ఢిల్లీ అల్లర్ల నాటి దృశ్యాలు (కర్టెసీ: న్యూస్18)
న్యూఢిల్లీ: ‘‘ఏడ్చీ ఏడ్చీ నా కన్నీళ్లు ఇంకిపోయాయి. నా తండ్రి గౌరవప్రదమైన అంత్యక్రియలకు కూడా నోచుకోలేదన్న విషయం నమ్మలేకపోతున్నా. నా బాధ ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పటికైనా మా నాన్న కాలును ఇస్తే ఖననం చేస్తాను. అది మీకు ఎముక మాత్రమే కావొచ్చు. కానీ నాకు అది ఎంతో ముఖ్యమైనది’’అంటూ గుల్షన్ అనే మహిళ కన్నీటిపర్యంతమయ్యారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లలో సజీవ దహనం గావించబడినట్లుగా భావిస్తున్న అన్వర్ కసార్ కుమార్తె ఆమె. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 53 మంది మరణించిన విషయం విదితమే. ఆనాటి అల్లర్లలో గుర్తు తెలియని దుండగులు శివ్ విహార్‌లో నివసించే అన్వర్‌పై రెండుసార్లు కాల్పులు జరిపి.. అనంతరం అతడి ఇంటికి నిప్పంటించి.. అతడిని మంటల్లో పడేశారని గుల్షన్ తెలిపారు. (లాక్‌డౌన్ : షాహీన్ బాగ్ ఆందోళనకు తెర)
ఈ విషయం గురించి తెలుసుకున్న తాము ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చామని.. అప్పటికి తన తండ్రి ఒక కాలు తప్ప మరే ఇతర ఆనవాళ్లు మిగల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పటికే పోలీసులు మృతదేహ విడిభాగాలు తీసుకువెళ్లగా.. ఆ కాలు తన తండ్రిదేనని.. దానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశమివ్వాలని గుల్షన్ కోరారు. అనేక పరిణామాల అనంతరం డీఎన్‌ఏ టెస్టు నిర్వహించిన తర్వాత ఆ కాలు అన్వర్‌దేనని నిర్ధారణ అయ్యింది. ఈ విషయం గురించి గుల్షన్ మాట్లాడుతూ..‘‘ అది నా తండ్రి ఆనవాళేనని నాకు తెలుసు. వైద్య పరీక్షలో కూడా అదే తేలింది. అది కేవలం ఎముక కాదు. నా తండ్రి వదిలిన ఆఖరి జ్ఞాపకం. అయితే ఎన్నిసార్లు పోలీస్ స్టేషను చుట్టూ తిరిగినా దానిని నాకు అప్పగించడం లేదు. నా తండ్రి గౌరవప్రదమైన చావుకు కూడా నోచుకోలేదు’’అని భావోద్వేగానికి లోనయ్యారు. ( పౌరసత్వ సవరణ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)
కాగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో శవాలను మార్చురీ నుంచి తరలించేందుకు పోలీసులు అనుమతించడం లేదని గుల్షన్ లాయర్ తెలిపారు. గుల్షన్ ఇచ్చిన డీఎన్‌ఏ నమూనాల ఆధారంగా అది ఆమె తండ్రి మృతదేహమే అని తేలినప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. తనకు ఢిల్లీ వెళ్లేందుకు లేదా అన్వర్ శరీర భాగాలను ఉత్తర ప్రదేశ్‌కు పంపేందుకు అనుమతి ఇవ్వాలని గుల్షన్ కోరుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment