
వీకే సింగ్‌ను తొలగించాల్సిందే...
న్యూఢిల్లీ: దళిత చిన్నారుల సజీవదహనం ఉదంతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వి.కె.సింగ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని పట్టుబడుతున్న ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంటు భవనం వెలుపల నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు ఉభయసభల భేటీకి ముందు.. రాహుల్‌గాంధీ సారథ్యంలో జరిగిన ఈ నిరసనలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. ఒక కేంద్రమంత్రి ఒక నిర్దిష్ట వర్గానికి-ఆ మాటకొస్తే భారతీయులకు వ్యతిరేకంగా వ్యవహరించిన తీరును బట్టే ఈ అంశా న్ని లేవనెత్తుతున్నామని పేర్కొన్నారు.
ఇదిలావుంటే.. ఆ అంశంపై ఈ నెల 2వ తేదీన లోక్‌సభలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను రికార్డుల్లో చేర్చలేదంటూ ఖర్గే జీరో అవర్‌లో స్పీకర్‌కు ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. దళిత చిన్నారుల సజీవదహనం సందర్భంగా వీకే సింగ్ చేసిన ‘కుక్క’ వ్యాఖ్యల్లో నేరపూరిత ఉద్దేశ్యం లేదని స్పష్టంచేస్తూ.. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలంటూ వచ్చిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఆయన మాటల్లో దళితులను కించపరిచే వ్యాఖ్యలు లేవని, కేంద్రప్రభుత్వం బాధ్యత లేదు అని చెప్పేందుకే ‘కుక్క’ వ్యాఖ్యలుచేశారని సోమవారం విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.