సాక్షి, న్యూఢిల్లీ : హర్యానా, రాజస్ధాన్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పాలక, విపక్షాలకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. రాజస్ధాన్‌లోని రామ్‌గఢ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి సఫీయా ఖాన్ విజయం సాధించారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జుబైర్ ఖాన్ భార్య సఫీయా ఖాన్ భారీ ఆధిక్యంతో బీజేపీ అభ్యర్ధిపై ఘనవిజయం సాధించారు.
జింద్‌లో బీజేపీ ముందంజ
హర్యానాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో పాలక బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్‌ఎల్డీ, జేజేపీల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఎన్నికల ఫలితాలూ ఉత్కంఠను రేపుతున్నాయి. తొలి రౌండ్‌లో ఆధిక్యం కనబరిచిన జేజేపీ, కాంగ్రెస్‌లు ఆ తర్వాత వెనుకంజ వేయగా ఏడో రౌండ్ ముగిసిన అనంతరం బీజేపీ 9300 ఓట్ల ఆధిక్యం సాధించింది.
జింద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున దిగ్గజ నేత రణ్‌దీప్ సుర్జీవాలా బరిలో నిలవగా, బీజేపీ తరపున మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మిద్ధా కుమారుడు కృష్ణ మిద్దా పోటీ చేశారు. ఐఎన్‌ఎల్డీ నుంచి ఉమ్ సింగ్, కొత్తగా ఏర్పాటైన జేజేపీ నుంచి దిగ్విజయ్ చౌతాలా రంగంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment