‘ఈ సమయంలో బెయిలివ్వలేం..’
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ వర్గానికే అన్నాడీఎంకే పార్టీ గుర్తు దక్కేలా చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయిన మధ్యవర్తి సుఖేశ్ చంద్రశేఖర్‌కు బెయిలిచ్చేందుకు మరోసారి ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టిపారేస్తూ ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిలిచ్చేందుకు ఇది సరైన సమయం కాదని స్పష్టం చేసింది.
సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశం ఉందంటూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూనమ్ చౌదరీ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల క్రైం విభాగం దినకరన్, చంద్రశేఖర్ కు మధ్య ఫోన్‌లో జరిగిన సంభాషణల సీడీని పరిశీలిస్తున్నారని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చేశారు. గత శనివారం కూడా ఆయనకు బెయిలిచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. మరోపక్క, నేడే విచారించాల్సిన దినకరన్ ఆయన కీలక అనుచరుడు మల్లిఖార్జున బెయిల్ పిటిషన్లను 26కు జరిపింది. వారి తరుపు న్యాయవాది కోరడంతో నేటి విచారణను వాయిదా వేసింది.