తిరువనంతపురం : భారత్‌లో జనవరి 31న తొలి కరోనా కేసు బయటపడిన కేరళలో తాజాగా ప్రాణాంతక వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. జనవరిలో వుహాన్ నుంచి వచ్చిన కేరళ విద్యార్థినికి కరోనా సోకగా, కొద్దిరోజులకు మరో రెండు కేసులు వెల్లడయ్యాయి. ఈ మూడు కేసులు వెలుగుచూసిన తర్వాత నెలరోజుల వరకూ ఏ ఒక్క కేసు నమోదవకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఫిబ్రవరి మధ్యలో ఈ ముగ్గురూ కోలుకుని ఆస్పత్రి నుంచి కూడా డిశ్చార్జి అయ్యారు. ఇక మరో రెండు నెలల తర్వాత ఒక్కసారిగా విజృంభించిన మహమ్మారితో 370కిపైగా కేసులు కేరళలో నమోదయ్యాయి. విస్తృతంగా కరోనా వ్యాప్తి చెందిన దశ నుంచి తాజాగా ఈ మహమ్మారి నెమ్మదించడం మొదలైందని రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ పేర్కొన్నారు.
కేరళలో మహమ్మారి వ్యాపించిన తీరు చూస్తే..జనవరిలో మూడు కేసులు వెలుగుచూసిన తర్వాత వెనకపట్టుపట్టిన మహమ్మారి మార్చి 8 నుంచి రెండో విడత ఇన్ఫెక్షన్లు కేరళను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇటలీ నుంచి ఓ వ్యక్తి కుటుంబానికి చెందిన ముగ్గురికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా వెల్లడైంది. ఇక విదేశాల్లో నివసించే విద్యార్ధులు, ఉద్యోగులు భిన్న వర్గాలకు చెందిన వారు కేరళకు వెనుతిరగడంతో రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. మార్చి 10న 17 కరోనా కేసులు నమోదు కాగా మార్చి 21కి అవి 50 కేసులకు మార్చి 21కి వందకి పైగా కేసులకు ఎగబాకాయి. ఏప్రిల్ 4 నాటికి కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 దాటింది. ఏప్రిల్ 12న కేరళలో పాజిటివ్ కేసుల సంఖ్య 375 కాగా అక్కడి నుంచి కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కరోనా బారినపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు 194 కాగా 1.16 లక్షల మంది అబ్జర్వేషన్‌లో ఉన్నారు. 179 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
చదవండి : వుహాన్ వదిలి వెళ్లను.. కేరళ యువతి
కేరళలో ఈ మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం, చురుకైన కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం వైరస్ వ్యాప్తికి బ్రేక్ పడిందన్న సంకేతాలు పంపుతోంది. విదేశాల నుంచి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులే వైరస్ బారిన పడగా, ఇక్కడ సమూహ వ్యాప్తి లేదని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన కాసర్‌గాడ్ జిల్లాలోనూ వైరస్ సమూహ వ్యాప్తి దశకు చేరకపోవడం ఊరట ఇస్తోంది. గణాంకాలు ఆశాజనకంగా ఉన్నా కరోనాపై యుద్ధం ఇంకా మిగిలేఉందని ఆరోగ్య మంత్రి కేకే శైలజ అన్నారు. తాము తీసుకున్న ముందస్తు చర్యలు కరోనా కట్టడికి ఉపకరించాయని, ఒక్క రోగి మిగిలినా పెద్దసంఖ్యలో ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున తాము ఇప్పటికీ జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉన్నా పొరుగు రాష్ట్రాల్లో కేసులు పెరగడం ఆందోళనకరమేనని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment