‘హోదా’ ఇచ్చేలా చొరవ చూపండి
♦ రాష్ట్రపతికి ‘చలో ఢిల్లీ’ యాత్ర బృందం వినతి
♦ దిగ్విజయ్‌సింగ్ నేతృత్వంలో కలసిన కాంగ్రెస్ నేతలు
♦ బృందంలోని సభ్యుడు వెంకయ్య హఠాన్మరణం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందు 300 మంది ప్రతినిధుల బృందంతో ఢిల్లీ చేరుకుని సోమవారం ఇక్కడ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేలా చొరవచూపాలని విజ్ఞప్తి చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీలు చిరంజీవి, జేడీ శీలం, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు.
భేటీ అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీల్లో బీజేపీ భాగస్వామి. 15 ఏళ్లు ఇప్పించేలా చేస్తామని టీడీపీ చెప్పింది. రెండేళ్లయినా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం, కడప స్టీలు ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు, ఇతర ప్రాజెక్టులు, రాజధానికి నిధులు, రెవెన్యూలోటు భర్తీ తదితర అంశాల్లో కేంద్రం కనిక రం చూపడం లేదు. రాష్ట్రపతిని కలిసి అంశాలన్నీ వివరించాం. గతంలో సోనియాగాంధీ ఉత్తరం రాశారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగడతాం. ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్ కోరాం’ అని పేర్కొన్నారు. ప్రతినిధి బృందం సాయంత్రం 6 గంటలకు జేడీయూ నేత శరద్‌యాదవ్‌ను కలిసింది. 6.30కు శరద్‌పవార్‌ను, 7 గంటలకు సీపీఐ నేత డి.రాజాను కలిసింది.
వినతిపత్రంలోని ముఖ్యాంశాలు..
‘ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయడంలో జాప్యంపై ఆవేదనతో ఉన్న కోటి మంది నుంచి సంతకాలను సేకరించి తెచ్చాం. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేస్తే బీజేపీ నేత వెంకయ్యనాయుడు పదేళ్లు అమలు చేస్తామని రాజ్యసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. అడిగితే నాటి హామీకి చట్టబద్ధత లేదంటున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు అలాంటి ఆమోదం ఏదీ తీసుకోలేదు. కేవలం కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా అమలు చేయాల్సిన ప్రత్యేకహోదాపై తాత్సారం చేస్తున్నారు. పన్ను ప్రోత్సాహకాలు, పోలవరం నిర్మాణం, రెవెన్యూ లోటు భర్తీ, వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం వంటి అంశాలను బీజేపీ విస్మరించింది’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ‘ఛలో ఢిల్లీ’ యాత్రలోని ప్రతినిధి బృందంలో గుంటూరు నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత ఎల్.వెంకయ్య గుండెపోటుతో మృతి చెందారు.