అఖిలపక్షంలో కుదరని ఏకాభిప్రాయం
సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్షాల పట్టు
న్యూఢిల్లీ: వివాదాస్పద బీమా బిల్లుపై సందిగ్ధం నెలకొంది. సోమవారం ఇది రాజ్యసభలో చర్చకు రావాల్సి ఉన్నప్పటికీ.. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని 9 విపక్షాలు చైర్మన్‌కు నోటీసిచ్చాయి. వెంటనే ప్రతిపక్షాలతో కేంద్రం చర్చలు జరిపినప్పటికీ అవి ఫలించలేదు. దీంతో ప్రస్తుతానికి బిల్లు మూలన పడినట్లే కనిపిస్తోంది. ప్రధాని మోడీ చేపడుతున్న ఆర్థిక సంస్కరణల్లో భాగంగా బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) పరిమితిని ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ప్రభుత్వానికి కేవలం 68 మంది బలమే ఉంది. దీంతో బిల్లు గట్టెక్కాలంటే కాంగ్రెస్, ఇతర పక్షాల మద్దతు తప్పనిసరి.
బిల్లులోని కొన్ని అంశాలపై ఆయా పార్టీల నేతలు అభ్యంతరాలు తెలపడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సోమవారమే వారితో భేటీ అయ్యారు.ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన బిల్లులోని అంశాలే తాజా బిల్లులోనూ ఉన్నాయని, పెద్దగా మార్పుల్లేవన్నారు. అయినా విపక్ష నేతలు వినిపించుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ఈ కీలక బిల్లు విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇస్తే వాటిని కూడా పరిశీలించి.. సభలో చర్చకు పెడతామని కేంద్రం ఇప్పటికే విపక్షాలకు స్పష్టం చేసింది. బిల్లును గత ప్రభుత్వ హయాంలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని, అప్పుడే దాన్ని ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి అప్పగించారని వెంకయ్యనాయుడుతెలిపారు. ఆ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని మళ్లీ బిల్లును తీసుకొచ్చామని మీడియాకు చెప్పారు. మరో రెండు రోజుల్లో మళ్లీ భేటీ కావాలని నిర్ణయించామని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు.
సిండికేట్ బ్యాంక్ సీఎండీ సస్పెన్షన్
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన సిండికేట్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్(సీఎండీ) ఎస్‌కే జైన్‌ను ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. భూషణ్ స్టీల్ కంపెనీ రుణపరిమితిని పెంచేందుకు రూ. 50 లక్షలు లంచం తీసుకున్నాడంటూ జైన్‌ను సీబీఐ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ అందించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా జైన్‌ను విధుల్లోంచి తొలగించామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి జీఎస్ సంధూ ప్రకటించారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన సిండికేట్ బ్యాంక్‌కు గత ఏడాది జూలైలో జైన్ సీఎండీగా నియమితులయ్యారు. జైన్‌తో పాటు మరో ఏడుగురిని ఆదివారం అదుపులోకి తీసుకున్న సీబీఐ.. మరో నాలుగురోజులపాటు వారిని విచారించనుంది. సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తుండటం విశేషం. భూషణ్ స్టీల్ కంపెనీ, ప్రకాశ్ ఇండస్ట్రీస్‌కు చెందిన రూ. 100 కోట్ల రుణాన్ని నిరర్ధక ఆస్తులుగా ప్రకటించడాన్ని అడ్డుకున్నారన్న ఆరోపణలు జైన్‌పై ఉన్నాయని సీబీఐ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
‘బీమా’పై చర్చలు విఫలం
Published Tue, Aug 5 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement