Ritabrata Banerjee
-
ఆశ్చర్యపరిచిన బెంగాల్ ట్విస్ట్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్‌ను విసిరినట్లయ్యింది. అసలు ఇంత తక్కువ టైంలో.. ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఆయన ఎలా తనవైపు తిప్పుకోగలిగాడని రాజకీయ వర్గాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి?.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది. అలాగే..తాజా రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువుగా నిలిచింది మాత్రం అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ద్ ఒపోజిషన్ (LoP) నియామకంపై వచ్చిన వివాదం. తృణమూల్‌లోని కొందరు ఎమ్మెల్యేలు తమ సంతకాలను ఫోర్జరీ చేసి సోభందేబ్ చటోపాధ్యాయ్‌ను ఎల్వోపీగా ప్రకటించారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రీతాబ్రత బెనర్జీ సహా ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ “అంతర్గత వ్యతిరేక కార్యకలాపాలు” పేరిట మమతా బెనర్జీ బహిష్కరించారు. దీంతో రీతాబ్రత నేతృత్వంలోని వర్గం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.రీతాబ్రత మాములోడేం కాదు.. రీతాబ్రత బెనర్జీ.. పుట్టింది 15 నవంబర్ 1979. చదువంతా కోల్‌కతాలోనే సాగింది. విద్యార్థి రాజకీయాల ద్వారా ప్రారంభమైన ఆయన ప్రయాణంలో ఎస్ఎఫ్ఐలో కీలక నాయకుడిగా ఎదిగి.. సీపీఎం యువజన విభాగంలో సుమారు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. 34 ఏళ్ల వయసులో సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం నుంచి సస్పెండ్ అయ్యి, తరువాత బహిష్కరణకు గురయ్యారు. అనంతరం.. తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి కీలక పాత్ర పోషించారు. తాజాగా ఉలుబేరియా పూర్వ (Uluberia Purba) నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై సుమారు 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ వెంటనే పార్టీ అంతర్గత వివాదాలు, అసంతృప్తి, ఫోర్జరీ సంతకాల ఆరోపణల వివాదం నేపథ్యంలో టీఎంసీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ లోపల తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహించడమే కాదు.. ప్రతిపక్ష నేతగా తనను తాను ప్రకటించుకుని, ఆ గుర్తింపు ఇవ్వాలంటూ స్పీకర్‌కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అసలు ‘టర్నింగ్ పాయింట్’ ఇదేబెంగాల్ రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. టీఎంసీలో చీలిక(తిరుగుబాటు) ఒక్కరోజులో జరిగినది కాదు. దీని వెనుక మూడు కీలక దశల్లో జరిగింది.. 1) ఎన్నికల తర్వాత అసంతృప్తి పెరుగుదల: తాజా ఎన్నికల తర్వాత పార్టీ లోపల నాయకత్వంపై అసంతృప్తి వేగంగా పెరిగింది. నిర్ణయాలు కేంద్రీకృతంగా (centralized) మమతా–అభిషేక్ బెనర్జీ ద్వయం చేతుల్లోనే ఉండటంపై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు.2) ‘సైడ్‌లైనింగ్’ భావన: పార్టీ టికెట్ దక్కినా, ప్రభుత్వ–పార్టీ నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యం లేదని అనేక మంది సీనియర్, మిడ్-లెవల్ ఎమ్మెల్యేలు భావించారు. బెంగాల్ రాజకీయ భాషలో దీనిని “অবহেলা” (అవహేళన) భావనగా పేర్కొంటారు.3) రీతాబ్రత ఎంట్రీ.. “అసంతృప్త వేదిక”గా మారడం: ఇక్కడే అసలు ట్విస్ట్. రీతాబ్రత బెనర్జీ కొత్త ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయనకు ముందే రాజకీయ అనుభవం ఉంది. రాజ్యసభలో టీఎంసీ, లెఫ్ట్ రెండింటిలో పని చేసిన నేపథ్యం ఉంది. దీనివల్ల ఆయనను “అనుభవజ్ఞుడైన అవుట్‌సైడర్”గా కొంతమంది నేతలు చూశారు.రీతాబ్రత రెబల్స్ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహించడంలో రాజకీయ వ్యూహమే కీలకంగా మారింది. ప్రత్యక్షంగా పార్టీకి వ్యతిరేకంగా కాకుండా “నిర్ణయాల పునర్వ్యవస్థీకరణ” అనే నినాదంతో ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలను ఒక చోటుకి చేర్చడంలో సక్సెస్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో.. ఫోర్జరీ సంతకాల ఆరోపణ తర్వాత ఏర్పడిన గందరగోళాన్ని ఆయన తన వైపు మలుచుకున్నాడు. తన సస్పెన్షన్‌తో “పార్టీ లోపల న్యాయం లేదు” అనే భావనను టీఎంసీ శ్రేణుల్లో బలపరిచగలిగారు. తద్వారా.. రాజకీయంగా హై-ప్రొఫైల్ కాకపోయినా, అతను లోపలే నెట్వర్క్ నిర్మించుకున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అసంతృప్త నేతలతో సంబంధాలు పెంచుకున్నారు. మరీ ముఖ్యంగా.. బెంగాల్ రాజకీయాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాలు మమత చేతిని ఎప్పుడో దాటేసి పూర్తిగా అభిషేక్ బెనర్జీ ప్రభావంలోకి వెళ్లాయని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ రీతాబ్రతకు అనుకూలంగా మారాయి.పరిశీలకులు గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల్లో జరిగిన తిరుగుబాట్లతో పోలుస్తున్నారు. అయితే అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉంది. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీల్లో సిద్ధాంత బలం ఉంది. కానీ, టీఎంసీలో అలాంటిది మచ్చుకైనా కనిపించదని విశ్లేషకుల మాట. అందుకే ఇక్కడ తిరుగుబాటు ఒక ఐడియాలజీపై కాకుండా, నాయకత్వ అసంతృప్తి, అధికార పంపకాలపై ఆధారపడి ఉందని భావిస్తున్నారు.ఇప్పటి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి రెండు పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకటి.. పార్టీలో తిరుగుబాటును నియంత్రించడం. రెండోది.. అధికార కేంద్రాన్ని తిరిగి స్థిరపరచడం. పార్టీలో ఉన్న అన్ని వర్గాలు విడిపోకుండా ఒకటిగా ఉండేలా చేయగల నాయకురాలిగా మమతా మళ్లీ తన సామర్థ్యాన్ని చూపించుకోగలగాలి..కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే.. మొదటిసారి ఎమ్మెల్యే నెగ్గిన ఉన్న నాయకుడు 60 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్‌లో లోపలి బలహీనతలను బయటపెట్టింది. అంతేకాదు.. తాము మమతా బెనర్జీ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని రీతాబ్రతా ప్రకటించడం ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ట్విస్ట్. దీంతో.. ఇది కేవలం నాయకత్వ సంక్షోభమా? లేదంటే పెద్ద రాజకీయ విభజనకు సంకేతమా? అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. -
రెండు ముక్కలైన దీదీ పార్టీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో 28 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) రెండు ముక్కలైంది. 58 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు మమతా బెనర్జీ పార్టీని చీల్చేశారు. అసెంబ్లీలో అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా అధికారికంగా గుర్తింపు పొందారు. బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. తమను టీఎంసీ శాసనసభాపక్షంగా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు తిరుగుబాటు వర్గం వెల్లడించింది. మరోవైపు ఇప్పటికీ మమతా బెనర్జీయే తమ నాయకురాలు అని రితబ్రత బెనర్జీ స్పష్టంచేశారు. తమ శాసనసభ బృందానికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించాలని, తమకు మార్గనిర్దేశం చేయాలని ఆమెను కోరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం తర్వాత దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ ప్రారంభమైన తిరుగుబాటు చివరకు పార్టీని చీల్చడం గమనార్హం. పార్టీ చరిత్రలో ఇలాంటి సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. అంతర్గత పోరు పట్ల వెంటనే అప్రమత్తమైన మమతా బెనర్జీ వర్గం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన అన్ని సంస్థాగత కమిటీలను, అనుబంధ సంఘాలను తక్షణమే రద్దు చేసింది. ఈ పరిణామాలు టీఎంసీ దుస్థితికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీదీ పార్టీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మూడింట రెండొంతుల ఎమ్మెల్యేల బలం తృణమూల్ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ బుధవారం తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ రతీంద్ర బోసుతో సమావేశమయ్యారు. తమ వర్గాన్ని అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా గుర్తించాలని కోరారు. మొత్తం 58 ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను స్పీకర్‌కు సమరి్పంచారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. అనర్హత వేటు పడకుండా ఉండాలంటే తిరుగుబాటు వర్గానికి కనీసం మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన 54 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే రితబ్రత వర్గంపై అనర్హత వేటు పడదు. అసెంబ్లీలో టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, రితబ్రతకు 58 మంది మద్దతు ప్రకటించడంతో ఆయన వర్గాన్ని శాసనసభాపక్షంగా స్పీకర్ గుర్తించారు. తగిన సంఖ్యా బలం ఉండడంతో అనర్హత వేటు తప్పినట్లే. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు సమర్ ముఖోపాధ్యాయ, అరూప్ రాయ్, రతిన్ ఘోస్, జావెద్ ఖాన్, ప్రసూన్ బెనర్జీ సైతం అసమ్మతి వర్గంలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మమతా బెనర్జీ పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రం బయట ఉన్న మరో ఇద్దరు శాసనసభ్యులు సైతం తమకే మద్దతు ఇస్తున్నారని, వారు త్వరలోనే తమ శిబిరంలో చేరుతారని రితబ్రత బెనర్జీ చెప్పారు. తామంతా తృణమూల్ కాంగ్రెస్ గుర్తుపైనే ఎన్నికల్లో గెలిచామని, అసెంబ్లీలో అసలైన టీఎంసీ శాసనసభాపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని అన్నారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని స్పష్టంచేశారు. అఖ్రుజమన్‌ను చీఫ్ విప్‌గా, జావెద్ అహ్మద్ ఖాన్, సాందీపన్ సాహా, సబీనా యాస్మిన్, షియులీ సాహాను శాసనసభాపక్ష ఉపనేతలుగా నియమించినట్లు చెప్పారు. తమ శాసనసభాపక్షం కొత్త కూర్పును స్పీకర్ ఆమోదించారని, ప్రతిపక్ష నాయకుడి కోసం ఉద్దేశించిన కార్యాలయాన్ని తనకు కేటాయించారని తెలిపారు.ఎందుకీ ముసలం? తృణమూల్ కాంగ్రెస్‌లో శాసనసభాపక్ష నేతగా ఎవరిని నియమించాలన్న దానిపై తొలుత వివాదం మొదలైంది. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అసెంబ్లీ స్పీకర్‌కు గతవారం లేఖ రాశారు. సీనియర్ ఎమ్మెల్యే శోభన్‌దేవ్ చటోపాధ్యాయను టీఎంసీ శాసనసభాపక్ష నాయకుడిగా, ఫర్హాద్ హకీంను చీఫ్ విప్‌గా నియమించాలని కోరారు. ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను కూడా పంపించారు. దీనిపై రగడ జరిగింది. తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రితబ్రత, సాందీపన్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సీఐడీ విచారణకు కూడా దారితీసింది. అభిషేక్ బెనర్జీకి సీఐడీ అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. అనంతరం క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించారన్న కారణంతో రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ నాయకత్వం ప్రకటించింది. ఇదిలా ఉండగా, తమ అధినేత మమతా బెనర్జీ మాత్రమేనని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. ఆమె టీఎంసీ చైర్‌పర్సన్‌గా పనిచేస్తారని వెల్లడించారు. శాసనసభాపక్షానికి సంబంధించిన అంశాల్లో దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని అంగీకరించబోమని హెచ్చరించారు.వీరవిధేయుడే కానీ...కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీకి విధేయుడిగా పేరుగాంచిన రితబ్రత బెనర్జీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ఆమెపైనే తిరుగుబాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. బెంగాల్ దీదీని ఆయన కొంతకాలం క్రితం వరకు రష్యా దివంగత నేత వ్లాదిమిర్ లెనిన్తో పోల్చేవారు. ధీరవనితగా కొనియాడేవారు. అసలు సిసలైన ప్రజా నాయకురాలిగా కీర్తించేవారు. కమ్యూనిస్టు పార్టీ మాజీ నాయకుడైన రితబ్రత బెనర్జీ నేడు తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద చీలికను సృష్టించడం గమనార్హం. 28 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎన్నడూ లేని అంతర్గత తిరుగుబాటుకు నేతృత్వం వహించారు. ఆయన మరో ఏక్నాథ్ షిండే కాబోతున్నారంటూ రాజకీయ విశ్లేషణలు ఇప్పటికే మొదలయ్యాయి. ఏకంగా 58 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 46 ఏళ్ల యువకుడైన రితబ్రత వెనుక జట్టుకట్టడం ఆసక్తికరంగా మారింది. రితబ్రత 1979 నవంబర్ 15న కోల్‌కతాలో జని్మంచారు. కోల్‌కతాలోనే గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు. కాలేజీలో వామపక్ష భావజాలం ఉండేది. ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతూ టీవీ చర్చా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో గుర్తింపు సంపాదించారు. 2008లో వామపక్ష విద్యార్థి విభాగమైన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చురుకైన యువ నేతగా అందరి దృష్టిని ఆకర్శించారు. 2011లో 31 ఏళ్ల వయస్సులో కోల్‌కతా సౌత్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి సుబ్రతా బక్షి చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూశా రు. మూడేళ్ల తర్వాత 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా తట్టుకున్నారు. బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య, సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి ఆయనకు అండగా నిలిచారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా.. కమ్యూనిస్టు నాయకుడైన రితబ్రత బెనర్జీ జీవనశైలి అప్పట్లో విలాసవంతంగా ఉండేది. ఖరీదైన వస్తువులు, ఎల్రక్టానిక్ పరికరాలు ఉపయోగించేవారు. దీనిపై పార్టీలో అసంతృప్తి చెలరేగింది. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సీనియర్ నాయకులు విమర్శలు గుప్పించారు. క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. 2017లో రితబ్రతను సీపీఎం నుంచి బహిష్కరించారు. తర్వాత బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ విజయ్‌వర్గియాతో రితబ్రత సన్నిహితంగా మెలిగారు. ఓ మహిళకు సంబంధించిన వివాదంలో పోలీసు కేసు నమోదు కావడంతోపాటు చట్టపరమైన ఇబ్బందుల వల్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. 2020లో రాజ్యసభ సభ్యత్వం గడువు ముగిసిపోవడంతో అధికారికంగా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ కార్మిక విభాగమైన ఐఎన్టీటీయూసీకి సారథ్యం వహించారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి నమ్మినబంటుగా మారారు. ప్రతిఫలంగా 2024లో రాజ్యసభ సభ్యత్వం లభించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ టిక్కెట్ సైతం దక్కింది. ఎమ్మెల్యేగా గెలిచారు. అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా గొంతెత్తారు. పార్టీలో అతడి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ తిరుగుబాటు ప్రారంభించారు. -
బెంగాల్ రాజకీయాల్లో భూకంపం సృష్టించిన రితబ్రత బెనర్జీ ఎవరు?
అసలే ఓటమి బాధతో ఉన్న పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తుపై మరో పిడుగుపడేలా చేశారు రితబ్రత బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన నేత రితబ్రత బెనర్జీ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నేతగా స్పీకర్ రథీంద్ర బోస్ గుర్తించారని ప్రకటించిన విషయం తెలిసిందే. తమ తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేక శాసనసభా పక్షంగా గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌ను కూడా స్పీకర్ అంగీకరించారని ఆయన చెప్పారు.తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి మద్దతుగా 58 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిలిచి, శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్టు స్పీకర్ రథీంద్ర బోస్‌కు అధికారికంగా తెలియజేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.ఈ చర్యతో తృణమూల్ కాంగ్రెస్ శాసన విభాగంపై నియంత్రణ తిరుగుబాటు వర్గానికి వెళ్లినట్టయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత పార్టీ నాయకత్వానికి ఇప్పటివరకు ఎదురైన అతిపెద్ద సవాలుగా ఇది నిలిచింది.అసలు రితబ్రత బెనర్జీ ఎవరు?పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉలుబేరియా పూర్బా నియోజకవర్గం నుంచి రితబ్రత బెనర్జీ విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై 11,838 ఓట్ల తేడాతో గెలిచారు. తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎన్నికల పరాజయం ఎదుర్కొన్నప్పటికీ, రితబ్రత విజయం సాధించారు. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఘన విజయం సాధించింది.పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై సోమవారం బహిష్కరణకు గురైన ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో రితబ్రత ఒకరు. ఒకప్పుడు సీపీఎంలో ఎదుగుతున్న నాయకుడిగా, వామపక్షాల భవిష్యత్ నేతగా భావించేవారు. అయితే ఓ వివాదాస్పద ఘటన, వివాదాస్పద ఇంటర్వ్యూ తర్వాత ఆయన ఎదుగుదల ఆగిపోయింది. 2018లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించిన వెంటనే మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వర్గం రితబ్రతను బహిష్కరించింది. ప్రతిపక్ష నేతగా శోభన్‌దేబ్ చట్టోపాధ్యాయ్కు మద్దతు తెలిపిన పార్టీ లేఖపై తమ సంతకాలు నకిలీవని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారని ఆరోపణలు వచ్చాయి.రితబ్రత రాజకీయ ప్రయాణంలో అనేక కీలక మలుపులు ఉన్నాయి. వామపక్ష ఉద్యమంలో ప్రారంభించి, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వేగంగా ఎదిగి, సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడయ్యారు. పార్టీ కీలక యువ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తర్వాత వామపక్షాల్లో ఆయన ప్రభావం తగ్గి, 2017లో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఆయన రాజకీయ పునరాగమనం ప్రారంభమైంది. అక్కడ కూడా సంస్థాగతంగా ఎదిగారు. తొలుత పార్టీ కార్మిక సంఘ విభాగ బాధ్యతలు అప్పగించారు. తర్వాత రాజ్యసభ నామినేషన్ ఇచ్చి ప్రోత్సహించారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, రితబ్రత ఉలుబేరియా పూర్బా నియోజకవర్గాన్ని నిలబెట్టుకున్నారు.ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిగా ఆయనను చూస్తున్నారు. టీఎంసీలోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతును పొందారు. రితబ్రత బెనర్జీ పార్టీ నాయకత్వ అధికారాన్ని సవాలు చేస్తున్న తీరును మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సృష్టించిన రాజకీయ ప్రకంపనలతో పోలుస్తున్నారు. -
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. TMCలో తిరుగుబాటు
-
బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో భారీ చీలిక చోటు చేసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. ఇవాళ అసెంబ్లీలోకి వెళ్లి తనకు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రకటించారు. ఈ పరిణామంతో తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.టీఎంసీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ.. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల మద్దతు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతు తెలుపుతున్నారని, దీంతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు వర్గం ఆయనను ప్రతిపక్ష నేత (LoP)గా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. దీంతో అసెంబ్లీలో అధికార టీఎంసీకి వ్యతిరేకంగా కొత్త శక్తి రూపుదిద్దుకుంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.బెంగాల్లో టీఎంసీ దారుణ ఓటమి తర్వాత.. ఆ పార్టీలో మమతా బెనర్జీ నాయకత్వంపై అసంతృప్తి బయటపడుతోంది. ఇక ఇటీవల మమతా బెనర్జీ అధ్యక్షతన జరిగిన టీఎంసీ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో అది దాదాపు ఖాయమైంది. అదే సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలంతా విడిగా ఓ హెటల్లో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రీటా బ్రతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలు టీఎంసీ అంతర్గత రాజకీయాలను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. పార్టీ చీలిక నిజంగానే జరుగుతోందా? లేదంటే ఇది తాత్కాలిక అసంతృప్తి మాత్రమేనా? అన్నది బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.మహా సీన్ రిపీటా?టీఎంసీలో కొనసాగుతున్న అంతర్గత అసంతృప్తి మరింత పెరిగితే పార్టీపై మమతా బెనర్జీ పట్టు బలహీనపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం కీలకంగా మారితే.. పార్టీ ఆమె చేజారి పోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో గతంలో మహారాష్ట్ర రాజకీయాలు ఉదాహరణగా చెబుతున్నారు.2022లో మహారాష్ట్రలోని రాజకీయ సంక్షోభం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనలో మొదలైన అసంతృప్తి.. ఏక్నాథ్ షిండే వర్గం భారీగా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడంతో అసెంబ్లీలో మెజారిటీ సమీకరణం మారిపోయింది. చివరికి పార్టీ గుర్తు, నాయకత్వం కూడా మారిన పరిణామం రాజకీయంగా పెద్ద మలుపుగా నిలిచింది. రీటా బ్రతా బెనర్జీ చేసిన 50 మంది ఎమ్మెల్యేల మద్దతు వ్యాఖ్యలు ఆ దిశగా సంకేతాలిస్తున్నాయనే చెప్పొచ్చు. మహారాష్ట్ర శివసేన సంక్షోభం తరహాలో టీఎంసీలో కూడా ఎమ్మెల్యేల మద్దతు సమీకరణం మారితే, ప్రస్తుత అసంతృప్తి పెద్ద రాజకీయ సంక్షోభంగా మారే అవకాశం ఉందని మమతను విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎవరీ రీటా బ్రతా బెనర్జీ..రీటా బ్రతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వివాదాలతో పాటు వేగంగా ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కోల్‌కతా సౌత్ పాయింట్ హైస్కూల్, అసుతోష్ కాలేజీలో చదువుకున్న ఆయన 2000ల ప్రారంభంలో విద్యార్థి రాజకీయాల ద్వారా ముందుకు వచ్చారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో కీలక నాయకుడిగా ఎదిగి, సీపీఎం యువజన విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనను సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరికు దగ్గరగా ఉన్న యువ నాయకుడిగా భావించేవారు.తరువాత 34 ఏళ్లకే సీపీఎం ఆయనను రాజ్యసభకు పంపడం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం ఆయనను తొలుత సస్పెండ్ చేసి, తరువాత పూర్తిగా బహిష్కరించింది. అదే సమయంలో పార్టీ నాయకత్వంపై ఆయన బహిరంగ విమర్శలు చేయడం, అంతర్గత విభేదాలు తీవ్రమవ్వడం ఈ చర్యకు కారణమయ్యాయి. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన, పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టి తిరిగి రాజకీయంగా పుంజుకున్నారు.టీఎంసీలో చేరిన తర్వాత కూడా ఆయన ప్రయాణం వివాదాల నుంచి పూర్తిగా బయటపడలేదు. తాజాగా ఎమ్మెల్యే సంతకాల ఫోర్జరీ ఆరోపణల వివాదం ఆయనను మళ్లీ వార్తల్లోకి తెచ్చింది. పార్టీ కమ్యూనికేషన్లో తప్పుదారి పట్టించే సంతకాలు ఉన్నాయని ఆయనతో పాటు మరో ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేయడంతో, పార్టీ చర్యలు తీసుకుని ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య.. మమతకు దగ్గరేనా?తాజాగా ఆయన “50 మంది ఎమ్మెల్యేల మద్దతు” ఉందని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. రీటా ఒక్కసారిగా రెబల్ వర్గానికి కేంద్రబిందువుగా మారారు. అయితే ఈ మద్దతు ఎంతవరకు వాస్తవమో ఇంకా అధికారికంగా ధృవీకరణ కాలేదు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఇలాంటి క్లెయిమ్స్ సాధారణంగా అంతర్గత అసంతృప్తిని ఒక రాజకీయ శక్తిగా మార్చే ప్రయత్నంగా కూడా ఉండవచ్చు. అలాగే..మాజీ సీఎం మమతా బెనర్జీతో ఆయన సంబంధంపై చూస్తే.. ప్రారంభంలో పార్టీ వేదికలో భాగంగా ఉండటం వల్ల ఒక స్థాయి సాన్నిహిత్యం, రాజకీయ సమన్వయం ఉండే అవకాశం ఉంది. కానీ పార్టీ నిర్ణయాలపై భిన్న అభిప్రాయాలు పెరిగిన తర్వాత ఆ దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయనను మమతకు “దగ్గర నేత”గా కాకుండా, పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా నిలిచిన రెబల్ నేతగా మాత్రమే చూస్తున్నారు. -
ఆపిల్ వాచ్, ఖరీదైన పెన్, పార్టీ నుంచి సస్పెన్షన్
న్యూఢిల్లీ : వామపక్ష భావ జాలం పాటించే సీపీఎం ఆడంబరాలకు దూరంగా ఉంటుంది. అయితే పార్టీ సిద్ధాంతాలను మరిచి లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న ఓ ఎంపీపై సీపీఎం పార్టీ వేటు పడింది. పార్లమెంట్ సభ్యుడు రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి మూడు నెలల పాటు బహిష్కరించింది. వామపక్ష భావజాలానికి విభిన్నంగా ఆయన జీవనశైలి ఉందనే నెపంతో రితబ్రత బెనర్ పై బహిష్కరణ వేటు వేసింది. ఆయన ఎక్కువగా హై-టెక్, ఖరీదైన గాడ్జెట్లను వాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నేడు(శుక్రవారం) బెంగాల్ లో జరిగిన సమావేశంలో బెనర్జీపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. బెనర్జీపై వచ్చిన ఫిర్యాదులన్నింటిపైనా విచారణకు ఆ పార్టీ ఆదేశించింది. రెండు నెలల్లో దీనిపై నివేదిక రానుంది. అప్పటివరకు ఆయనపై ఈ సస్పెన్షన్ కొనసాగనుంది. ఖరీదైన ఆపిల్ వాచ్, లగ్జరీ మోంట్ బ్లాంక్ పెన్ (రూ.15వేల పైన నుంచి రూ. 60వేల రూపాయల మధ్యలో రేటు) వాడి బెనర్జీ ఇరకాటంలో పడ్డారు. సాకర్ మ్యాచ్ చూస్తూ ఖరీదైన యాక్ససరీస్ ధరించిన బెనర్జీ ఫోటోలను సీపీఎం నేత సుమిత్ తాల్కుదార్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అప్పట్లో దుమారం చెలరేగింది. అయితే బెనర్జీపై వచ్చిన ఫిర్యాదుతో పాటు ఆయనపై సస్పెన్షన్ వేటు అంశంపై మాట్లాడేందుకు బెంగాల్ సీనియర్ సీపీఎం నేత సుర్జ్యా కాంత మిశ్రా నిరాకరించారు. పార్టీలోని అంతర్గత అంశాలను బహిర్గతం చేయలేమని ఆయన తెలిపారు. -
రాజ్యసభకు ‘డిస్కో డాన్సర్’
* బెంగాల్ నుంచి ఎన్నికైన మిథున్ చక్రవర్తి * ముగిసిన రాజ్యసభ ఎన్నికలు * 55 సీట్లకుగాను 18 చోట్ల ఎన్నికలు * క్రాస్‌ఓటింగ్‌తో తృణమూల్‌కు అదనపు సీటు * ఒడిశాలో బీజేడీకి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. 16 రాష్ట్రాల్లోని 55 స్థానాలకు గానూ.. 12 రాష్ట్రాల్లోని 37 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. మిగిలిన 18 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. అనంతరం ఫలితాలు ప్రకటించారు. రాష్ట్రాలవారీగా ఫలితాలు.. పశ్చిమబెంగాల్: మొత్తం 5 స్థానాలకు గానూ.. తృణమూల్ కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులైన బాలీవుడ్ నటుడు ‘డిస్కో డ్యాన్సర్’ మిథున్ చక్రవర్తి, జోగెన్ చౌధురి, కేడీ సింగ్‌లు విజయం సాధించారు. లెఫ్ట్ ఫ్రంట్ అధికారిక అభ్యర్థి, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి రితబ్రత బెనర్జీ కూడా గెలుపొందారు. వారితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పాత్రికేయుడు అహ్మద్ హసన్ కూడా గెలిచారు. ఆయనకు తృణమూల్ మద్దతిచ్చింది. కాం గ్రెస్, వామపక్షాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ జరిపి హసన్‌కు ఓటేయడంతో ఆయన విజయం సులభమయింది. హసన్‌కు ఓటేసిన ఎమ్మెల్యేలు సుశీల్ రాయ్, ఎమాని బిశ్వాస్‌లను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఒడిశా మొత్తం 4 స్థానాలకు గానూ.. అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ తమ ముగ్గురు అధికారిక అభ్యర్థులైన ఏయూ సింగ్‌దేవ్, కల్పతరు దాస్, సరోజిని హేంబ్రాంలను గెలిపించుకుంది. వారితో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేత, ఐపీఎల్ చైర్మన్ రంజిబ్ బిశ్వాల్ గెలుపొందారు. బీజేడీ తమ అదనపు ఎమ్మెల్యేల ఓట్ల ను తాము మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థికి వేయించలేకపోవడంతో బిశ్వాల్ విజయం సాధించగలిగారు. అస్సాం మొత్తం 3 స్థానాలకు గానూ.. అస్సాం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఎంపీ సంజయ్ సింగ్, అస్సాం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భువనేశ్వర్ కాలితలు విజయం సాధించారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన బోడో పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థి బిశ్వజిత్ దైమారి కూడా గెలుపొందారు. ప్రతిపక్షాలు ఒక్కటై మద్దతిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ హైదర్ హుస్సేన్ ఓటమి పాలయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల సంఖ్య మహారాష్ట్ర - 7 ( కాంగ్రెస్ 2, ఎన్సీపీ 2, శివసేన 1, ఆర్పీఐ 1, స్వతంత్ర 1) తమిళనాడు-6 (ఏఐఏడీఎంకే 4, డీఎంకే 1, సీపీఎం 1) బీహార్ - 5 (జేడీయూ 3, బీజేపీ 2) గుజరాత్ - 4 ( బీజేపీ 3, కాంగ్రెస్ 1) మధ్యప్రదేశ్ -3 ( బీజేపీ 2, కాంగ్రెస్ 1) రాజస్థాన్ - 3 (బీజేపీ 3) హర్యానా - 2 (కాంగ్రెస్ 1, ఐఎన్ఎల్డీ 1) ఛత్తీస్‌గఢ్ - 2 ( కాంగ్రెస్ 1, బీజేపీ 1) జార్ఖండ్ - 2 (ఆర్జేడీ 1, స్వతంత్ర 1) హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ - 1 చొప్పున (మూడూ కాంగ్రెస్‌కే)


