భోపాల్ : పార్టీ గెలుపు కోసం నాయకుల కంటే ఎక్కువ కార్యకర్తలే కృషి చేస్తారు. ఈ క్రమంలో గెలుపు కోసం పూజలు, యాగాలు చేసేవారు కొందరైతే భీష్మ ప్రతిజ్ఞలు చేసేవారు మరి కొందరు. మొన్న తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ గెలిస్తేనే గడ్డం గీసుకుంటానని ఓ నాయకుడు.. ఓడిపోతే పీక కోసుకుంటానంటూ మరో నాయకుడు శపథాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్ని జరిగేవి కావని జనాలకు కూడా తెలుసు. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కార్యకర్త మాత్రం చేసిన శపథాన్ని నిలబెట్టుకోవడం కోసం ఏకంగా 15 ఏళ్ల పాటు చెప్పులు లేకుండా తిరిగాడు.
వివరాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2003లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాత తిరిగి విజయం సాధించింది. 2003లో మధ్యప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకు గాను కాంగ్రెస్ కేవలం 38 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అంత ఘోరంగా ఓటమి పాలయ్యంది. ఆ ఫలితాలకు బాధ్యత వహిస్తూ అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయనని, దశాబ్దం పాటు రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోనని అన్నారు. ఈ క్రమంలోనే దుర్గా లాల్ కిరార్ అనే కాంగ్రెస్ కార్యకర్త కూడా రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు చెప్పులు వేసుకోనని శపథం చేశారు. దాని ప్రకారం ఆయన ఈ 15 ఏళ్లు చెప్పులు లేకుండానే తిరిగారు.
ఎట్టకేలకు ఈ ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. కమల్ నాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో దుర్గాలాల్ తన 15 ఏళ్ల శపథానికి స్వస్తి పలికారు. బుధవారం కమల్‌నాథ్, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో దుర్గా లాల్ బూట్లు వేసుకున్నారు. ఈ విషయం గురించి కమల్ నాథ్ తన ట్విటర్‌లో ‘కాంగ్రెస్ కోసం రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించిన ఇలాంటి కార్యకర్తలందరికి సాల్యూట్ చేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment