ఆ బడ్జెట్ మీడియాను కొనేయడానికేనా?
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ప్రచార బడ్జెట్ పై కాంగ్రెస్ మండిపడింది. గతంలో కేవలం రూ.24 కోట్ల మేర ఉన్న రాష్ట్ర ప్రచార బడ్జెట్ అమాంతం రూ.526.19 కోట్లకు పెంచడంపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ రాష్ట్రం ధనిక రాష్ట్రం కాదని తెలిసినా ప్రచారాల కోసం ఇంతమేర బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అంతపెద్ద మొత్తంలో ప్రచార ప్రకటనల కోసం ఖర్చుపెట్టడం సరికాదని మాకెన్ అన్నారు. ఏకంగా మీడియానే కొనుగోలు చేయడానికి బడ్జెట్ ను ప్రవేశ పెట్టినట్లుందని మాకెన్ ఎద్దేవా చేశారు.
మౌలిక సదుపాయాల అభివృద్ధికి తగిన నిధులు లేవు కానీ.. ప్రచార ఆర్భాటాలకు మాత్రం వందల కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. కాగా, ప్రభుత్వ అధికార ప్రతినిధి నాగేంద్ర శర్మ మాత్రం మాకెన్ వ్యాఖ్యలను ఖండించారు. తొలిసారి సమాచార ప్రచార శాఖను ఏర్పాటు చేయడంతోనే అంతమొత్తంలో నిధులు కేటాయించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అయితే దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందా? అని మాకెన్ సవాల్ విసిరారు.