సాక్షి, బెంగళూరు : రామనగర జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్‌లో ఉన్నామని గుండెలమీద చేయివేసుకుని ధైర్యంగా ఉన్న రామనగర ప్రజలు ఇప్పుడు గజగజ వణికిపోతున్నారు. రామనగర లోని జైలులోని ఐదు బ్యారక్‌లలో 25 మంది చొప్పున రిమాండ్ ఖైదీలను ఉంచారు. వారందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో గురువారం రాత్రి సమయానికి 5 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో తోటి ఖైదీలకూ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వారితోపాటు సన్నిహితంగా మెలిగిన పోలీసుల సిబ్బంది, వైద్య సిబ్బంది,జైలు సిబ్బందికీ కరోనా వైరస్ వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు.
జైలు సిబ్బంది ధర్నా
రిమాండ్ ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందంటూ ఆరోపిస్తూ జైలు సిబ్బంది గురువారం అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. నిందితులను జైలుకు తీసుకువచ్చేటప్పుడు మాస్కు, స్యానిటైజర్ లాంటివి వాడకపోవడం, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా తమ ప్రాణాలతో చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా జైలు అధికారులు తక్షణం నగరసభ అధికారులకు ఫోన్ చేసి మాస్కులు,స్యానిటైజర్‌లు తెప్పించుకున్నారు. పాదరాయనపుర నిందితులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో కలెక్టర్ అర్చన జిల్లా, తాలూకాస్థాయి అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
నిందితులను హజ్ భవనానికి తరలింపు
రామనగర జైలులో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో పాదరాయనపుర దాడులకు సంబంధించిన నిందితులు 116 మందిని శుక్రవారం 7 కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లో బెంగళూరులోని హజ్ భవనానికి తరలించారు. వీరితోపాటు జైలులో ఉన్న 17 మంది ఖైదీలను కూడా హజ్ భవనానికి తరలించారు.అందరికీ ముందు జాగ్రత్త చర్యగా స్క్రీనింగ్ టెస్టులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment