కినా ఆశ్చర్యం లేదని పార్టీవర్గాలు అంటున్నాయి. టీఆర్‌ఎస్ కోరితే నాలుగో స్థానాన్ని ఆ పార్టీకి వదిలేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు లేదా విలీనం వ్యవహారం సజావుగా సాగేందుకు ఇది దోహదం చేస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఒకవేళ నాలుగో స్థానానికి పోటీ చేయాల్సి వస్తే తెలంగాణ నుంచి మైనారిటీలకే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ లేదా మైనారిటీ వర్గానికే చెందిన మరో నాయకుడికి గానీ అవకాశం దక్కే పరిస్థితి ఉంది. అయితే ఎం.ఐ.ఎం. వైఖరినిబట్టి అభ్యర్థి నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
అధిష్టానం మల్లగుల్లాలు
Published Sun, Jan 26 2014 2:22 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement
Advertisement