నానా పటేకర్ ఏడ్చిన వేళ..
అహ్మద్ నగర్/మహారాష్ట్ర: తమ చుట్టుపక్కల కనిపిస్తున్న దుర్భర పరిస్థితులు చూసి కూడా గొంతెత్తి చెప్పకపోవడం నేరం అవుతుందని ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అన్నారు. మహారాష్ట్ర కరువు పరిస్థితులపై మీడియాతో మాట్లాడుతూ పటేకర్ కంటతడి పెట్టారు. పేదరికం, కరువు పీడిత రైతులు, వ్యవసాయ సంక్షోభం గురించి కాస్తంత భావోద్వేగంగానే మాట్లాడే పటేకర్ ఈసారి మాత్రం మహారాష్ట్రలో నెలకొన్న కరువు పరిస్థితిపై, రైతులు అనుభవిస్తున్న బాధలపై తీవ్ర ఆవేదన చెందుతూ కళ్లు చెమర్చారు.
'మహారాష్ట్రలోని చాలా కుటుంబాలు సిటీలకు వలస క్యూలు కడుతున్నాయి. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను.. ఎవరైనా మీ కారు అద్దాలను తట్టి చేతులు జోడిస్తే వారిని భిక్షగాళ్లలాగా చూడకండి. వారంతా రైతులు, నిస్సహాయులు. వారికి ఆహారం, నీళ్లు కావాలి. టాయిలెట్లకు డబ్బు చెల్లించాలి. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని వారిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోండి' అని ఆయన చెప్పారు.
నీటి కరువు నేపథ్యంలో మహారాష్ట్రలో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించకూడదని బాంబే కోర్టు ఇచ్చిన తీర్పు పెద్ద ఊరటనిస్తుందని, కరువును పారద్రోలుతుందని అనుకోనని, అయితే అది ఒక మంచి ముందడుగు అని చెప్పారు. 'వచ్చే రెండు నెలలు మరింత భయంకరంగా ఉండనున్నాయి. మనం ముందే తేరుకుని ఉంటే అసలు వాటర్ ట్రైన్ పంపించాల్సిన అవసరం ఉండేదికాదు. ప్రజలుగా మనం విఫలమయ్యాం. నాయకులుగా వారు విఫలమయ్యారు. అంతా ఇక్కడి పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. కానీ ఎవరూ ప్రశ్నించడానికి ముందుకు రావడం లేదు. రండి వ్యవస్థను ప్రశ్నించండి. అలా మౌనంగా ఉండటం పెద్ద నేరం' అని పటేకర్ చెప్పారు.