sukesh chandrashekar
-
జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మరోసారి ఈడీ సమన్లు
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. రూ. 200కోట్ల మనీలాండరింగ్ కేసులో సుమారు రెండేళ్ల క్రితం ఆమెకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ నిందితుడిగా ఉన్న రూ.200కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆమె విచారణకు కూడా హాజరైంది. అయితే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జైల్లో ఉన్న సుకేశ్ పలుమార్లు ప్రేమ సందేశాలు పంపాడు. దీంతో ఆమె పలుమార్లు కోర్టును కూడా ఆశ్రయించింది.అయితే, తాజాగా ఈ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు పంపింది. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో ఈడీ పలుమార్లు ఆమెను ఇప్పటికే విచారించింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.సుకేశ్ నుంచి జాక్వెలిన్ చాలా ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కేసులో ఆమెను నిందితురాలిగా గుర్తించింది. అయితే, సుకేశ్ తన జీవితాన్ని నాశనం చేశాడని జాక్వెలిన్ కోర్టు ముందు గతంలో వాపోయింది. అతని వల్ల సినిమా ఛాన్స్‌లు కూడా పోయాయని ఆమె తెలిపింది. తన కెరీర్‌తో సుకేశ్ ఆడుకున్నాడని కోర్టు ఎదుట జాక్వెలిన్ వాపోయింది. కొన్నేళ్లుగా సుకేశ్ చంద్రశేఖర్ తీహార్ జైల్లో ఉన్నాడు. -
జైలులో నన్ను చంపాలని ప్లాన్ చేశారు.. సుఖేష్ సంచలన లేఖ
సాక్షి, ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనాకు లేఖ రాశారు. ఈ లేఖలో తనకి జైలులో రక్షణ లేదని.. తనని మరో జైలుకు బదిలీ చేయాలని పేర్కొన్నాడు. దీంతో, సుఖేష్ లేఖ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. మండోలి జైలు నుంచి చంద్రశేఖర్.. లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. ఈ లేఖలో జూలై 1న తన అడ్వకేట్ అనంత్ మాలిక్ కు బెదిరింపు కాల్ వచ్చిందని పేర్కొన్నారు. ఇక, లేఖలో ‘నా లేఖను అత్యవసర నోటీసుగా పరిగణించాలని లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరుతున్నా. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై నేను చేసిన ఫిర్యాదులను, స్టేట్మెంట్లను వెనక్కి తీసుకోవాలి.. లేదంటే జైల్లో ఉన్న నన్ను ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారు. జైలు నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. కాల్ చేసిన వ్యక్తి కేజ్రీవాల్‌తో పాటు సత్యేంద్రజైన్ ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రస్తావించారు. జూన్ 23న మా తల్లికి కూడా ఇటువంటి బెదిరింపు కాల్ వచ్చింది. ఢిల్లీ మాజీమంత్రి సత్యేంద్రజైన్ సతీమణి సైతం మా అమ్మకు ఫోన్ చేసింది. నేను చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని బెదిరించింది. నన్ను జైల్ అధికారులు సైతం ఎప్పటికప్పుడు బెదిరిస్తున్నారు. మండోలి జైలులో నాకు భద్రత లేదు. దయచేసి నన్ను ఢిల్లీ జైలు నుంచి వేరే జైలుకు బదిలీ చేయండి. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆధీనంలో లేని మరో రాష్ట్రంలోని జైలుకు నన్ను పంపించండి అని వేడుకుంటున్నా అంటూ లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఇది కూడా చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్ -
మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్.. కవిత, కేజ్రీవాల్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షెల్ కంపెనీల నుంచి మారిషస్‌లోని గ్రీన్ హస్క్ ఇండస్ట్రీస్‌కు రూ.80 కోట్లు బదిలీ చేసినట్లు ఓ మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం కార్యాలయ నివాసం ఫర్నీచర్ నిమిత్తం ఈ సొమ్ము మూడు విడతలుగా బదిలీ చేశానని పేర్కొన్నారు. తనపై వస్తున్న కథనాలకు సంబంధించి కొన్ని వివరణలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదేశాలతోనే జైలు అధికారులు తనని వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం సుకేశ్ తరఫు న్యాయవాది మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. కేజ్రీవాల్ ఎంత ప్రయత్నించినా తాను వెనక్కి తగ్గేది లేదని, ఫర్నీచర్‌కు సంబంధించి అన్ని బిల్లులు ఈడీ, సీబీఐలకు అందజేస్తానని స్పష్టంచేశారు. కేజ్రీవాల్ సూచన మేరకు కల్వకుంట్ల కవిత షెల్ కంపెనీ ఖాతా నుంచి మారిషస్‌లోని మంత్రి కైలాశ్ గెహ్లోత్ బంధువుల ఖాతాకు రూ.80 కోట్లు (రూ.25 కోట్లు+ రూ.25 కోట్లు + రూ.30 కోట్లు) బదిలీ చేసినట్లు చెప్పారు. ఆ సొమ్ము యూఎస్ డాలర్టెట్హెర్ (యూఎస్డీటీ), క్రిప్టో కరెన్సీల్లోకి మార్చి అబుదాబికి పంపినట్లు సుకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఫేస్‌టైమ్‌లో జరిపిన చాట్ల స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయన్నారు. ఫోన్ ట్యాంపరింగ్ చేస్తున్నానంటూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన తల్లికి తప్పించి మరో కాల్ చేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని, అది తప్పయితే, కేజ్రీవాల్ బహిరంగ క్షమాపణలు చెబుతారా అని లేఖలో ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఎలా అవినీతికి పాల్పడ్డారో, ఏ స్థాయికి దిగజారగలరో తెలుసుకోవడానికి మరో ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండాలన్నారు. జైలు అధికారులందరూ కేజ్రీవాల్ రాకకోసం ఎదురుచూస్తున్నారని సుకేశ్ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: ‘కమలం’ కార్యాచరణ మారాలి సారూ! -
‘ఈ సమయంలో బెయిలివ్వలేం..’
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్ వర్గానికే అన్నాడీఎంకే పార్టీ గుర్తు దక్కేలా చేసేందుకు ఎన్నికల కమిషన్‌కు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయిన మధ్యవర్తి సుఖేశ్ చంద్రశేఖర్‌కు బెయిలిచ్చేందుకు మరోసారి ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టిపారేస్తూ ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో బెయిలిచ్చేందుకు ఇది సరైన సమయం కాదని స్పష్టం చేసింది. సాక్ష్యాలను తారుమారు చేయడానికి అవకాశం ఉందంటూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూనమ్ చౌదరీ అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల క్రైం విభాగం దినకరన్, చంద్రశేఖర్ కు మధ్య ఫోన్లో జరిగిన సంభాషణల సీడీని పరిశీలిస్తున్నారని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చేశారు. గత శనివారం కూడా ఆయనకు బెయిలిచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. మరోపక్క, నేడే విచారించాల్సిన దినకరన్ ఆయన కీలక అనుచరుడు మల్లిఖార్జున బెయిల్ పిటిషన్లను 26కు జరిపింది. వారి తరుపు న్యాయవాది కోరడంతో నేటి విచారణను వాయిదా వేసింది.