
సదస్సులో పాల్గొన్న జాన్ కుఫూర్, సోనియా గాంధీ, హమీద్, మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా రెండు రోజులు నిర్వహిస్తున్న ఈ సదస్సులో ఆ పార్టీ సీనియర్ నేతలు చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, కమలనాధ్, కపిల్ సిబాల్ కనిపించలేదు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు కూడా హాజరుకాలేదు. జైరామ్ రమేష్ విదేశాలకు వెళ్లారు. ఏకే ఆంటోనీ అనారోగ్య కారణంగా హాజరుకాలేదు.
ఈరోజు సదస్సుకు ఎన్డీయేతర పార్టీల నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జై, ఘనైనా అధ్యక్షుడు జాన్ కుఫూర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, మాజీ ప్రధాని దేవగౌడ, సీపీఐ నేత సీతారామ్ ఏచూరి, రాజా, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, టిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. అంతేగాక కాంగ్రెస్ ఆహ్వానం మేరకు దాదాపు 50 దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.