
కేజ్రీవాల్‌పై సిరా దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆదివారం ఓ యువతి ఇంకు చల్లి నిరసన తెలిపింది. ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం విజయవంతం కావడంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తుండగా, వేదికకు దగ్గరగా వెళ్లిన భావన అరోరా(26) ఆయనకు కొన్ని పేపర్లు చూపింది. వెంటనే తన దగ్గరున్న సిరాను కేజ్రీపై చల్లి, ఆగ్రహం ప్రకటించింది. కేజ్రీపై, అక్కడున్న మరికొందరిపైన ఇంకు పడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భావన సీఎన్‌జీ స్కాం గురించి చెబుతోందని, ఆమె దగ్గరున్న కాగితాలు తీసుకుని వదిలేయాలని సీఎం పోలీసులకు చెప్పారు. భావన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విడిపోయిన ఆమ్ ఆద్మీ సేన పంజాబ్ విభాగంలో సభ్యురాలని సమాచారం.
పోలీసులు ఆమెపై ఐపీసీ 185, 353 సెక్షన్ల కింద కేసు పెట్టి, అరెస్ట్ చేసేందుకు మేజిస్ట్రేట్ అనుమతి కోరారు. కాగా, కేజ్రీపై ఇంకు దాడిలో బీజేపీ కుట్ర ఉందని, ఢిల్లీ పోలీసులూ భాగస్వాములని ఆప్ ఆరోపించింది. సరి-బేసి విధానం విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక, మనుషుల్ని చంపేందుకూ వెనకాడబోరని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు.
కేజ్రీవాల్ సూపర్: హజారే
రాలెగావ్‌సిద్ధి(మహారాష్ట్ర): ఒకప్పటి తన సహచరుడు కేజ్రీవాల్ ఆదర్శవాది, సచ్చరితుడని, రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉన్న నేత అని సామాజిక కార్యకర్త అన్నా హజారే పొగిడారు. కేజ్రీ ఢిల్లీ సీఎంగా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి కేజ్రీవాల్ ఒక్క తప్పటడుగు కూడా చేయలేదని తన స్వగ్రామమైన రాలెగావ్ సిద్ధిలో అన్నారు.