ఆవు వెంటపడడంతో పరుగులుతీస్తున్న మంత్రి
సాక్షి, చెన్నై : కుంభకోణం ఆలయంలో శనివారం మంత్రి దురైకన్నును ఓ ఆవు పరుగులు తీయించింది. వర్షం కోసం శనివారం అన్నాడీఎంకే ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో యాగం నిర్వహించారు. కుంభకోణం కుంభేశ్వరన్ ఆలయంలో శనివారం యాగం జరిగింది. ఇందులో వ్యవసాయశాఖా మంత్రి దురైకన్ను, అన్నాడీఎంకే నిర్వాహకులు పాల్గొన్నారు. యాగం జరుగుతున్న సమయంలో ధ్వజస్తంభం సమీపానికి ఒక ఆవు, దూడను తీసుకువచ్చి గోపూజ జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వంద మందికి పైగా గుమికూడారు. ఈ గుంపును చూడగానే ఆవు బెదిరిపోయింది. మంత్రి దురైకన్ను ఆవుకు నమస్కరించి గోపూజ జరిపేందుకు నిర్ణయించారు. ఆయన ఆవు వద్దకు వెళుతుండగా ఆయన వెంట అన్నాడీఎంకే కార్యకర్తలు వెళ్లారు. గమనించి ఆవు పరుగులు తీసింది.
తనను ఢీకొనేలా వస్తున్న ఆవును చూసి మంత్రి దురైకన్ను భయంతో పరుగులు తీశారు. ఆ ఆవును తీసుకువచ్చిన వ్యక్తి తాడును పట్టుకుని ఆవు వెంట పరుగెత్తాడు. అయినప్పటికీ ఆవు తాడు వదిలించుకుని పరుగుతీసింది. ఇందులో అన్నాడీఎంకే కార్యకర్త తిరువిడైమరుదూర్ విఘ్నేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కుంభకోణం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. తర్వాత జరిగిన యాగంలో కూడా మంత్రి భయంతోనే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment