
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, అందుకే తాము అధికారంలోకి వచ్చామని కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కేంద్రాన్ని నిలదీశారు. సదరు మంత్రిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అలా చేస్తేనే తాము సభను జరగనిస్తామని, సభలో కూర్చుంటామని స్పష్టం చేశారు. అటు లోక్‌సభతోపాటు రాజ్యసభ కూడా ఇదే విషయం పెద్ద ధుమారంగా మారింది. త్వరలోనే రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్) అనే పదాన్ని తొలగిస్తామని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చిందని అనంతకుమార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
అసలు రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తికి సభలో కూర్చునే అర్హతే లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆజాద్ అన్నారు. ఇక రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడి పోడియం చుట్టూ చేరిన సభ్యులు ఇది ముమ్మాటికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు జరిగిన అవమానం అని నినాదాలు చేశారు. ఇలాంటి వాటిని మరోసారి జరగనివ్వకూడదని వెంటనే దీనిపై కేంద్రం స్పందించి కేంద్రమంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, కేంద్రం మాత్రం ఈ వివాదం నుంచి పక్కకు జరిగింది. అనంతకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని ప్రభుత్వానికి ఆయన మాటలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కేంద్రమంత్రి విజయ్ గోయెల్ రాజ్యసభలోలో మాట్లాడుతూ ప్రభుత్వానికి అనంతకుమార్ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. మరోపక్క, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ హెగ్డే వ్యాఖ్యలకు ప్రభుత్వానికి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేశామని, సమావేశాలు మరో ఐదు రోజులు మాత్రమే ఉన్నాయని, తాను ప్రతిపక్షం ఈ విషయం అర్ధం చేసుకొని సభలోకి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment