
లక్నో : 2005 అయోధ్య ఉగ్రదాడి కేసులో నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్ధానం బుధవారం వారికి జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో ఓ వ్యక్తిని నిర్ధోషిగా వెల్లడించింది. 2005, జులై 5న ఆరుగురు సాయుధ ఉగ్రవాదులు భక్తుల మాదిరి జీప్‌లో చేరుకుని అయోధ్యలోని వివాదాస్పద రామ మందిర ప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించారు. భద్రత సిబ్బందిని నిలువరించి లోపలికి వెళ్లేందుకు బారికేడ్ల వద్ద తాము వచ్చిన వాహనంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
ఇదే సమయంలో వాహనంలో ఉన్న నిందితులు గ్రనేడ్లు విసురుతూ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ వివాదాస్పద స్ధలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా దళాలు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రతిఘటించారు. 90 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ అనంతరం వివాదాస్పద స్ధలానికి 70 మీటర్ల దూరంలో సీతా రసోయి ఆలయం వద్ద మిగిలిన ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ దాడిలో నలుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, ఓ మహిళ సహా ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయి. కాగా ఈ కేసులో నిందితులందరికీ జీవిత ఖైదు విధిస్తూ ప్రయాగరాజ్ ప్రత్యేక న్యాయస్ధానం స్పెషల్ జడ్జి దినేష్ చంద్ర తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment