- విశాఖపట్నం ఘటనపై లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఫిర్యాదు
- బాధ్యులపై సభాహక్కుల ఉల్లంఘన చర్యలు చేపట్టాలి
- ఈ అంశాన్ని సభలో లేవనెత్తేందుకు అనుమతి ఇవ్వాలి
- సభాపతికి నోటీసు అందజేసిన ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా విశాఖపట్నంలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి వెళ్లగా విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమపట్ల దురుసుగా ప్రవర్తించారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ హక్కులకు భంగం కలిగించారని, వారిపై సభాహక్కుల ఉల్లంఘన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇతర ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వి.విజయసాయిరెడ్డిలతో కలసి శుక్రవారం స్పీకర్‌కు నోటీసులు అందజేశారు. ‘‘లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని 223 నిబంధన కింద సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నాను.
జవవరి 26న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పోలీసులు నన్ను అడ్డగించి, అడుగు కూడా ముందుకు కదలనివ్వలేదు. పోలీసులు సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. వారి పేర్లుగానీ, గుర్తింపు కార్డులు గానీ ప్రదర్శించలేదు. ప్రివిలేజెస్ కమిటీ విచారణ కోసం వారిని పిలిపిస్తే నేను గుర్తుపట్టగలను. అలాగే ఎయిర్‌పోర్టు అథారిటీ సిబ్బందిపై కూడా ఫిర్యాదు చేస్తున్నాను. ఎంపీల విషయంలో, రాష్ట్ర ప్రతిపక్ష నేత విషయంలో వారు ప్రొటోకాల్ పాటించలేదు’’ అని ఈ నోటీసులో పేర్కొన్నారు.
అంతా ప్రణాళిక ప్రకారమే..
‘‘ఇదంతా తమ రాజకీయ బాసుల ఆజ్ఞల మేరకు డీసీపీ ఎ.ఎస్.ఖాన్ రచించిన ప్రణాళికగా అర్థమవుతోంది. ఆయన మాకు కొంత దూరంగా ఉండి మమ్మల్ని గమనిస్తూ ఫోన్‌లో, సంజ్ఞల ద్వారా డీఎస్పీ చిట్టిబాబుకు ఆదేశాలు ఇస్తున్నారు. ఎ.ఎస్.ఖాన్, చిట్టిబాబులు వ్యవహరించిన తీరు ఒక ఎంపీగా నాకు ఉన్న హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నా విధులు నిర్వర్తించేందుకు వెళుతుండగా ఎయిర్‌పోర్టులో నాపై దాడి చేశారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. అలాగే ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ప్రివిలేజెస్ కమిటీకి పంపి, నిర్ధిష్ట గడువులో నివేదిక ఇచ్చేలా చూడాలని అభ్యర్థిస్తున్నా. మా పట్ల అనుచితంగా ప్రవర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నా. అలాగే విధులు సక్రమంగా నిర్వర్తించని ఎయిర్‌పోర్టు అథారిటీ, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలి’’ అని నోటీసులో వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
వారు ఎవరో తెలియదు
‘‘విమానం దిగగానే గూండాల్లాగా ఉన్న కొంతమంది వచ్చి చుట్టుముట్టారు. ఇతర ప్రయాణికుల నుంచి మమ్మల్ని వేరు చేశారు. బలవంతంగా తోస్తూ అరైవల్ టెర్మినల్‌కు కాకుండా వేరే చోటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అరైవల్ టెర్మినల్‌కు వెళ్లనివ్వాలని విన్నవించినా వారు వినలేదు. దీంతో నిరసనగా అక్కడే కూర్చున్నాం. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారని వారిని అడిగాను. సెక్షన్ 144(3) అమల్లో ఉన్నందున మీరు ఒక బృందంగా ఉండకూడదని డీఎస్పీ సమాధానం ఇచ్చారు. వాళ్లు పోలీసు సిబ్బందా? లేక గూండాలా? లేక అధికార పార్టీ కార్యకర్తలా? అనేది తెలియదు’’ అని వివరించారు.