సాక్షి, ముంబై : ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్‌లోనూ తన ప్రతాపాన్ని వేగంగా చూపుతోంది. కరోనా కారణంగా దేశంలో ఇప్పటికే ఇద్దరు బాధితులు మృతి చెందగా.. తాజాగా మూడో మరణం నమోదైంది. వైరస్ కారణంగా మహారాష్ట్ర ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి (64) మంగళవారం కన్నుమూశారు. అతని మరణాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. మహారాష్ట్రలో ఇదే తొలికారణం కాగా ఢిల్లీ, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. మహారాష్ట్రలో ఇప్పటికే 38 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైంది కూడా ఇక్కడే. (కరోనా ఎఫెక్ట్ : వణుకుతున్న మహారాష్ట్ర)
బాధితుడి మృతితో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులు అప్రమత్తం చేశారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కాగా దేశంలో సోమవారానికి ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 114కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలపగా.. ఆ సంఖ్య మంగళవారం నాటికి 126కి చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌లో ప్రవేశించడంపై మార్చి 31 వరకూ నిషేధం విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment