న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రామ మందిరం నిర్మాణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రామ మందిరం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది..? నిర్మాణం పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది..? ముఖ్యంగా మందిరం నిర్మాణం ఎలా ఉండనుంది..? అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ సాయంతో మందిర నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని ది రామ జన్మభూమి న్యాస్ భావిస్తోంది. సుప్రీం తీర్పుకు అనుగుణంగా ట్రస్ట్ ఏర్పాటయ్యాక వీహెచ్‌పీ.. రామ జన్మభూమి న్యాస్‌తో కలసి వీలైనంత వేగంగా నిర్మాణం ప్రారంభించే ఆలోచనలో ఉంది. వీహెచ్‌పీ అనేక ప్రణాళికలు సిద్ధం చేసినా.. అందులో అత్యధికుల మనోభావాలు, విశ్వాసాలకు అనుగుణంగా ఉండే నిర్మాణ బ్లూ ప్రింట్‌పైనే దృష్టి కేంద్రీకరించింది.
మొదటి అంతస్తుకు సర్వం సిద్ధం...
ఆలయ నిర్మాణాన్ని మొత్తం రెండంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం ఉండనుంది. గుడి ఎత్తు 128 అడుగులు, వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులతో నిర్మించనున్నారు. రెండంతస్తుల్లో మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ప్రతీ అంతస్తులో 106 స్తంభాలుంటాయి. ఏళ్లుగా గుడి నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ద్వారాలను శిల్పులు చెక్కుతున్నారు. ఆలయ పునాదిలో ఎక్కడా స్టీల్ వినియోగం లేకుండా చేపట్టనున్నారు. మొత్తం ఆలయ నిర్మాణానికి 1.75 లక్షల ఘనపు అడుగుల ఇసుకరాతి అవసరమవుతుందని భావిస్తున్నారు. ఆలయానికి సింగ్ ద్వార్, నృత్య మండపం, రంగ మండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. మొత్తం ఆలయ నిర్మాణానికి తక్కువలో తక్కువగా నాలుగేళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. ‘ఇంత సమయంలోనే నిర్మాణం పూర్తవుతుందని నేను హామీ ఇవ్వలేను. కానీ న్యాయ సంబంధిత పనులన్నీ పూర్తవగానే నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా’అని అంతర్జాతీయ వీహెచ్‌పీ(ఐవీహెచ్‌పీ) అధ్యక్షుడు అలోక్‌కుమార్ వెల్లడించారు.
అయోధ్య: రామ మందిరం నిర్మాణానికి కనిష్టంగా నాలుగేళ్లు!
Published Mon, Nov 11 2019 11:39 AM | Last Updated on Mon, Nov 11 2019 11:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment