నరేంద్ర మోడీ మౌనం ఎందుకో?
న్యూఢిల్లీ: ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నోరు పెదవి మెదపక పోవడంపై కాంగ్రెస్ మండిపడింది. అవకాశం దొరికితే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడే మోడీ.. లాలూ అంశం తెరపైకి వచ్చేసరికి ఎందుకు మాట్లాడటం లేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. చిటికీ మాటికీ కాంగ్రెస్ ను తూర్పార బట్టే మోడీ లాలా ప్రసాద్ దాణా కుంభకోణంపై మౌనం పాటించటం వెనుక కారణమేమిటని కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ షకీల్ అహ్మద్ ట్విట్టర్ లో నిలదీశారు.
రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో తుది తీర్పు సోమవారం వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం జార్ఖండ్ రాజధాని రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జగన్నాథ్ మిశ్రాలను కోర్టు దోషులుగా నిర్థారించింది. భారీ భద్రత, కిక్కిరిసిన జనం మధ్య తీర్పు వెలువరించిన సీబీఐ జడ్జి పీకే సింగ్.... మొత్తం 45 మందిని దోషులుగా పేర్కొన్నారు. లాలూకు మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం అన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.