
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నా కోవిడ్-19 మరణాల రేటు తగ్గుదల ఊరట ఇస్తోంది. భారత్‌లో మహమ్మారి బారిన పడి మరణించే వారి సంఖ్య 3.13 శాతం నుంచి 3.01 శాతానికి తగ్గడం సానుకూల పరిణామమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కేసులు రెట్టింపయ్యేందుకు ఇప్పుడు 13 రోజుల సమయం పడుతోందని ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్ అమలుచేయకుంటే ఇప్పటికి 20 లక్షల కరోనా కేసులు నమోదై 54,000 మంది మరణించేవారని తెలిపింది. గత నాలుగు రోజులుగా రోజుకు లక్షకు పైగా కోవిడ్-19 పరీక్షలు జరుగుతున్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.18 లక్షలకు ఎగబాకింది. కోవిడ్-19 హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలోనే అత్యధికంగా 41,642 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో 571 తాజా కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment