
సిమ్లా: వచ్చే నెల 9న హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ప్రభుత్వం నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనిల్ శర్మ తప్పుకుని బీజేపీలో చేరారు. కేంద్ర కమ్యునికేషన్ శాఖ మాజీ మంత్రి సుఖ్‌రాం కుమారుడే ఈ అనిల్ శర్మ. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగి బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆదివారం అనిల్ శర్మ ప్రకటించారు. మండీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా తనకు బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7న మండీలో రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి హాజరవ్వాల్సిందిగా ఏఐసీసీ నుంచి తన తండ్రికి తొలుత ఆహ్వానం అందిందని, తీరా అక్కడికి వెళ్లేసరికి ర్యాలీకి రావాల్సిన అవసరం లేదంటూ అవమానించి పంపించారని విచారం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన ఏ కమిటీల్లోనూ తనను భాగం చేయలేదని, దీనిపై తాను హెచ్‌పీసీసీ అధ్యక్షుడిని సంప్రదిస్తే అధిష్టానం తన పేరును తొలగించాల్సిందిగా ఆదేశించినట్లు ఆయన చెప్పారని వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ శర్మ మామే అనిల్‌శర్మ.
నేడు నోటిఫికేషన్ జారీ: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నేడు నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో సోమవారం నుంచి నామినేషన్లు మొదలు కానున్నాయి. అక్టోబర్ 23 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment