
సీపీపీ చైర్‌పర్సన్‌గా సోనియా
వరుసగా ఐదోసారి ఈ పదవికి ఎన్నిక
ఆమె పేరును ప్రతిపాదించిన ఖర్గే
బలపరిచిన కిద్వాయ్, ఇతర నేతలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ శనివారం తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో సోనియా పేరును పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా మొహిసినా కిద్వాయ్ సహా ఇతర నేతలు ఆ ప్రతిపాదనను బలపరిచారు. తాజా ఎన్నికతో సోనియా సీపీపీ పగ్గాలను వరుసగా ఐదోసారి చేపట్టినట్లయింది. 1998 మార్చి 16న సోనియా తొలిసారి సీపీపీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అప్పుడు ఆమె పార్లమెంటు ఉభయ సభల్లోనూ సభ్యురాలు కాకపోవడం గమనార్హం. ఎన్నికల ప్రచారంలో పార్టీని ముందుండి నడిపించిన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సమావేశంలో వెనక బెంచీకే పరిమితమయ్యారు.
సీపీపీ చీఫ్‌గా ఎన్నికైన అనంతరం సోనియా పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యానికి రాహుల్ బృందం అనుసరించిన వైఖరే కారణమంటూ కొందరు నేతలు బహిరంగ విమర్శలు చేసిన నేపథ్యంలో సోనియా స్పందించారు. ప్రజా వ్యతిరేకతను అంచనా వేయడంతో విఫలమయ్యామని, ఓటమి నుంచి గుణాపాఠాలు నేర్చుకోవాలని అన్నారు.
అధైర్యం వద్దు: పార్టీ ఓటమి అందరినీ కలచివేసినా అధైర్యపడొద్దని నేతలకు సోనియా సూచించారు. ‘‘బీజేపీకి 17.16 కోట్ల ఓట్లు లభిస్తే మనం 10.69 కోట్ల ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచాం. పార్టీకి అనాదిగా ఉన్న విస్తృత జనాదరణ, మద్దతును తిరిగి పొందేందుకు కష్టపడటమే మనం ఇక చేయాల్సింది’’ అని పేర్కొన్నారు. యూపీఏ-2 ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదించడంలో ప్రధాన ప్రతిపక్షం (బీజేపీ) సహకరించలేదని సోనియా విమర్శించారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ అవకాశవాదానికి పాల్పడిందని దుయ్యబట్టారు. లోక్‌సభలో తాము కేవలం 44 సీట్లనే గెలుచుకున్నప్పటికీ విపక్షంగా దూకుడుగా వ్యవహరిస్తామని సోనియా పేర్కొన్నారు. గత లోక్‌సభ ముందు ఉంచిన పెండింగ్ బిల్లుల విషయంలో నూతన ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూస్తామన్నారు. లోక్‌సభలో తమ బలం తక్కువగా ఉన్నా రాజ్యసభలో ఇప్పటికీ తమదే అతిపెద్ద పార్టీ అని గుర్తుచేశారు. కాగా, పార్లమెంటులో బలమైన, సంఘటితమైన ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు నిర్మాణాత్మక, లౌకిక శక్తులన్నీ ఏకతాటిపైకి వస్తాయని ఆశిస్తున్నట్లు సీపీపీ తీర్మానం చేసింది. మోడీ నాయకత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి ఈ భేటీలో నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిపక్ష నేతపై సోనియాదే నిర్ణయం: లోక్‌సభలో ప్రతిపక్ష నేత నియామకంపై సోనియానే తుది నిర్ణయం తీసుకుంటారని జనార్దన్ ద్వివేదీ తెలిపారు. సీపీపీ చైర్‌పర్సన్‌గా సోనియా ఎన్నిక కావడంతో ప్రతిపక్ష నేత, చీఫ్ విప్‌లను నియమించే అధికారం ఆమెకుందన్నారు. కాగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సోనియా లేక రాహులే ఉండాలంటూ పార్టీలోని ఓ వర్గం నేతలు పట్టుబడుతుండగా సీనియర్ నేత కమల్‌నాథ్ పేరూ వినిపిస్తోంది. రాజ్యసభలో పార్టీ నేతగా ఆంటోనీ, ఆజాద్ పేర్లు వినిపిస్తున్నాయి. సోనియా, రాహుల్ నాయకత్వంపై నమ్మకం ఉందని ఆంటోనీ, కమల్‌నాథ్ పేర్కొన్నారు.