గోవా సీఎం ప్రమోద్ సావంత్
పనాజీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన కేబినెట్‌లోని నలుగురు మంత్రులపై వేటు వేశారు. వారి స్థానంలో ముగ్గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, మరో కాంగ్రెస్ నాయకుడి భార్యకు మంత్రి పదవులు కేటాయించారు. పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వీరిలో ముగ్గురిని మంత్రులుగా నియమించారు. ఇక, కాంగ్రెస్ మాజీ నాయకుడు అటనాషియో మాన్సెరేట్‌కు కేటాయించిన మంత్రి పదవిని చివరి నిమిషంలో ఆయన భార్య జెన్నీఫర్‌కు కేటాయించారు. నిన్నటివరకు కాంగ్రెస్ నాయకుడిగా, రాష్ట్ర ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రకాంత్ కవ్లేకర్ తాజా మంత్రివర్గ విస్తరణతో ఉప ముఖ్యమంత్రిగా మారారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులో కీలక పాత్ర పోషించిన కవ్లేకర్‌కు పట్టణాభివృద్ధి శాఖతోపాటు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు.
మరో కాంగ్రెస్ ఫిరాయింపు ఎమ్మెల్యే ఫిలిప్ నేరి రోడ్రిగ్స్‌తోపాటు నిన్నటి వరకు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న మైఖేల్ లోబ్‌కు కూడా మంత్రి పదవులు దక్కాయి. నలుగురు మంత్రుల తొలగింపు వెనుక చాలా కారణాల ఉన్నాయని, అన్ని విధాలుగా ఆలోచించే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని గోవా సీఎం సావంత్ తెలిపారు. 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభా పక్షాన్ని బీజేపీలో విలీనంచేయడంతో 40 మంది సభ్యులన్న గోవా అసెంబ్లీలో కమలం పార్టీ బలం 27కు పెరిగింది. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఐదుకు పడిపోయింది. ఇక, బీజేపీ సభ్యులైన విజయ్ సర్దేశాయ్, వినోదా పాలియోన్కర్, బీజేపీ మిత్ర పక్షమైన గోవా ఫార్వర్ఢ్ పార్టీ ఎమ్మెల్యే జయేష్ సల్గాకోకర్, స్వతంత్ర ఎమ్మెల్యే రోహన్ ఖౌంటేలు తమ మంత్రి పదవులు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment