మోదీ కేబినెట్‌లో వివాదాల ఎంపీ
మోదీ కేబినెట్‌లో వివాదాల ఎంపీ
Published Sun, Sep 3 2017 12:29 PM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM
సాక్షి, బెంగళూర్: మోదీ కొత్త పరివార్‌లో ఇలా కొలువు దీరిందో లేదో అప్పుడు అందులోని మంత్రుల పనితీరుపై వారి వారి సామార్థ్యాల ఆధారంగా లెక్కలు కట్టేస్తున్నారు. అదే సమయంలో వారిపై ఉన్న వివాదాలను కూడా కొందరు వెలుగులోకి తెచ్చేస్తున్నారు.
కర్ణాటకకు చెందిన అనంతకుమార్ హెగ్డే ప్రస్తుతం కేంద్ర మంత్రి(సహాయ)గా పదవీ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఓ వైద్యుడి పై దాడిచేసిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. త్వైకాండో స్పెషలిస్ట్ అయిన హెగ్డే వైద్యుడి పీకపట్టుకుని పలు మార్లు ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. పక్కనే ఉన్న సిబ్బంది అడ్డుకునేందుకు యత్నించగా, వారిని హెగ్డే అనుచరులు పక్కకు లాగేయటం వీడియోలో ఉంది. తీవ్ర గాయాలపాలైన వైద్యుడు తర్వాత మీడియాకు దాడి ఘటనను వివరించారు కూడా.
సిర్సి పట్టణంలోని టీఎస్‌ఎస్ ఆస్పత్రిలో ఈ యేడాది జనవరిలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన తల్లికి వైద్యం అందించటంలో నిర్లక్ష్యం వహించారనే వైద్యుడిపై ఇలా దాడిచేయగా, హేగ్డేపై కేసు కూడా నమోదు అయ్యింది. వీడియో పాతదే అయినా ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి కావటంతో వీడియో వైరల్ అవుతోంది. ఇక ఆయనకు వివాదాలు కొత్తేం కాదు. ఇస్తాం ఉన్నంత కాలం టెర్రరిజం ఉంటుందని, ఆ మతాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తేనే టెర్రరిజం అంతమవుతుందని మంటపుట్టించే వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్నారు కూడా.
28 ఏళ్ల వయసులోనే రాజకీయ దురంధరుడు మార్గరెట్ అల్వాను ఓడించిన అనంత హెగ్డే.. వరుసగా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
Advertisement