‘మన్నవరం’ కొనసాగించే ఉద్దేశం లేదు
కేంద్రమంత్రి గోయల్‌తో సమావేశం అనంతరం సీపీఐ నారాయణ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: మన్నవరం విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టును కొనసాగించబోమని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ పరోక్షంగా చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు నారాయణ తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో నెలకొన్న అపోహలను తొలగించాలని కోరుతూ నారాయణ, ఆ పార్టీ ఎంపీ డి.రాజా సోమవారం ఢిల్లీలో గోయల్‌తో సమావేశమయ్యారు.
మన్నవరం పూర్తయితే ప్రత్యక్షంగా 7 వేల మందికి పరోక్షంగా 30 వేల మంది ఉపాధి లభిస్తుందని గోయల్‌కు వివరించారు. దీనిపై ప్రస్తుత పరిస్థితి ఏంటని, ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందా? అని వారు మంత్రిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మన్నవరం ప్రాజెక్టు తరలిపోయేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రితో చర్చించిన తరువాత.. ఆయన మాటలు చూస్తే ప్రాజెక్టును ప్రారంభించే ఉద్ధేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు.