ఆపిల్ వాచ్, ఖరీదైన పెన్, పార్టీ నుంచి సస్పెన్షన్
న్యూఢిల్లీ : వామపక్ష భావ జాలం పాటించే సీపీఎం ఆడంబరాలకు దూరంగా ఉంటుంది. అయితే పార్టీ సిద్ధాంతాలను మరిచి లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న ఓ ఎంపీపై సీపీఎం పార్టీ వేటు పడింది. పార్లమెంట్ సభ్యుడు రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి మూడు నెలల పాటు బహిష్కరించింది.
వామపక్ష భావజాలానికి విభిన్నంగా ఆయన జీవనశైలి ఉందనే నెపంతో రితబ్రత బెనర్ పై బహిష్కరణ వేటు వేసింది. ఆయన ఎక్కువగా హై-టెక్, ఖరీదైన గాడ్జెట్లను వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నేడు(శుక్రవారం) బెంగాల్ లో జరిగిన సమావేశంలో బెనర్జీపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బెనర్జీపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపైనా విచారణకు ఆ పార్టీ ఆదేశించింది. రెండు నెలల్లో దీనిపై నివేదిక రానుంది. అప్పటివరకు ఆయనపై ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.
ఖరీదైన ఆపిల్ వాచ్, లగ్జరీ మోంట్ బ్లాంక్ పెన్ (రూ.15వేల పైన నుంచి రూ. 60వేల రూపాయల మధ్యలో రేటు) వాడి బెనర్జీ ఇరకాటంలో పడ్డారు. సాకర్ మ్యాచ్ చూస్తూ ఖరీదైన యాక్ససరీస్ ధరించిన బెనర్జీ ఫోటోలను సీపీఎం నేత సుమిత్ తాల్కుదార్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అప్పట్లో దుమారం చెలరేగింది.
అయితే బెనర్జీపై వచ్చిన ఫిర్యాదుతో పాటు ఆయనపై సస్పెన్షన్ వేటు అంశంపై మాట్లాడేందుకు బెంగాల్ సీనియర్ సీపీఎం నేత సుర్జ్యా కాంత మిశ్రా నిరాకరించారు. పార్టీలోని అంతర్గత అంశాలను బహిర్గతం చేయలేమని ఆయన తెలిపారు.