భరణం ఎందుకు.. ఉద్యోగం చేసుకో!
చదువుకున్న భార్యకు కోర్టు సూచన
కావాలంటే భర్త సాయం తీసుకోవచ్చని సలహా
మాజీ భర్త మీద భారంగా మారొద్దని హితవు
న్యూఢిల్లీ
''శుభ్రంగా చదువుకున్నావు.. విడాకులు తీసుకున్న తర్వాత భర్త మీద, అతడిచ్చే భరణం మీద ఆధారపడటం ఎందుకు, హాయిగా ఉద్యోగం చేసుకో. అంతేతప్ప మాజీ భర్తకు భారంగా మారొద్దు'' అని ఓ మహిళకు కోర్టు సలహా ఇచ్చింది. దాంతో ఎగిరి గంతేసిన సదరు భర్త.. ఆమెకు ఉద్యోగం వెతికి పెట్టడానికి సాయం చేస్తానని, ఆలోపు ఏడాది వరకు భరణం కూడా ఇస్తానని అంగీకరించాడు. దీంతో, ఆమకు నెలకు రూ. 12వేల చొప్పున భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తన భర్త కంటే తానే ఎక్కువ చదువుకున్నట్లు భార్య కోర్టులో అంగీకరించింది. తనకు సంపాదించే సామర్థ్యం కూడా ఉందని తెలిపింది. అలాంటప్పుడు ఆమె ఏపీ పనిచేయకుండా కూర్చుని భర్త మీద ఆర్థికభారం మోపేందుకు వీల్లేదని జిల్లా జడ్జి రేఖారాణి అన్నారు. ఉద్యోగం వెతుక్కోడానికి భర్త సాయం కావాలంటే అతడికి ఎస్ఎంఎస్ లేదా ఈ మెయిల్ పంపుకోవచ్చని కోర్టు తెలిపింది.
అయితే.. తాను బాగా చదువుకున్నా ఎప్పుడూ ఉద్యోగం చేయడం కాదు కదా.. కనీసం ఒంటరిగా ఎక్కడికీ ప్రయాణం కూడా చేయలేదని సదరు భార్య వాదించింది. అయితే ఆమె ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ అని, తాను ఎంత చెప్పినా ఎప్పుడూ ఉద్యోగం చేయలేదని ఆ భర్త వాపోయాడు. ఉద్యోగాలు వెతుక్కోడానికి తనతో పాటు అతడు కూడా రావాలని భార్య కోరగా.. అసలు ఈ వాదన అసంబద్ధమని కోర్టు కొట్టేసింది. కోర్టుకు ఒంటరిగా రాగలిగినప్పుడు ఉద్యోగాలు వెతుక్కోడానికి ఎందుకు ఒంటరిగా వెళ్లలేదని జడ్జి రేఖారాణి ప్రశ్నించారు. చివరకు ఆమెకు ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ. 12 వేల చొప్పున చెల్లించాలని, వీలైనంత త్వరగా ఆమెతో ఉద్యోగం చేయించేలా చూడాలని జడ్జి తెలిపారు.